Begin typing your search above and press return to search.

కరీంనగర్ పీఠంపై బీజేపీ.. కమలం పార్టీకి దక్కిన ఏకైక కార్పొరేషన్

తెలంగాణలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగురవేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానానికే పరిమితమైంది.

By:  Tupaki Political Desk   |   17 Feb 2026 12:09 AM IST
కరీంనగర్ పీఠంపై బీజేపీ.. కమలం పార్టీకి దక్కిన ఏకైక కార్పొరేషన్
X

తెలంగాణలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగురవేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానానికే పరిమితమైంది. 116 మున్సిపాలిటీలకు ఒక్కచోట కూడా ఆధిక్యం ప్రదర్శించలేకపోయింది. 7 కార్పొరేషన్లకు గాను రెండు చోట్ల మెజార్టీ స్థానాలు దక్కించుకున్నా సొంతంగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే అంత బలం లేక సతమతమైంది. అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ సమర్థంగా వ్యవహరించి, కట్టుదిట్టమైన ప్రణాళికతో కరీంనగర్ పై కాషాయ జెండా ఎగురవేశారు. ఇదే సమయంలో నిజామాబాద్ కార్పొరేషన్ లో బీజేపీ అతిపెద్దగా అవతరించినా, కాంగ్రెస్, మజ్లిస్ చేతులు కలపడంతో బీజేపీకి మేయర్ సీటు దూరమైంది.

కరీంనగర్ లో బీజేపీ మేయర్ పీఠం దక్కించుకోవడం ఆసక్తికర చర్చగా మారింది. రాష్ట్రంలో ఈ ఒక్కచోట మాత్రమే బీజేపీ గెలిచి రికార్డు క్రియేట్ చేసింది. ఈ కార్పొరేషన్ లో బీజేపీ 30 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 21 చోట్ల విజయం సాధించింది. 66 స్థానాలు ఉన్న కార్పొరేషన్ లో మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 34 సీట్లు అవసరం. అయితే కావాల్సిన మెజార్టీకి నాలుగు సీట్ల దూరంలో బీజేపీ నిలిచిపోవడం, అధికార కాంగ్రెస్ కూడా మేయర్ పీఠానికి పోటీ పడటంతో ఈ ఎన్నిక తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది.

కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలే తెచ్చుకున్నా, మేయర్ సీటు ఎగరేసుకుపోతామంటూ చేసిన ప్రకటనలు తీవ్ర ఉత్కంఠకు గురిచేశాయి. అయితే కేంద్రమంత్రి బండి సంజయ్ అప్రమత్తంగా వ్యవహరించి మేయర్ సీటు చేజారిపోకుండా చూసుకున్నారు. పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లలో ఏ ఒక్కరూ జారిపోకుండా కాపాడుకోవడమే కాకుండా, ఫార్వెర్డ్ బ్లాక్, స్వతంత్రుల మద్దతు కూడా తీసుకుని మేయర్ గా తన అనుచరుడు కొలగాని శ్రీనివాస్ ను గెలిపించుకున్నారు. డిప్యూటీ మేయర్ పదవిని కూడా బీజేపీయే గెలుచుకునేలా కేంద్ర మంత్రి వ్యూహం రచించి సక్సెస్ అయ్యారని అంటున్నారు.

రెండు రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక సాఫీగా సాగిపోవడంతో బీజేపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. మెజార్టీ లేకపోయినా పోటీకి కాంగ్రెస్ సిద్ధమవడంతో రెండు రోజులుగా కరీంనగర్ రాజకీయం గరం గరంగా సాగింది. రెండు పార్టీలు కార్పొరేటర్లను కాపాడుకునేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ క్యాంపును ప్రత్యక్షంగా పర్యవేక్షించి మేయర్ ఎన్నిక ముగిసే వరకు జాగ్రత్తగా ఉండటంతో బీజేపీ కార్పొరేటర్లు పక్క చూపులు చూడకుండా కట్టడి చేయగలిగారని అంటున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా ఉండిపోవడంతో బీజేపీకి సునాయాశంగా మేయర్ పదవిని గెలుచుకుందని చెబుతున్నారు. దీంతో రెండు రోజులుగా చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలకు ఫుల్ స్టాప్ పడినట్లైంది.