Begin typing your search above and press return to search.

బెంగాల్ లో రాజకీయ సునామీ.. మమత కోట కుప్పకూలుతున్న సంకేతాలు!

బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ కొట్టిపడేస్తున్నా, ఆ పార్టీ నేతలను లోలోన ఏదో అనుమానం వెంటాడుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   29 May 2026 5:00 AM IST
బెంగాల్ లో రాజకీయ సునామీ.. మమత కోట కుప్పకూలుతున్న సంకేతాలు!
X

పశ్చిమబెంగాల్ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. తాము గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందంటూ బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోందని చెబుతున్నారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ కొట్టిపడేస్తున్నా, ఆ పార్టీ నేతలను లోలోన ఏదో అనుమానం వెంటాడుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న బీజేపీ బెంగాల్ లో మరింత పట్టు సాధించేందుకు ఏమైనా ప్రత్యేక వ్యూహం రచించిందా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ ఎంపీ ప్రకటనతో బెంగాల్ లో రాజకీయ కల్లోలం మొదలైంది. టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు, 50 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ బీజేపీ ఎంపీ చేసిన ప్రకటన వ్యూహాత్మకమా? లేక నిజంగానే తృణమూల్ లో పెను తుఫాన్ కు ముందస్తు హెచ్చరికా? అంటూ చర్చ జరుగుతోంది. పదిహేనేళ్ల పాటు బెంగాల్ లో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన మాజీ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి చెక్ పెట్టేలా బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని, అందులో భాగంగా ఆమెను ఆత్మరక్షణలోకి నెట్టేందుకు ఇలాంటి ప్రచారం చేస్తుందని పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే 2021 ఎన్నికల సమయంలో బెంగాల్ ఫలితాలు విడుదల కాకముందు కొందరు నేతలు బీజేపీలోకి జంప్ చేయడం, అయితే ఆ ఎన్నికల్లో టీఎంసీ అధికారంలోకి రావడంతో వారంతా యూటర్న్ తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో నిజం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. అదే జరిగితే మమతా బెనర్జీ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. అయితే బీజేపీ ఎంపీ చేసిన ప్రకటన పూర్తిగా బోగస్ అంటూ టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ తేల్చిచెప్పారు. కేడర్ ను తప్పుదారి పట్టించేందుకు బీజేపీ మైండ్ గేమ్ అడుతోందని ఎదురుదాడి చేశారు.

ఏదిఏమైనప్పటికీ ప్రస్తుతం బీజేపీ రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి గతంలో టీఎంసీలో పనిచేసి ఉండటంతో ఆయనతో చాలా మంది నేతలకు సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. అధికారం కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మారినా తమ చట్టసభల సభ్యత్వాలు రద్దు కాకుండా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్ లో టీఎంసీకి 29 మంది ఎంపీలు ఉండగా, 20 మంది ఎంపీలు వచ్చేస్తున్నారని చెప్పడం వ్యూహాత్మకమే అంటున్నారు. దీనివల్ల గరిష్టంగా చేరికలను ప్రోత్సహించే ప్లాన్ ఉండొచ్చని అనుమానిస్తున్నారు.