విష్ణు వర్సెస్ గంటా.. లడాయి ఇప్పటిది కాదుగా ..!
ఈ పరిణామాలకు తోడు.. తాజాగా మరోసారి.. గంటా కేంద్రంగానే విష్ణు చక్రం తిప్పారు. విశాఖలోని ఫిలిం క్లబ్ భూముల వ్యవహారంపై విచారణ కోరుతూ.. కలెక్టర్‌కు నివేదిక పంపించారు.
By: Tupaki Desk | 27 April 2025 10:30 AMఇద్దరూ కూటమి నాయకులే. ఇద్దరూ సీనియర్లే. కానీ.. రోడ్డున పడ్డారు. మీడియా చూస్తోందన్న విషయాన్ని కూడా మరిచి.. వాదులాడుకున్నారు. ఈ వ్యవహారం.. కూటమి పార్టీల్లో ఉన్న అంతర్గత కుమ్ములాటలను పట్టి చూపింది. అంతేకాదు.. సీనియర్ల మధ్యే వివాదాలు రోడ్డెక్కడం.. నువ్వెంత? అంటూ.. వ్యాఖ్యలు చేసుకోవడం వంటివి అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలను రోడ్డున పడేసినట్టు అయింది.
ఈ వ్యవహారం.. ఇక్కడితో పోతుందా? అనేది ప్రశ్న. కానీ.. గతంలో ఉన్న అనుభవాలను చూస్తే.. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు మధ్య పాత వివాదాలు కూడా ఉన్నాయి. మంత్రిగా గంటా ఉన్న సమయంలో కూడా.. విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలో పాఠశాలలకు వేసిన రంగులు, సున్నాలు, కొన్న ఫర్నిచర్ విషయంలో అవినీతి జరిగిందని విష్ణు ఆరోపించారు.
ఇదేదో బయట జరిగిన వ్యవహారం కాదు. అసెంబ్లీ సాక్షిగానే అప్పట్లో విష్ణుకుమార్ చిర్రెత్తేలా మాట్లాడారు. పాఠశాల విద్యలో అవినీతి.. పాఠాలు నేర్పుతున్నారని సభలోనే వ్యాఖ్యానించారు. దీనిపై అప్పట్లో నాలు గు రోజుల పాటు గంటా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అప్పట్లోనే సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పరిణామాలే.. ఇప్పుడు గంటాకు అవకాశం లేకుండా చేసిందన్న ఆవేదన కూడా ఆయన లో ఉంది.
ఈ పరిణామాలకు తోడు.. తాజాగా మరోసారి.. గంటా కేంద్రంగానే విష్ణు చక్రం తిప్పారు. విశాఖలోని ఫిలిం క్లబ్ భూముల వ్యవహారంపై విచారణ కోరుతూ.. కలెక్టర్‌కు నివేదిక పంపించారు. ఇదే .. ఇప్పుడు ఇరువురి మధ్య వివాదానికి దారితీసింది. అంతేకాదు.. రోడ్డుమీదే ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకునే దాకా వచ్చింది. ఇప్పటికైనా.. చంద్రబాబు జోక్యం చేసుకుని సరిదిద్దక పోతే.. వీరి వివాదం జిల్లా వ్యాప్తంగా వ్యాపించే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.