టీడీపీ ఎమ్మెల్యేతో వేగలేకపోతున్నా.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సోమవారం అసెంబ్లీ జీరో అవర్ లో మాట్లాడిన ఎమ్మెల్యే ఈశ్వరరావు టీడీపీ ఎమ్మెల్యే నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు.
By: Tupaki Desk | 23 Sept 2025 7:23 PM ISTఏపీలో కూటమి పార్టీల మధ్య లుకలుకలు నెమ్మదిగా బయటపడుతున్నాయి. మరో 15 ఏళ్లు మూడు పార్టీలు కలిసే ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నా, కొందరు ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన నేతలు ఆధిపత్య పోరు ప్రచ్ఛన్న యుద్దానికి దారితీస్తోంది. అయితే ఇన్నాళ్లు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట స్థానిక తెలుగుదేశం నేతలతో ఈ విభేదాలు పొలిటికల్ వార్ కు దారితీయగా, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా కొత్త విషయం బయటకొచ్చింది. ప్రతిపక్షం వైసీపీ నేతలతో యుద్ధం చేసి గెలవొచ్చు కానీ, సొంత కూటమిలోనే పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేతో సవితి పోరు పడలేకపోతున్నానని ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే నడికుదిడి ఈశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం అసెంబ్లీ జీరో అవర్ లో మాట్లాడిన ఎమ్మెల్యే ఈశ్వరరావు టీడీపీ ఎమ్మెల్యే నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు.
గత ఎన్నికల్లో ఎచ్చెర్ల అసెంబ్లీ సీటును అనూహ్యంగా దక్కించుకున్న ఈశ్వరరావు కూటమి హవాలో ఎమ్మెల్యేగా సునాయాశంగా గెలిచారు. ఈయన నియోజకవర్గం నుంచే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా గతంలో ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ నేత కళావెంకటరావుకు ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతల్లో మంచి ఫాలోయింగు ఉంది. అయితే ఎమ్మెల్యే కళా, ఎంపీ కలిశెట్టితో సమన్వయంతో పనిచేసుకుపోతున్న ఎమ్మెల్యే ఈశ్వరరావుకు పక్కనే ఉన్న మరో టీడీపీ ఎమ్మెల్యే నుంచి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే అసెంబ్లీలో బయటపెట్టడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
సోమవారం శాసనసభలో మాట్లాడిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు తాను బీజేపీ ఎమ్మెల్యేని అని చిన్నచూపు చూస్తారా? అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. తనను టార్గెట్ చేసిన పక్క నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనంతటికీ కారణం నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వైసీపీ నేతల క్వారీపై తాను ఫిర్యాదు చేయడమేనని ఆయన అసెంబ్లీ ద్రుష్టికి తెచ్చారు. గత ఏడాది జూన్ 4న ఎమ్మెల్యేలుగా మనమందరం గెలిస్తే.. 5వ తేదీన ఓ వైసీపీ నేతకు చెందిన సంస్థకు క్వారీ లీజు ఇచ్చారని, నిబంధనలకు వ్యతిరేకంగా క్వారీ లైసెన్సు ఇవ్వడాన్ని తాను అధికారుల ద్రుష్టికి తీసుకువెళితే.. వారితో కూటమి ఎమ్మెల్యే చేయి కలిపి తనపైనే కక్ష సాధిస్తున్నారని ఎమ్మెల్యే ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులతో ఎంతైనా పోరాటం చేయొచ్చు గానీ, సొంత కూటమికే చెందిన పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే కుట్రలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు. ఈ సమయంలో సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ క్రిష్ణం రాజు కల్పించుకుని ఇది జీరో అవర్ అని ఎమ్మెల్యే సమస్యను మరో విధంగా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువెళ్లాలని సలహా ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కూటమిలో పెద్ద చర్చకు దారితీశాయి. బీజేపీ ఎమ్మెల్యేని ఇబ్బంది పెడుతున్నా ఆ టీడీపీ ఎమ్మెల్యే ఎవరంటూ మిగిలిన ఎమ్మెల్యేలు ఆరా తీయడం కనిపించింది. ఇక ఉత్తరాంధ్ర రాజకీయాలపై అవగాహన ఉన్న ఎమ్మెల్యేలు కొందరు సదరు టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పటికే సీఎం చంద్రబాబు ద్రుష్టిలో ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల ఓ ఘటనలో తీవ్ర వివాదాస్పదమైన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ నుంచి చీవాట్లు తిన్నట్లు చెబుతున్నారు.
