Begin typing your search above and press return to search.

దేశమంతా నమో మంత్రం.. తెలంగాణలో నిస్తేజం.. కమలదళానికి ఏమైంది?

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ పనితీరుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ నమో మంత్రంతో ఊగిపోతూ తిరుగులేని విజయాలను సాధిస్తోంది కమలదళం.

By:  Tupaki Desk   |   15 Nov 2025 11:00 PM IST
దేశమంతా నమో మంత్రం.. తెలంగాణలో నిస్తేజం.. కమలదళానికి ఏమైంది?
X

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ పనితీరుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ నమో మంత్రంతో ఊగిపోతూ తిరుగులేని విజయాలను సాధిస్తోంది కమలదళం. కానీ, తెలంగాణలో పూర్తి రివర్స్ ఫలితాలను ఎదుర్కొంటుడటమే ఎవరికీ అంతుచిక్కడం లేదు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు వరకు బీజేపీ దూకుడుగా ఉండేది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కాషాయదళంలో మునుపటి స్పీడు కనిపించడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఫలితాల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల లెక్కలు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది.

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుందని అంతా ఊహించారు. అయితే ప్రచారపర్వంలోనే బీజేపీ మిగిలిన పార్టీలకన్నా వెనకబడిందన్న అంచనాలు వెలువడ్డాయి. పార్టీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చినా, ఆయన పేరు ప్రకటించడానికి చివరి వరకు నాన్చుడు ధోరణి ప్రదర్శించడం వల్ల కాషాయ పార్టీ నష్టపోయినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. 2023 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డి 25 వేల ఓట్లు సాధించారు. కానీ, ఈ ఎన్నికల్లో కేవలం 18 వేల ఓట్లతోనే సరిపెట్టుకున్నారు. ఈ స్థానంలో బీజేపీ ఓట్లు దాదాపు 7 వేలు ఇతర పార్టీలకు మళ్లిపోయాయని ఈ లెక్కలు రుజువు చేస్తున్నాయి.

దేశవ్యాప్తంగా బీజేపీ చాలా బలమైన స్థితిలో ఉంది. 2014 తర్వాత ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ దేశం మొత్తం కాషాయ జెండా రెపరెపలాడిస్తోంది. సొంతంగా కొన్ని రాష్ట్రాల్లోనూ.. మిత్రపక్షాలతో మరికొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అడుగు పెట్టిన ఏ రాష్ట్రమైనా కమలం జెండా ఎగరాల్సిందే అన్నట్లే పనితీరు కనిపిస్తోంది. కానీ, తెలంగాణలో బీజేపీ రివర్స్ లో పయనిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2018-23 మధ్య రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా, ప్రధాన పోటీ బీజేపీతోనే ఉండేది. ఆ సమయంలో విపక్షంగా ఉన్న కాంగ్రెస్ మూడోస్థానంలో మాత్రమే సరిపెట్టుకునేది. కానీ ఇప్పుడు బీజేపీ మూడోస్థానానికి పడిపోవడంపైనే చర్చ జరుగుతోంది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు సాధించిన బీజేపీ.. అంతకు ముందు ఐదేళ్లు పనిచేసిన అనుభవంతో తెలంగాణలో ప్రత్యామ్నాయం అవుతుందని అంతా భావించారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా చతికిలపడింది. ఇక ఆ తర్వాత ఆరు నెలలకు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 8 సీట్లను గెలుచుకుంది. ఈ విజయంతో దాదాపు 70-80 నియోజకవర్గాలలో బీజేపీ విస్తరించిందని భావించారు. ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ తెలంగాణలో ఎదుగుతుందని లెక్కలు వేశారు. కానీ, ఇప్పుడు ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదన్న ఆవేదన కాషాయదళంలో కనిపిస్తోందని చెబుతున్నారు. జూబ్లీహిల్స్ లో గత పార్లమెంటు ఎన్నికల్లో 40 వేల ఓట్లు బీజేపీకి వచ్చాయి. కానీ, ఇప్పుడు అందులో సగం కూడా పడకపోవడంపై కేడర్ విస్మయం వ్యక్తం చేస్తోంది. ఈ ఫలితానికి ఎవరు బాధ్యత వహిస్తారని కమలదళంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.