టీడీపీకి షాకిస్తున్న బీజేపీ.. ఆ నేతల ఎంపిక అందుకేనా?
ఏ రాజకీయ పార్టీ అయినా రోజురోజుకు బలపడాలని కోరుకోవడం సహజం. కానీ, మిత్రపక్షానికి చెక్ చెప్పేలా పావులు కదపడమే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
By: Tupaki Desk | 30 April 2025 10:30 PMఏపీలో కూటమి పార్టీలు సొంతంగా ఎదిగే ప్రణాళికలకు పదును పెడుతున్నాయి. అధికారం అండతో వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా బలం పుంజుకోవాలని కూటమిలోని ప్రధాన భాగస్వామ పక్షాలు ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇందులో బీజేపీ, జనసేన అడుగులు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధాన పార్టీ అయిన టీడీపీకి చెక్ చెప్పడమే లక్ష్యంగా ఆ రెండు పార్టీలు అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి తాజాగా బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఎంపికే నిదర్శనమంటున్నారు.
ఏ రాజకీయ పార్టీ అయినా రోజురోజుకు బలపడాలని కోరుకోవడం సహజం. కానీ, మిత్రపక్షానికి చెక్ చెప్పేలా పావులు కదపడమే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఏపీలో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో కోరుకుంటోంది. టీడీపీతో పొత్తుతో గతంలోనూ ఇప్పుడూ అధికారం పంచుకుంటున్నా, రాష్ట్రంలో కమలం పార్టీకి అత్తెసరు ఓట్లు మాత్రమే వస్తున్నాయి. అయితే ఈ సారి అలా జరగకూడదని కేంద్రంలోని బీజేపీ పెద్దలు బలంగా కోరుకుంటున్నారు. రాష్ట్రం అడిగినంత నిధులు ఉదారంగా ఇస్తున్నామని, ఆ విషయం ప్రజల్లోకి తీసుకువెళ్లి వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన రాజకీయ శక్తిగా ఎదగాలని బీజేపీ బడా నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అనేక చర్యలు తీసుకుంటున్న కమలనాథులు.. పార్టీలో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామనే విషయాన్ని చాటిచెప్పేలా ఎమ్మెల్సీ, రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని చెబుతున్నారు.
ఒక రాజకీయ పార్టీగా బీజేపీ తనకు నచ్చిన వారికి పదవులు ఇచ్చుకోవచ్చు, కానీ ప్రభుత్వంలో ఇతర భాగస్వామ్య పక్షాలు ఇబ్బందులు పడేలా ఎంపికలు ఉంటేనే రాజకీయంగా అనుమానాలు రేకెత్తిస్తాయి. తాజాగా రాజ్యసభ అభ్యర్థిగా పాకా సత్యానారాయణను బీజేపీ ఎంపిక చేసింది. ఆ పార్టీలో దిగువస్థాయి నుంచి పనిచేసిన పాకా సత్యనారాయణ ఎంపిక బీజేపీకి ప్రాధాన్యాంశమైనప్పటికీ, టీడీపీకి మింగుడు పడటం లేదంటున్నారు. అదేవిధంగా గతంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజును ఎంపిక చేసినప్పుడు కూడా టీడీపీలో అభ్యంతరాలు వచ్చినట్లు చెబుతున్నారు.
బీజేపీ తన నేతలను ఎవరికి పదవులిచ్చేది, ఆ పార్టీ అధిష్టానం ఇష్టమైనప్పటికీ గతంలో టీడీపీతో విభేదాలు వచ్చేలా ప్రయత్నించిన వారు, టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించిన వారికి పదవులు కట్టబెట్టడమే తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. కేవలం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, పొత్తు ధర్మంతో రెండు రాజ్యసభ, ఒక ఎమ్మెల్సీ పదవినిస్తే.. టీడీపీ వ్యతిరేకులకే అధిక ప్రాధాన్యమివ్వడం భావ్యం కాదని అంటున్నారు. అయితే టీడీపీ అభ్యంతరాలను బీజేపీ నేతలు కొట్టిపడేస్తున్నారు. తమ పార్టీ కోసం కష్టపడిన వారికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని అంటున్నారు.