Begin typing your search above and press return to search.

యాభై ఏళ్ళకి చేరువలో కమలం...అద్వితీయ విజయాల పయనం

భారతీయ జనతా పార్టీ సరిగ్గా ఇదే రోజున అంటే 1980 ఏప్రిల్ 6న న్యూ ఢిల్లీలో అటల్ బిహారీ వాజ్ పేయి ఎల్ కే అద్వానీ సహా కీలక నేతలు అంతా కలసి ఏర్పాటు చేశారు.

By:  Satya P   |   6 April 2026 3:23 PM IST
యాభై ఏళ్ళకి చేరువలో కమలం...అద్వితీయ విజయాల పయనం
X

భారతీయ జనతా పార్టీ సరిగ్గా ఇదే రోజున అంటే 1980 ఏప్రిల్ 6న న్యూ ఢిల్లీలో అటల్ బిహారీ వాజ్ పేయి ఎల్ కే అద్వానీ సహా కీలక నేతలు అంతా కలసి ఏర్పాటు చేశారు. బీజేపీ ఆవిర్భవించడానికి ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది. నిజానికి చూస్తే భారతీయ జన సంఘ్ కి పూర్వ రూపమే బీజేపీ. జనసంఘ్ 1951 అక్టోబర్ 21న ఢిల్లీలోని రఘోమల్ కన్యా మాధ్యమిక విద్యాలయంలో ఏర్పడింది. దీనిని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్థాపించారు. కుడి పక్ష, జాతీయవాద రాజకీయ పార్టీగా సిద్ధాంతీకరించి దీనిని ఆయన ఏర్పాటు చేశారు. జన సంఘ్ ఎన్నికల గుర్తు దీపంగా ఉండేది.

రెండున్నర దశాబ్దాల పాటు :

ఇక జన సంఘ్ ఏకంగా 26 ఏళ్ల పాటు కొనసాగి దేశంలో ఆనాటి కాంగ్రెస్ పాలన మీద పోరాడుతూ వచ్చింది. కొన్ని రాష్ట్రాలలో మిత్రులతో కలసి అధికారం పంచుకుంది. లోక్ సభలో కూడా తన ఎంపీల బలాన్ని పెంచుకుంది. అయితే శ్రీమతి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధింపు తరువాత దేశంలోని పార్టీలన్నీ ఒక్కటిగా ఉండకపోతే కాంగ్రెస్ ని ఎదిరించడం అసాధ్యం అన్న భావనతో అన్నీ కలిసి జనతా పార్టీగా ఏర్పాటు అయ్యాయి. అలా జనతా పార్టీలో జన సంఘ్ విలీనం అయింది. 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అందులో జన సంఘ్ నాయకుడు వాజ్ పేయ్ విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేస్తే ఎల్ కే అద్వానీ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను చూశారు. మూడేళ్ళకే జనతా పార్టీ ప్రభుత్వం పతనం అయితే అందులోని పార్టీలు కూడా ఎవరికి వారుగా విడిపోయారు. అలా జన సంఘ్ విలీనం తరువాత అదే సిద్ధాంతంతో అదే జాతీయ వాదంతో ఏర్పాటు అయిన పార్టీయే బీజేపీ.

తొలి ఎన్నికల్లో పరాభవం :

ఇక బీజేపీ ఏర్పాటు అయ్యాక పెద్ద విజయాలు ఏమీ దక్కలేదు. ఆ పార్టీకి మొదటి అధ్యక్షుడిగా వాజ్ పేయి వ్యవహరించారు. ఆయన నాయకత్వంలో 1984 లో లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి రెండు సీట్లు మాత్రమే లభించాయి. పార్టీ ప్రెసిడెంట్ వాజ్ పేయి సైతం ఓటమి పాలు అయ్యారు. నాటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ దారుణ హత్య తరువాత జరిగిన ఎన్నికలు కావడంతో బలంగా వీచిన సానుభూతి పవనాలతో బీజేపీ రాజకీయంగా తీవ్రంగా దెబ్బ తిన్నది. ఇక 1986లో ఎల్ కే అద్వానీ బీజేపీకి రెండవ అధ్యక్షుడు అయ్యారు. ఆయన నాయకత్వంలో బీజేపీ పుంజుకుంది. 1989లో నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మధ్యేవాద పార్టీలు వామ పక్షాలు అన్నీ కలసి నేషనల్ ఫ్రంట్ గా ఏర్పాటు అయి పోటీ చేశాయి. అలా బీజేపీకి 85 దాకా సీట్లు లభించాయి. ఇది కేవలం అయిదేళ్ళలో బీజేపీ సాధించిన గణనీయమైన పురోగతిగా చూడాల్సి ఉంది. అంతే కాదు ఓట్ల శాతం కూడా 11.36 గా లభించింది

మధ్యంతర ఎన్నికల్లో :

ఇక నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం రెండేళ్ళలో పతనం కావడంతో 1991లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని మరింతగా పెంచుకుంది. ఆ ఎన్నికల్లో ఏకంగా 120 స్థానాలను గెలుచుకుంది. అంతే కాదు తన ఓటు షేర్ ని ఏకంగా 20.11గా పెంచుకుంది. అలా 10వ లోక్‌సభలో ఒక ప్రధాన శక్తిగా బీజేపీ బలపడింది. అయిదేళ్ళు పీవీ నరసింహారావు నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తరువాత 1996లో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ బలం మరింతగా పెరిగింది. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఏర్పడిన మతపరమైన ఉద్రిక్తతలు అలాగే ఎల్‌కె అద్వానీ, బిజెపి అధ్యక్షుడిగా ఉంటూ నిర్వహించిన అయోధ్య రథయాత్ర ఈ నేపథ్యం నుంచి బీజేపీ జాతీయ స్థాయిలో మరింత ఎదిగింది దాంతో 1996 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 161 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని, పార్లమెంటులో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఆనాడే బీజేపీ సీనియర్ నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి తొలిసారిగా ప్రధాని అయ్యారు. పదమూడు రోజుల పాటు ఆయన పనిచేశారు. మెజారిటీ నిరూపించుకోవడంలో విఫలం కావడంతో తప్పుకున్నారు. అలా బీజేపీ ప్రధాని కలను నెరవేర్చిన ఎన్నికలుగా 1996ని గుర్తు పెట్టుకోవాలి.

పదమూడు నెలల ప్రధానిగా :

ఇక యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం రెండేళ్ళ పాటు పనిచేసి గద్దె దిగడంతో 1998లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 182 సీట్లను సాధించింది. దాంతో ఇతర పార్టీలను కలుపుకుని వాజ్ పేయి రెండోసారి ప్రధాని అయ్యారు. ఆయన ఈసరి 13 నెలల పాటు కొనసాగారు. తిరిగి 1999లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ పాతిక పార్టీలతో కలసి ఏర్పాటు చేసిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లోక్‌సభలో మెజారిటీ సాధించింది. అలా ఒక కూటమిగా అధికారంలోకి వచ్చిన బీజేపీకి మరోసారి ప్రధాని వాజ్ పేయి నాయకత్వం వహించి మూడోసారి ప్రధాని అయ్యారు. అంతే కాదు, వాజ్‌పేయి పూర్తి ఐదేళ్ల పదవీకాలం పనిచేసిన మొదటి కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డు సృష్టించారు. బీజేపీకి 182 సీట్లు లభించినా మిత్రులు అంతా గట్టి మద్దతుగా నిలిచారు. అలా దేశంలో కూటమి పాలనకు నాంది పలికిన చరిత్ర బీజేపీది అయింది.

ఆ ఘనత మోడీదే :

ఇక 2004, 2009లలో బీజేపీ ఓటమి పాలు అయింది. అప్పట్లో విజయం సాధించి ఉంటే ఎల్కే అద్వానీ ప్రధాని అయి ఉండేవారు. కానీ యూపీఏ రెండు సార్లూ నెగ్గింది. దాంతో 2014 నాటికి జాతీయ రాజకీయం మారింది. గుజరాత్ సీఎం గా ఉంటూ వచ్చిన నరేంద్ర మోడీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దిగి మంచి విజయం సాధించారు. బీజేపీకి తొలిసారి పూర్తి మెజారిటీని ఆయన సాధించి పెట్టిన నేతగా రికార్డు నెలకొల్పారు. అంతే కాదు 2019 ఎన్నికల్లో ఏకంగా బీజేపీ సీట్లను 300 పై దాటించి మరో ఘనతను మోడీ సాధించారు. 2024లో బీజేపీకి 240 ప్లస్ సీట్లు వచ్చినా ఎన్డీయే మిత్రుల సహకారంలో మూడవసారి మోడీ దేశానికి ప్రధాని అయ్యారు. ఇక ఇప్పటి నుంచే బీజేపీ చూపు 2029 ఎన్నికల మీద ఉంది. ఒక వైపు లోక్ సభ సీట్ల పునర్ విభజన మరో వైపు మహిళా రిజర్వేషన్లు అన్నీ కలిసి బీజేపీకి పూర్తి మెజారిటీని వచ్చే ఎన్నికల్లో తెచ్చి పెడతాయని ఆ పార్టీ ఆశిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే బీజేపీ తన నాలుగున్నర దశాబ్దాల ప్రయాణంలో దాదాపుగా రెండు దశాబ్దాల పాటు దేశంలో అధికారంలో ఉండడం మెజారిటీ రాష్ట్రాలలో పాగా వేయడం అతి పెద్ద పార్టీగా ప్రపంచంలోనే రికార్డు క్రియేట్ చేయడం ఇవన్నీ కమలం అప్రతిహత విజయానికి అచ్చమైన ఉదాహరణలు అని అంతా అంటారు.