Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ‌కు పెద్ద గండం అదే.. ఆ ఒక్కటి లేక‌పోతే..!

బిజెపి జాతీయ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ కనిపిస్తోంది. ప్రధానంగా బిజెపి జాతీయ నాయకులు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   7 July 2025 7:00 AM IST
చిన్న‌మ్మ‌కు పెద్ద గండం అదే.. ఆ ఒక్కటి లేక‌పోతే..!
X

బిజెపి జాతీయ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ కనిపిస్తోంది. ప్రధానంగా బిజెపి జాతీయ నాయకులు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ఈ పదవిని ఇవ్వాలని భావిస్తున్నప్పటికీ ఈ రాష్ట్రాల్లో కూడా ఏది తనకు అనుకూలంగా ఉంటుంది.. అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఏపీ విషయానికి వస్తే బిజెపికి ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దగా సవాళ్లు అయితే కనిపించడం లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఎలానో ఇక్కడ విజయం దక్కించుకున్నారు. కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. మళ్లీ ఎన్నికలు రావడానికి కనీసం నాలుగు సంవత్సరాలు సమయం ఉంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఏపీ బిజెపి పెద్దగా దృష్టి సారించాల్సిన అవసరం లేదు. పైగా కూటమి ప్రభుత్వంలోనే ఉన్నందు న ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చే ఆలోచన కూడా బిజెపికి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీకి బిజెపి జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్న ఆలోచన బీజేపీ నాయకుల్లో నెలకొన్నట్టు తెలుస్తుంది. కానీ ఏపీ నుంచి రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పోటీలో ఉన్నారు. ఈమె పట్ల పార్టీ అధిష్టానానికి వ్యతిరేకత లేకపోయినా ఆమె పట్ల సానుకూలంగానే ఉన్నప్పటికీ దీర్ఘకాలిక రాజకీయాలను పరిగణలోకి తీసుకుంటే దగ్గుబాటి వల్ల జాతీయ రాజకీయాల్లో లేదా దక్షిణాది రాజకీయాల్లో బిజెపికి ఇప్పటికిప్పుడు కనిపించే ప్రయోజనం పెద్దగా ఏమీ లేదని భావిస్తున్నారు.

ఇక తమిళనాడు విషయానికి వస్తే ఇక్కడి నుంచి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అదేవిధంగా వానతి శ్రీనివాసన్ కూడా జాతీయ అధ్యక్ష పదవిలో ఉన్నారని తెలుస్తోంది. వీరిద్దరూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు కావడం, పార్టీకి అత్యంత విధేయులుగా పేరు తెచ్చుకోవడంతో పాటు దీర్ఘకాలికంగా బిజెపిలోని కొనసాగుతున్నారు. దీంతో వీరిద్దరి విషయంలో ఆర్ఎస్ఎ స్ వైపు నుంచి కూడా మద్దతు ఉన్నట్టు తెలుస్తుంది. వానతి శ్రీనివాసన్ 1983 నుంచి కూడా ఆర్ఎస్ఎస్లో కొనసాగుతున్నారు. బిజెపికి అత్యంత విధేయరాలిగా ఉన్నారు.

ఇక నిర్మల సీతారామన్ విషయానికి వస్తే ఆమె కూడా అత్యంత విధేయరాలిగా కొనసాగుతున్నారు. ఈవిడ 1990 నుంచి ఆర్ ఎస్ ఎస్‌ కార్యకర్తగా బీజేపీ నాయకురాలుగా కొనసాగుతున్నారు. పైగా బలమైన కౌంటర్లు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్న నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. దీంతో వీరిద్దరి విషయంలోనూ ఆర్ఎస్ఎస్ ప్రముఖులు అనుకూలంగా ఉన్నారని చర్చ జరుగుతోంది. ఇది ఒకరకంగా పురందేశ్వరి ఆశలకు గండి కొట్టే అవకాశం కనిపించేలా చేసింది. మరో కీలక కారణాన్ని పరిశీలిస్తే వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. బిజెపి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనేది చాలా సంవత్సరాలుగా పెట్టుకున్న ఆశ.

ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని గత ఏడాది కూడా పార్లమెంట్ ఎన్నికల్లోను అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోను పోటీ చేసింది అయినా ఆశించిన ఫలితం కనిపించలేదు. ఇక ఇప్పుడుఈ రాష్ట్రానికే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని అప్పగించడం జరిగితే తమకు లాభిస్తుందన్నది కమలనాధుల ఆశగా ఉన్నట్టు తెలుస్తోంది. మరికొద్ది మాసాల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండడం, ఇక్కడ రాజకీయంగా పుంజుకోవాలన్న బలమైన వ్యూహంతో బిజెపి అడుగులు వేస్తున్న నేపథ్యంలో వానతి శ్రీనివాసన్ లేదా నిర్మలా సీతారామన్ లలో ఒకరిని బిజెపి జాతీయ అధ్యక్ష పదవికి ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే పురందేశ్వరి పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ రాజకీయపరమైన అవసరాలు, సుదీర్ఘ రాజకీయ లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటున్న బిజెపి.. ఆమెను పక్కన పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఒక్క అంశం కనుక మిస్ అయితే పురందేశ్వరికే పగ్గాలు అప్పగించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.