Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ ఆత్మగౌరవంపై బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్న.. సంచలనం

తెలంగాణ బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   2 July 2025 6:30 PM
బీఆర్ఎస్ ఆత్మగౌరవంపై బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్న.. సంచలనం
X

తెలంగాణ బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాపార రంగాన్ని ఆంధ్ర ప్రదేశ్‌కు చెందినవారికి తాకట్టు పెట్టిందని ఆయన ఆరోపించారు.

- కాంట్రాక్టులన్నీ ఏపీ వారికి..

రాకేష్ రెడ్డి మాట్లాడుతూ "గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతీ పెద్ద కాంట్రాక్ట్ ఆంధ్రా వాళ్లకే పోయింది. తెలంగాణ పేరుతో తప్పుడు సెంటిమెంట్లను రగిలించి, వారికే లాభం చేకూర్చారు. బీఆర్ఎస్ నేతల వ్యాపార భాగస్వాములందరూ ఏపీకి చెందినవారే" అని విమర్శించారు.

- "నా భార్యది నెల్లూరు... సీఎం అల్లుడిదీ ఆంధ్రా!"

తాను వ్యక్తిగతంగా ఎలాంటి ప్రాంతీయ వివక్షను నమ్మనని స్పష్టం చేస్తూ "నా భార్యది నెల్లూరు. సీఎం రేవంత్ రెడ్డి అల్లుడిది కూడా ఆంధ్రా. కానీ నిజాలు దాచలేం. తెలంగాణ పేరుతో రాజకీయ లాభాలు పొందే వారు వాస్తవాలను ఒప్పుకోవాలి" అని అన్నారు.

-"తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఏంటి?"

"తెలంగాణ సెంటిమెంట్ ఇప్పుడు కొంతమందికి ఫ్యాషన్ అయిపోయింది. అవసరాల కోసం దాన్ని వాడుతున్నారు. ఆదిలాబాద్‌, వరంగల్ తండాల్లో ప్రజలకు అన్యాయం జరుగుతుంటే, ఎవరికీ పట్టదా? అప్పుడే తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడండి" అని రాకేష్ రెడ్డి ప్రశ్నించారు.

- బతుకమ్మ అందరిది... తెలంగాణ కూడా అందరిదే!

"కొందరు ఆడితేనే బతుకమ్మ కాదన్న భావన తప్పు. బతుకమ్మ తెలంగాణలో ప్రతి ఒక్కరిదీ. తెలంగాణ పదాన్ని ఇక తక్కువగా వాడాలని సూచిస్తున్నాను. ఎందుకంటే వాస్తవానికి తగ్గట్టుగా ఆ పదాన్ని గౌరవించకపోతే దానికే అవమానం" అని ఆయన వ్యాఖ్యానించారు.

రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత పాలనపై ఆయన చేసిన విమర్శలు, ప్రస్తుత ప్రభుత్వానికి చేసిన సూచనలు అధికార బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పార్టీలకు కంటగింపుగా మారే అవకాశం ఉంది.