సభ్యత్వ నమోదులో బీజేపీ సరికొత్త రికార్డు
భారతీయ జనతా పార్టీ పూర్వం జనసంఘ్ కాలం నుంచి ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీగా ఉంది.
By: Tupaki Desk | 23 Jun 2025 8:54 AM ISTభారతీయ జనతా పార్టీ పూర్వం జనసంఘ్ కాలం నుంచి ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీగా ఉంది. నిజం చెప్పాలంటే బీజేపీ రాజకీయ ప్రస్థానం జనసంఘ్ గా 1953లో ప్రారంభం అయింది. అంటే ఈ రోజుకు డెబ్బై ఏళ్ళ పై దాటిన పార్టీ అన్న మాట. జనసంఘ్ లో బీజేపీకి దీపం గుర్తు ఉండేది.
అలా దీపం గుర్తుగా ఉన్న పార్టీకి దేశవ్యాప్తంగా బలం లేదు. మెల్లగా ఉనికి చాటుకుంటూ వచ్చింది. అంతే కాదు ఉనికి పోరాటాన్నే దశాబ్దాలుగా చేసింది. ఇక 1977లో జనతా పార్టీగా చాలా పార్టీలు కలసిపోయిన నేపథ్యంలో జనసంఘ్ కూడా అందులోనే విలీనం అయింది. అలా ఆ ఎన్నికల్లో మాత్రం పెద్ద ఎత్తున విజయాలు సాధించింది. అప్పటి నుంచే ఎదుగుదల మీద ఫోకస్ పెట్టింది. ఆ తరువాత జనతా పార్టీ విచ్చిన్నం కావడంలో బీజేపీగా 1980 ప్రాంతంలో ఏర్పాటు అయింది.
అయితే ఈ ఎదుగుదల కోసం బీజేపీ ఎదుగుదల కోసం ఒక దశాబ్దం పాటు వేచి చూడాల్సి వచ్చింది. పార్టీ సభ్యత్వ నమోదు కూడా ఒక మాదిరిగా సాగేది. అయితే 1990 నుంచి బీజేపీ విస్తరిస్తూ ఆ తరువాత వాజ్ పేయి నాయకత్వంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.
అయితే బీజేపీ అసలైన రాజకీయ దూకుడు అంతా 2014 నుంచి మొదలైంది. ఆ ఎన్నికల్లో బీజేపీ బ్రహ్మాండమైన గెలుపు సాధించింది. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు ఆయన నాయకత్వంలో నాటి నుంచి బీజేపీ అప్రతిహత విజయాలను నమోదు చేస్తోంది. ఇక రికార్డు స్థాయి సభ్యత్వాలను కూడా నమోదు చేయాలని పట్టుబట్టి ప్రపంచ రికార్డు కోసం చూస్తూ వస్తోంది.
ఈ రోజున చూస్తే బీజేపీ ఆ రికార్డు సాధించినట్లుగానే ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం బీజేపీకి దేశవ్యాప్తంగా ఉన్న సభ్యత్వం 14 కోట్లు అంటే ఆశ్చర్యం వేయడమే కాదు రాజకీయంగా ప్రకంపనలు పుట్టించేలా ఉంది. మరో వైపు చూస్తే కనుక అతి తక్కువ సమయంలో ఈ గ్రేట్ రికార్డ్ ని బీజేపీ సాధించింది అని అంటున్నారు.
ఇక చూస్తే కనుక 14 కోట్ల మార్కును బీజేపీ ప్రాథమిక సభ్యుల సంఖ్యతో దాటిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తెలిపారు. బీజేపీ ఒక ప్రణాళికతో బూత్ స్థాయి సభ్యుల సహకారంతో ఈ నంబర్ ని సాధించింది. పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా మారాలంటే కనీసం 50 మందిని చేర్పించాలన్న నిబంధనతో నే ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వం కాషాయం పార్టీకి దక్కింది అని అంటున్నారు.
ఇక బీజేపీ జాతీయ సభ్యత్వ ప్రచారాన్ని 2024 సెప్టెంబర్ 2న ప్రారంభించింది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమానికి సంఘటన్ పర్వ్ సభ్యత్వ ప్రచారం-2024 అన్న పేరు పెట్టారు. కేవలం నెలన్నర రోజులలోనే అంటే అక్టోబర్ 15 నాటికి బీజేపీ సభ్యుల సంఖ్య తొమ్మిది కోట్లు దాటిందని పార్టీ పేర్కొంది.
ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే బీజేపీ రెండు కోట్ల మంది సభ్యులను కలిగి ఉన్నట్లు ఆ పార్టీ పేర్కొంది. ఇక రెండవ దశలో చూస్తే సభ్యత్వ నమోదు మరింతగా పెరిగి 14 కోట్లకు చేరుకుంది. ఇక పార్టీ క్రియాశీల సభ్యత్వ సంఖ్యను మరింత పెంచే లక్ష్యంతో మూడవ దశ కూడా తాజాగా ప్రారంభమైందని పార్టీ నేతలు చెబుతున్నారు. మరి ఈ సభ్యత్వం కూడా ముగిస్తే బీజేపీలో ఎంత సభ్యత్వం నమోదు అవుతుందో చూడాలి. ఏకంగా 20 కోట్ల టార్గెట్ ఏమైనా పెట్టుకుంటారా అన్న చర్చ సాగుతోంది.
