కడపలో బీజేపీ Vs బీజేపీ.. ఇదెక్కడి ఫైటింగురా బాబూ..
కడప జిల్లాకు చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య ఉప్పు-నిప్పులా పరిస్థితి మారిందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 23 Sept 2025 1:56 PM ISTఏపీ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు విపరీతంగా పెరిగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కడప జిల్లాలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వార్ పరిధులు దాటింది. ఇరువురి నేతల అనుచరులు, సిబ్బంది పరస్పరం దాడులు చేసుకుని పోలీసు కేసుల వరకు వెళ్లింది. దీంతో కడపలో కమలం పార్టీ రాజకీయం వేడిక్కిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పొలిటికల్ వార్ ఎక్కడి వరకు వెళుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ సీనియర్ నేతలు, పార్టీ అధిష్టానం, ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న నేతలే కావడంతో ప్రభుత్వం, పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందని టాక్ వినిపిస్తోంది.
కడప జిల్లాకు చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య ఉప్పు-నిప్పులా పరిస్థితి మారిందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరూ టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లగా జిల్లాలో ఆధిపత్య రాజకీయాలు, కాంట్రాక్టుల విషయంలో విభేదాలు నెలకొన్నాయి అంటున్నారు. సీఎం రమేశ్ ఉత్తరాంధ్రలోని అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పటికీ ఆయన స్వస్థలం కడప జిల్లా కావడంతో స్థానిక రాజకీయాలు, కాంట్రాక్టులు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే దీనిపై జమ్ములమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి అభ్యంతరాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
తాజాగా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గండికోటలో రోడ్డు పనుల విషయంలో ఎంపీ, ఎమ్మెల్యే గ్రూపుల మధ్య వివాదం చెలరేగింది. అది కాస్త దాడుల వరకు వెళ్లడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సివచ్చింది. గండికోట రోడ్డు పనుల కాంట్రాక్టు దక్కించుకున్న ఎంపీ సీఎం రమేశ్ కు చెందిన రిత్విక్ కాంట్రాక్టు సంస్థ క్యాంపు ఆఫీసుపై సోమవారం కొందరు వ్యక్తులు దాడి చేసి ఫర్నీచర్, కంప్యూటర్లు ధ్వంసం చేశారు. ఇది ఎమ్మెల్యే ఆది వర్గీయుల పనే అంటూ రిత్విక్ సంస్థ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా జమ్మలమడుగు పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అయితే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు ఈ ఆరోపణలను కొట్టిపడేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు రోడ్డు పనులు చేయొద్దని స్థానికులే అడ్డుకున్నారని వారు చెబుతున్నారు. ఈ నెల 6న రోడ్డు పనులు అడ్డుకోగా, అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే సోమవారం రిత్విక్ కాంట్రాక్టు సంస్థ కార్యాలయంపై ఆకస్మికంగా దాడి చేయడమే పరిస్థితిని మరింత వేడెక్కించింది. సుమారు 8 వాహనాలతో 50 మందికిపైగా వచ్చి రాళ్ల దాడి చేసి విధ్వంసం స్రుష్టించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ దాడి అంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని సీఎం రమేశ్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. అల్లరిమూక దాడి చేసే సమయంలో ఎవరూ ఫొటోలు, వీడియోలు తీయొద్దని బెదిరించారని చెబుతున్నారు.
కాగా, కడప జిల్లాలోని ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య చాలాకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో కూడా ఎంపీ సీఎం రమేశ్ కడప జిల్లా రాజకీయాల్లో తలదూర్చడంపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారని అంటున్నారు. ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఎంపీ సీఎం రమేశ్ సొంత గ్రామం ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. దీంతో ఇద్దరి మధ్య రాజకీయ ఆధిపత్యం కొనసాగుతోంది. ఎంపీ సీఎం రమేశ్ కు చెందిన రిత్విక్ కన్ స్ట్రక్షన్స్ అనే సంస్థకు గండికోటలో రూ.77 కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కింది. అంతేకాకుండా అదానీ హైడ్రో పవర్ ప్లాంట్ లోని పనులు కూడా రిత్విక్ కే లభించాయి.
తమ నియోజకవర్గంలో రిత్విక్ పనులు చేయడమేంటని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. గతంలో కూడా ఒకసారి పనులను అడ్డుకోవడంతోపాటు, కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారని సీఎం రమేశ్ కడప జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అదేసమయంలో జమ్మలమడుగులో పేకాట, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టాలని ఎంపీ రమేశ్ బహిరంగ లేఖ రాశారు. ఈ అసాంఘిక కార్యక్రమాలకు ఆదినారాయణరెడ్డి అనుచరుడే కారణమని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో మరోమారు దాడులు జరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందని అంటున్నారు. కీలకమైన ఇద్దరు నేతల కొట్లాట వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గండికోట పర్యాటక ప్రాజెక్టు పరిస్థితి అంపశయ్యపై వేలాడుతోందని అంటున్నారు.
