ఎలక్షన్ ఎఫెక్ట్: రాష్ట్రానికో విధంగా కమల నాథుల ప్లాన్!
ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పాగా వేసేందుకు చూస్తున్న బీజేపీ.. పశ్చిమ బెంగాల్ ఎన్నికలను కీలకంగా భావిస్తోంది.
By: Garuda Media | 19 March 2026 6:00 AM ISTఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పాగా వేసేందుకు చూస్తున్న బీజేపీ.. పశ్చిమ బెంగాల్ ఎన్నికలను కీలకంగా భావిస్తోంది. వాస్తవానికి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పుదుచ్చేరి(కేంద్ర పాలిత ప్రాంతం)లో ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉంది. సో.. మళ్లీ ఇక్కడ తాము అధికారంలోకి వస్తామని భావిస్తున్నారు. బలమైన ప్రతిపక్షం లేకపోవడం ప్లస్ అవుతోంది. ఇక, అస్సాం(ఈశాన్య రాష్ట్రం)లోనూ బీజేపీ నేతృత్వంలోని సర్కారే వరుసగా పాలిస్తోంది.
అసోం సీఎం హిమంత బిశ్వశర్మ.. బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకురావడం ఖాయమని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన మూడు రాష్ట్రాలు పెద్దవి కావడంతో వీటిపైనే బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అయితే.. వీటిలో కేరళలో పాగా వేయడం సాధ్యంకాదని కమల నాథులు నిర్ణయించుకున్నారు.
అయితే.. కేరళంగా పేరు మార్పు సహా.. వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కూడా చేపట్టిన దరిమిలా .. ఆమేరకు ఓటు బ్యాంకు, సీటు షేరు పెంచుకునే ప్రయత్నాలకు పరిమితం అవుతున్నారు. ఇక, తమిళ నాడులో పాగా వేయాలని అనుకున్నా.. ఇక్కడ ప్రజల మరోసారి డీఎంకే వైపే మొగ్గు చూపుతున్నట్టు సర్వేలు చాటుతున్నాయి. దీనికితోడు.. ఎస్సీ సామాజిక వర్గం పూర్తిగా టీవీకే అధినేత, దళపతి విజయ్ వైపే మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ బలమైన వర్గం బీజేపీకి లేకుండా పోయింది.
వాస్తవానికి గత మూడు సంవత్సరాలుగా తమిళనాడుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడంతోపాటు.. తమిళనాడు నుంచి హిందువులను కాశీకి తీసుకువెళ్లారు. తమిళసంగం పేరుతో పెద్ద ఎత్తున హడావుడి చేశారు. అయితే.. జాతీయ విద్యావిధాన్యం, ముఖ్యంగా నీట్ పరీక్షను స్థానిక భాషలో నిర్వహించాలన్న డిమాండ్, హిందీని రుద్దుతున్నారన్న వాదనల నుంచి బీజేపీ బయట పడలేక పోయింది. అదేసమయంలో ప్రధాన పార్టీలు కూడా.. ఇక్కడ బీజేపీకి తావివ్వరాదన్న ఉద్దేశంతో నాలుగు మెట్లు దిగి వచ్చి వ్యూహాలు వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తమిళనాడులో బీజేపీ పాగా వేయడం అనేది ఇప్పట్లో సాధ్యం కాదని కమలనాథులు భావిస్తున్నారు. అయితే.. ఓటు బ్యాంకును మాత్రం భారీగా పెంచుకునేందుకు ఈ ఎన్నికలను వినియోగిం చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక, మరో కీలక రాష్ట్రం బెంగాల్. ఇప్పుడు కమల నాథుల కన్ను పూర్తిగా ఈ రాష్ట్రంపైనే ఉంది. ఇక్కడ ప్రతిపక్షాలు పెద్దగా బలంగా లేవు. పైగా మమత సర్కారుపైనా వ్యతిరేకత మునిపటి కంటే కూడా ఇప్పుడు భారీగా పెరిగింది.
ముఖ్యంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నాయకులు కుదేలయ్యారు. కేవలం అధికార పార్టీ మమత వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బెంగాల్‌పై ఎక్కువగా దృష్టిపెట్టి విజయం దక్కించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. అందుకే ఇక్కడ చాలా వ్యూహాత్మక నిర్ణయాలు కూడా కనిపిస్తున్నాయి. మరి బెంగాల్ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.
