Begin typing your search above and press return to search.

పవన్ కు ప్రమోషన్.. పెద్ద భారమే మోపుతున్న బీజేపీ!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై బీజేపీ అధిష్టానం పెద్ద భారం మోపనుందనే ప్రచారం ఆసక్తి రేపుతోంది.

By:  Tupaki Desk   |   12 March 2026 12:00 AM IST
పవన్ కు ప్రమోషన్.. పెద్ద భారమే మోపుతున్న బీజేపీ!
X

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై బీజేపీ అధిష్టానం పెద్ద భారం మోపనుందనే ప్రచారం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేనాని పవన్ రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపుతున్నారని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. జనసేనాని సినీ గ్లామర్ తోపాటు రాజకీయంగా ఆయన చూపుతున్న దూకుడును వాడుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చిన బీజేపీ అగ్ర నాయకత్వం ఎన్డీఏలో పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనకి వచ్చారని అంటున్నారు. ప్రధానంగా దక్షిణ భారత్ లో ఎన్డీఏ పార్టీల బలోపేతానికి పవన్ ను వాడుకోవాలని బీజేపీ భావిస్తోందని చెబుతున్నారు.

రాజకీయంగా పవన్ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం ఎన్డీఏలో పవన్ కు కీలక పదవి, బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించిందని అంటున్నారు. ఇప్పటివరకు లేని పదవిని పవన్ కోసమే క్రియేట్ చేయాలనే ఆలోచన చేస్తోందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును జాతీయ రాజకీయాలకు తీసుకువెళతారన్న ప్రచారం జరుగుతున్న ఈ పరిస్థితుల్లో పవన్ ను కూడా దక్షిణ భారత్ స్థాయిలో వాడుకోవాలనే ఆలోచన బీజేపీ పెద్దలు చేస్తుండటం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం జనసేనాని పవన్ జాతీయస్థాయిలో బీజేపీకి గట్టి మద్ధతుదారుగా ఉన్నారు. 2014లో పార్టీ పెట్టిన నుంచి ప్రధాని మోదీతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న పవన్.. 12 ఏళ్లుగా బీజేపీతో కలిసే పనిచేస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ అజెండాకు దగ్గరగా పవన్ సిద్ధాంతాలు ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. రెండు పార్టీల మధ్య చాలా విషయాల్లో సారూప్యత ఉండటంతో పవన్ ను ప్రోత్సహిస్తూ ఆయనను దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి బీజేపీ వాడుకుంటోందని గుర్తుచేస్తున్నారు. గతంలో మహారాష్ట్రలో పవన్ తో ఎన్నికల ప్రచారం చేయించారు. ఆ తర్వాత కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో సభలు నిర్వహించి పవన్ ను ఆహ్వానించారు.

ఈ కార్యక్రమాలకు పవన్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడిగా మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ పదవులకు మించిన హోదాతో పవన్ ను గౌరవించాలని, ఆయన ప్రతిష్ఠ పెంచాలని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోందని చెబుతున్నారు. ఎన్డీఏలో ఉప కన్వీనర్ గా నియమించి, దక్షిణ భారత్ బాధ్యతలు పూర్తిగా పవన్ కు అప్పగించాలనే ప్రతిపాదనను సీరియస్ గా పరిణిస్తున్నారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం పవన్ విషయంలో సానుకూల దృక్పథంతో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రికి కీలక బాధ్యతలు అప్పగించనున్నారనే ప్రచారం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో పవన్ పదవిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ఇప్పటివరకు పవన్ కు పదవి ఇవ్వకపోయినా దక్షిణ్ భారత్ లో ప్రధాన రాజకీయ వ్యూహాల అమలుకు ఆయనను అస్త్రంగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా తమిళనాడులో టీవీకే అధిపతి విజయ్ ను ఎన్డీఏ కూటమిలోకి తెచ్చే బాధ్యతను పవన్ కే అప్పగించారని అంటున్నారు. ఈ విషయంలో పవన్ కొంతవరకు సానుకూల ఫలితం కూడా సాధించారని అంటున్నారు. అందుకే విజయ్ ఎన్డీఏలో చేరికను తీవ్రంగా వ్యతిరేకించిన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ ఒక్క రోజులోనే తన స్వరం మార్చుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. చాప కింద నీరులా పవన్ రాజకీయ వ్యూహాలు అమలు చేస్తుండటం వల్ల బీజేపీ అగ్ర నాయకత్వం ఆయన విషయంలో హ్యాపీగా ఉందని, పవన్ కు ఏ పని అప్పగించినా సమర్థంగా పూర్తి చేస్తారన్న నమ్మకం పెట్టుకుందని అంటున్నారు.