బీజేపీ ప్రెసిడెంట్...భజనపరులకు ఆర్ఎస్ఎస్ చెక్ ?
బీజేపీ జాతీయ అధ్యక్షుడి విషయంలో సస్పెన్స్ ఒక వైపు సాగుతుండగానే మరో వైపు చూస్తే ఈసారి ఆర్ఎస్ఎస్ తన పట్టుని గట్టిగా బిగిస్తోంది.
By: Tupaki Desk | 25 April 2025 3:00 AM ISTబీజేపీ జాతీయ అధ్యక్షుడి విషయంలో సస్పెన్స్ ఒక వైపు సాగుతుండగానే మరో వైపు చూస్తే ఈసారి ఆర్ఎస్ఎస్ తన పట్టుని గట్టిగా బిగిస్తోంది. దానికి కారణం ఈసారి కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవడం, గుండె కాయ లాంటి యూపీలో ఎంపీ సీట్లు సగాని కంటే కూడా బాగా తగ్గిపోవడం.
దీంతో కొత్త బీజేపీ ప్రెసిడెంట్ గా తాము కోరుకున్న వారినే నియమించుకోవాలని ఆర్ఎస్ఎస్ చూస్తోంది. నరేంద్ర మోడీ ఇమేజ్ గత దశాబ్ద కాలంలో తగ్గిపోయిందని భావిస్తున్న ఆర్ఎస్ఎస్ పార్టీ సంఘ్ కంటే ఎవరూ ఎక్కువ కాదన్న తన మూల సూత్రాన్ని గుర్తుకు తెస్తోంది.
రేపటి బీజేపీ ప్రెసిడెంటే 2029లో బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్ధిని నిర్ణయిస్తారు అని అంటున్నారు. అంతే కాదు పార్టీ తరఫున పెద్దగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సాగుతున్న తీరుని నిశితంగా పరిశీలిస్తారని విలువైన సూచనలు చేస్తారని అంటున్నారు.
ఇక్కడ ఒక్క మాట కూడా చెబుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు పూర్తి క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. ఆయా పార్టీకి సంఘ్ కే బాధ్యుడు తప్ప మరెవరికీ కాదని అంటున్నారు. ఇక పార్టీ నుంచి ఎంతటి ఉన్నత పదవులు అందుకున్న వారు అయినా పార్టీకే బద్ధులుగా ఉండాలని కూడా సంఘ్ అభిప్రాయపడుతోంది.
సంఘ్ రాజకీయ కోణంగానే బీజేపీని చూస్తోంది అని అంటున్నారు. ఆర్ఎస్ఎస్ కి ఉన్న అనేక అంగాలలో రాజకీయ అంగంలో బీజేపీ ఉంటుందని భావిస్తున్నారు. అంతే తప్ప బీజేపీ ఆర్ఎస్ఎస్ ని శాసించేలా ఉండరాదు అన్నది కచ్చితమైన భావనగా ఉంది.
ఇక ప్రభుత్వం అన్న తర్వాత మంచీ చెడ్డా రెండూ జరుగుతూ ఉంటాయి. తప్పులు జరిగితే సక్రమంగా చెప్పి దాని మీద ఏమి చేయాలన్న దాని మీద కూడా సలహా సూచనలు ఇచ్చే విధంగా కొత్త ప్రెసిడెంట్ ఉండాలని సంఘ్ భావిస్తోంది. ఇక బీజేపీలో వ్యక్తి పూజ అన్నది లేదు. సంస్థ గొప్పది అన్న భావనే ఎపుడూ ఉంటూ వచ్చింది.
అయితే నరేంద్ర మోడీ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాక ఆయన ఇమేజ్ పార్టీ కంటే అధికంగా ఉంది అన్న భావన ఏర్పడింది. పార్టీని వ్యక్తుల చుట్టూ తిప్పుకోవడం వల్ల మంచి ఫలితాలు రావు అన్నది అనేక ఎన్నికల్లో బీజేపీ ఓటమి ద్వారా రుజువు అయింది అని సంఘ్ భావిస్తోంది అంటున్నారు.
ఇక బీజేపీ 2014, 2019లలో గెలిచిన తరువాత 2024లో మ్యాజిక్ మార్క్ కి 32 సీట్ల అవతలకి జారింది. దాంతోనే సంఘ్ లో అసంతృప్తి వచ్చింది అని అంటున్నారు. ఇదే తీరున కొనసాగితే బీజేపీకి 2029 ఎన్నికలు ఇబ్బంది అవుతాయని కూడా భావిస్తోంది. అందుకే మళ్ళీ మూలాల నుంచే పార్టీని తీసుకుని రావాలని నిర్ణయించింది అని చెబుతున్నారు.
ఇక ప్రస్తుత బీజేపీ ప్రెసిడెంట్ 2019 నుంచి కొనసాగుతున్నారు. అంటే దాదాపుగా ఆరేళ్ళ నుంచి అన్న మాట. బీజేపీ రాజ్యాంగం ప్రకారం మూడేళ్ళకు మించి ఎవరూ ఆ పదవిలో ఉండరు. ఇక ఎప్పటికప్పుడు ఆలస్యం లేకుండా కొత్త ప్రెసిడెంట్ ని పద్ధతి ప్రకారం ఎన్నుకోవడం జరుగుతూ వస్తోంది. ఈసారి అది మారిపోయింది.
దాంతో మళ్ళీ పాతకాలం నాటి పద్ధతులను తీసుకుని రావాలని ఆర్ఎస్ఎస్ ముద్ర బలంగా ఉన్న వారిని పార్టీని ప్రభుత్వాన్ని గట్టిగా శాసించేవారిని తెచ్చి జాతీయ అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టాలని సంఘ్ భావిస్తోందిట. మరి సంఘ్ ఆలోచనలు కనుక అమలు అయితే కనుక ఎవరూ ఊహించని వ్యక్తే బీజేపీ కొత్త ప్రెసిడెంట్ అవుతారని అంటున్నారు.
అంతే కాదు నరేంద్ర మోడీ అమిత్ షాలు కోరుకున్న వారు కాకుండా సంఘ్ కోరుకున్న వారే కమల దళపతి అవుతారని కూడా ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏది ఏమైనా ఈసారి సంఘ్ పట్టుదల చూస్తూంటే బీజేపీలో సరికొత్త మార్లుపు తప్పవని అంటున్నారు.
