Begin typing your search above and press return to search.

అది నిజ‌మే అయితే.. చ‌ర్య‌లెందుకు లేవ్ న‌డ్డాజీ.. !

ప్రజా సంపదను దోచుకోవడం, అవినీతి అక్రమాలు చేయడం అనేది నిజంగా ఖండించాల్సిన విషయం. అటువంటి పనులు చేసిన వారిని కచ్చితంగా జైలుకు పంపించాల్సిన అవసరం కూడా ఉంది.

By:  Tupaki Desk   |   16 Sept 2025 12:03 AM IST
అది నిజ‌మే అయితే.. చ‌ర్య‌లెందుకు లేవ్ న‌డ్డాజీ.. !
X

గత వైసిపి ప్రభుత్వం పై తాజాగా బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్రంలో మంత్రిగా ఉన్న జేపీ న‌డ్డా తీవ్ర విమర్శలు చేశారు. వైసిపి హయాంలో అక్రమాలు, అన్యాయాలు జరిగాయని, రాష్ట్రం అనేక రంగాల్లో వెనుకబడిందని ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయంగా ఈ విమర్శలు బాగానే ఉన్నా ఒక కీలక స్థానంలో ఉన్న కేంద్ర మంత్రిగా ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం సరికాదు అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. నిజంగానే వైసిపి హయాంలో పాలన బాగోకపోతే ఆరోజు ఏం చేశారు? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

ఢిల్లీలో మద్యం కుంభకోణం జరిగినప్పుడు రాష్ట్ర పరిధిలో లేని అంశంపై జోక్యం చేసుకున్న కేంద్రం... ఢిల్లీ ముఖ్యమంత్రిని జైలు పాలు చేసింది. ఇక ఛత్తీస్‌గ‌ఢ్‌ జరిగిన గనుల కుంభకోణంలో కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ను జైలుకు పంపించింది. ఇలా రాష్ట్రాల పరిధిలో ఉన్న అంశాలపై కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ముఖ్యమంత్రిలను మంత్రులను కూడా జైల్లో పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఏపీలో నిజంగానే అక్రమాలు అన్యాయాలు జరిగాయని తెలిసినప్పుడు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది అన్నది కీలక ప్రశ్న.

రాజకీయ అవసరాల కోసం ఎలాంటి విమర్శలు అయినా చేసుకోవచ్చు. కానీ, అధికారంలో ఉండి కేంద్రమంత్రి స్థానంలో ఉండి.. ఆయ‌న చెప్పిన‌ట్టు గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని అన్యాయాలు జరిగాయని రాష్ట్ర సంపాదన దోచుకున్నారని తెలిసిన‌ప్పుడు.. ఇది నిజమే అని భావిస్తే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. గత పాలకులపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు?. అన్నది మిలియ‌న్‌ డాలర్ల ప్రశ్న. అవసరానికి తగిన విధంగా వైసీపీ నాయకులను వాడుకుంటున్న కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా ఇలాంటి విమర్శలు చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారనేది మ‌రో ప్ర‌శ్న‌.

ప్రజా సంపదను దోచుకోవడం, అవినీతి అక్రమాలు చేయడం అనేది నిజంగా ఖండించాల్సిన విషయం. అటువంటి పనులు చేసిన వారిని కచ్చితంగా జైలుకు పంపించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం కూడా లేదు. మరి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తరచుగా ఇలాంటి విమర్శలు చేస్తూ దీనికే పరిమితం కావడం అన్నది రాజకీయంగా లబ్ధి కోరుకుంటున్నట్టే కనిపిస్తోంది. అంటే తమ స్వార్థం కోసం తమ రాజకీయ ప్రయోజనం కోసం అవసరానికి తగిన విధంగా వ్యాఖ్యలు చేస్తూ తమ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నట్టుగా స్పష్టమవుతోంది అన్నది పరిశీలకులు చెబుతున్న మాట.

నిజానికి వైసిపి హయాంలో తప్పులు జరిగి ఉంటే కచ్చితంగా వాటిని వెలికి తీయాలి. ఇప్పుడు కూడా కేంద్రంలో ఉన్నది మోడీ ప్రభుత్వమే. పైగా రాష్ట్రంలో ఉన్నది కూడా బిజెపి టిడిపి జనసేన ఉమ్మడి ప్రభుత్వమే. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదని పరిశీలకులు చెబుతున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు ప్రజాధన దుర్వినియోగం సహా ఇతర అంశాలపై కూడా విచారణ జరిపించే విషయంపై ఆలోచన చేసి ఆ దిశగా అడుగులు వేస్తే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. బిజెపిపై నమ్మకం కలుగుతుంది. లేకపోతే అవసరానికి తగిన విధంగా రాజకీయాలు చేస్తున్నారన్న వాద‌న‌ కచ్చితంగా బలపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.