Begin typing your search above and press return to search.

విండో సీటు కోసం సామాన్యుడిని కొట్టించిన ఎమ్మెల్యే..!

ఉన్న‌త హోదా ఉన్నవారు సాధారణంగా మర్యాదగా ప్రవర్తించాలనుకుంటాం. కానీ తాజా ఘటన చూస్తే ‘పదవిలో ఉంటే భయం మరిచిపోతారా?’ అన్న ప్రశ్న వస్తోంది

By:  Tupaki Desk   |   21 Jun 2025 8:30 PM
విండో సీటు కోసం సామాన్యుడిని కొట్టించిన ఎమ్మెల్యే..!
X

ఉన్న‌త హోదా ఉన్నవారు సాధారణంగా మర్యాదగా ప్రవర్తించాలనుకుంటాం. కానీ తాజా ఘటన చూస్తే ‘పదవిలో ఉంటే భయం మరిచిపోతారా?’ అన్న ప్రశ్న వస్తోంది. జార్ఖండ్‌ బబినా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ ఒక సామాన్య ప్రయాణికుడిపై దాడికి తెగబడ్డారు. కారణం వినగానే ఆశ్చర్యం, షాక్ కలుగుతుంది. విండో సీటు విషయంలో జరిగిన చిన్న వివాదం అంత గొడవకు దారితీసింది.

ఈ ఘటన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకుంది. ఈ రైలులో E2 కోచ్‌లో 49 నెంబర్ విండో సీటుపై ప్రయాణికుడు రాజ్ ప్రకాష్ కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో అదే రైల్లో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ అతనిని నిలబెట్టి ‘ఈ సీటు ఖాళీ చేయి.. నువ్వు 8వ సీటుకి పో’ అని ఆదేశించారు. అయితే రాజ్ ప్రకాష్ తన బుక్ చేసిన సీటు వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు.

అంతే ఎమ్మెల్యే కోపంతో ఊగిపోయారు. తన అనుచరులను ఝాన్సీ స్టేషన్ వద్ద రైలెక్కించి.. రాజ్ ప్రకాష్‌ను బాదించారు. ఈ దాడిలో రాజ్ ప్రకాష్ ముక్కు పగిలి రక్తగాయాలతో పడిపోయాడు. ఇది చూసిన ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. ఇంతటి అధికారం దుర్వినియోగం అంటూ సోషల్ మీడియా అంతా మండిపడుతోంది.

సామాజిక మాధ్యమాల్లో ప్రజలు దీనిపై ప్రశ్నిస్తున్నారు.. 2025లో దేశపు ప్రీమియం రైలు అయిన వందే భారత్‌లోనూ ఒక ఎమ్మెల్యే తన గూండాలను పిలిపించి ఓ సాధారణ ప్రయాణికుడిని కొట్టిస్తే.. ప్రజాస్వామ్యానికి అర్ధం ఏంటి? చట్టం ఏంటి? ఎమ్మెల్యే రాజీవ్ సింగ్‌పై ఎలాంటి చర్యలు కూడా తీసుకోబడకపోవచ్చని అనుమానిస్తున్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా.. రాజకీయ ఒత్తిళ్లతో దాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తారు అన్నది సామాన్యుల మాట.

ఇది ఒక్క రాజీవ్ సింగ్ కేసే కాదు అంటున్నారు నెటిజన్లు. కొంతమంది నేతలు పార్టీ మారినా వ్యవహారశైలి మారదు అంటున్నారు. అధికార మదంతో మత్తెక్కిపోయిన ఎన్నో మంది ఎమ్మెల్యేలు ప్రజలను చిన్నచూపు చూస్తూ.. తమ అహంకారం దెబ్బతినిందంటే నిష్టూరంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనతో మరోసారి స్పష్టమైంది. అధికారం లభిస్తే దానిని దుర్వినియోగం చేసే నేతలు భారత రాజకీయాల్లో ఇంకా తగ్గలేదని. దీన్ని అరికట్టేంతవరకూ సామాన్యుడి జీవితం ఇలాంటి అణచివేతలకు గురవుతూనే ఉంటారు.