Begin typing your search above and press return to search.

అధ్యక్షా...బీజేపీ తప్పు చేసిందా ?

రెండు తెలుగు రాష్ట్రాలలో ఇద్దరు బీజేపీ అధ్యక్షులను పార్టీ హైకమాండ్ ఎంపిక చేసింది. లాంచనానికి అయితే నామినేషన్ల స్వీకరణ ఘట్టం, ఎన్నికల ప్రక్రియ అని పెట్టారు

By:  Tupaki Desk   |   1 July 2025 12:30 AM IST
అధ్యక్షా...బీజేపీ తప్పు చేసిందా ?
X

రెండు తెలుగు రాష్ట్రాలలో ఇద్దరు బీజేపీ అధ్యక్షులను పార్టీ హైకమాండ్ ఎంపిక చేసింది. లాంచనానికి అయితే నామినేషన్ల స్వీకరణ ఘట్టం, ఎన్నికల ప్రక్రియ అని పెట్టారు. కానీ బీజేపీ పెద్దలు అనుకుని వారి చేతనే ఇలా నామినేషన్లు దాఖలు చేయించారు.

అలా ఏపీకి పీవీఎన్ మాధవ్, తెలంగాణాకు రామచంద్రరావు నూతన సారధులు అయ్యారు. ఇద్దరిలో చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరూ ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారే. ఇద్దరూ పార్టీకి వీర విధేయులే. ఇద్దరూ పార్టీ హైకమాండ్ కి నచ్చినవారే. హైకమాండ్ మాటను జవ దాటరు. పైగా పార్టీకి అంకితం అయి పనిచేస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం కూడా ఈ ఇద్దరికీ మరో పోలికగా ఉంది.

అదే సమయంలో ఇద్దరికీ క్షేత్ర స్థాయిలో సొంతంగా బలం కానీ బలగం కానీ లేదు. అంతే కాదు దూకుడుగా రాజకీయాలు చేయలేరు అని అంటారు. ఇక బీసీ సామాజిక వర్గానికి చెందిన పీవీఎన్ మాధవ్ కి ఏపీ బీజేపీ పగ్గాలు ఇచ్చిన హైకమాండ్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి తెలంగాణాలో పగ్గాలు ఇచ్చింది. అలా సామాజికపరంగా సమతూకం పాటించామని బీజేపీ భావిస్తోంది.

కానీ ఈ ఎంపిక వల్ల తప్పులు జరిగాయా అన్న చర్చ కూడా ఉంది. తప్పు కాదు కానీ ఉత్సాహంగా ఉన్న తెలంగాణ కార్యకర్తలలో కొంత నిరాశను కలిగించేలా నియామకం జరిగిందా అన్నదే చర్చగా ఉందిట. బీజేపీ గ్రాఫ్ గత కొద్ది సంవత్సరాలుగా తెలంగాణాలో బలపడుతోంది. ముఖ్యంగా బీసీ నేత అయిన బండి సంజయ్ పార్టీకి ప్రాణం పోశారు.

ఆయన దూకుడే పార్టీకి ఎంత మేలు చేసింది. అలాగే చూస్తే కనుక ఈటెల రాజెందర్ ఈ పదవికి ఆశించారు. ఆయన బీఆర్ఎస్ లో పునాది నుంచి ఉన్నారు. ఆయనకు సంస్థాగతంగా నిర్మాణం ఏమిటో తెలుసు అని అంటారు. ఆయనకు బీఆర్ఎస్ లో చాలా మంది పరిచయం ఉన్నారు. అలాగే రాజకీయంగా చూస్తే కనుక ఆయన వ్యూహ రచనలో దిట్ట అంటారు. బీజేపీ ఎదుగుదలకు అది ఎంతో ఉపయోగపడుతుంది అని చెబుతారు.

అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విషయం తీసుకుంటే కూడా ఆయన కూడా బీసీ నేత. ఆయన సైతం జోరు చేస్తారు. పార్టీ కోసం ఎందాకైనా అనంట్లుగా ఉంటారు. మీడియా అటెంక్షన్ బాగా చేయగలరు.

ఇలా పార్టీ బలమైన బీసీ నేతలను ఉంచుకుని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రరావుకు అవకాశం ఇవ్వడం వెనక వ్యూహం ఏమిటో ఎవరికీ అర్ధం కావడం లేదు అని అంటున్నారు. ఇక రామచంద్రరావు ఏపీకి చెందిన సీఎం తెలుగుదేశం నేత చంద్రబాబుకు కొంత సాన్నిహిత్యం ఉన్న వారు అన్న ప్రచారం ఉంది.

అయినా సరే తెలంగాణా రాజకీయాల్లో అది ఏ విధంగా ఉపయోగపడేది కాదనే అంటారు. తెలంగాణాలో బీజేపీ ఉంది. తెలుగుదేశం అయితే పెద్దగా లేదని చెబుతారు. మరి అలాంటపుడు ఎవరు ఉన్నా ఒక్కటే అన్నది ఉంది. ఏపీలో చూస్తే బీసీ నేత పీవీఎన్ మాధవ్ అయితే టీడీపీ విధానాల మీద గతంల పోరాటం చేసిన వారు. అయితే 2014 నుంచి 2019 దాకా ఉన్న రాజకీయం వేరు అని చెబుతారు.

ఇపుడు అది కుదరదని అంటారు. ఇపుడు టీడీపీ బలం మీద కేంద్రంలోని ప్రభుత్వం ఆధారపడి ఉంది. దాంతో పరిమితంగానే బీజేపీ పాత్ర ఏపీలో ఉంటోనిద్. పైగా కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి. మరి ఈ పరిధులు పరిమితులు తెలుసుకుని బీజేపీ కొత్త అధ్యక్షుడు పనిచేయాల్సి ఉంటుంది.

ఏపీలో కూడా అంగబలం అర్ధబలం కలిగిన నేతలు ఎంతో మంది ఉన్నారు. కానీ మాధవ్ కి చాన్స్ ఇచ్చారు. ఆ విధంగా విధేయతకు పెద్ద పీట అని చెబుతున్నా మాధవ్ బీజేపీని ఉత్తరాంధ్రాలో అయినా బలోపేతం చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఏపీలో తెలంగాణాలో ఈ రెండు ఎంపికలూ పార్టీ క్యాడర్ ని అయితే కొంత ఆలోచనలో ఉంచాయని అంటున్నారు. చూడాలి మరి అటు రాముడు ఇటు మాధవుడు తమ పనితీరుతో ఏ విధంగా ఆకట్టుకుంటారో. ఏమేమి చేసి కమలాన్ని ముందుకు నడిపిస్తారో. బీజెపీకి రానున్న రోజులల్లో ఏ రకమైన శుభవార్తలు చెబుతారో.