Begin typing your search above and press return to search.

మోడీ తోనే ఢీ... కమలంలో కలవరం

గత పన్నెండేళ్ళుగా ఈ దేశాన్ని ఎంతో బలమైన నేతగా నరేంద్ర మోడీ ఏలుతున్నారు. అదే సమయంలో పార్టీని కూడా ఆయన గట్టిగానే తన ముద్రతో నడిపిస్తున్నారు.

By:  Satya P   |   2 March 2026 9:09 AM IST
మోడీ తోనే ఢీ... కమలంలో కలవరం
X

గత పన్నెండేళ్ళుగా ఈ దేశాన్ని ఎంతో బలమైన నేతగా నరేంద్ర మోడీ ఏలుతున్నారు. అదే సమయంలో పార్టీని కూడా ఆయన గట్టిగానే తన ముద్రతో నడిపిస్తున్నారు. అధ్యక్షుడు ఎవరు ఉన్నా మోడీ ఇమేజ్ ముందు ఎవరూ పెద్దగా కనిపించని నేపథ్యం ఉంది. ఇదిలా ఉంటే 2014 లో మోడీ ఈ దేశానికి ప్రధాని అయ్యారు. అంతకు ఏడాది ముందు అంటే 2013లో ఆయన జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీకి ప్రధాని అభ్యర్థిగా ఆయన పార్టీ ఆమోదం పొందారు.

బీజేపీ బలం :

ఇదిలా ఉంటే మోడీ గుజరాత్ సీఎం గా ఉన్నపుడు జాతీయ రాజకీయాల్లోకి రాకముందు బీజేపీ సంస్థాగతంగా ఉన్న పరిస్థితి వేరు అని అగుర్తు చేస్తున్నారు. బీజేపీకి ప్రతీ రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉండేది. ఎంతో మంది నాయకులు రాష్ట్ర స్థాయిలో బాహుబలిగా కనిపించేవారు. అంతవరకూ ఎందుకు మోడీ గుజరాత్ లో తిరుగులేని లీడర్ గా ఉన్నారు. ఆయన అలా ఇమేజ్ పెంచుకోబట్టే జాతీయ స్థాయిలోకి కూడా సులువుగా రాగలిగారు. అయితే ఈ రోజున బీజేపీకి ఆ పరిస్థితి ఉందా అన్న ప్రశ్న వస్తోంది. రాష్ట్రాలలో సమర్ధవంతమైన నాయకత్వం కమలం పార్టీకి ఉందా అన్న చర్చ నడుస్తోంది.

మోడీయే అభ్యర్ధిగా :

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మోడీ ఒక వ్యూహం ప్రకారం అక్కడికి ప్రచారానికి వెళ్తారు అని అంటున్నారు. అంతే కాదు మోడీ ఆ రాష్ట్రంలో తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నంతగా విరివిగా ఎన్నికల సభలలో పాల్గొంటారు. ప్రత్యర్థులను ముగ్గులోకి లాగి వారి మీద విమర్శలు చేస్తారు. ప్రతి విమర్శలు కూడా ఉంటాయి. ఈ విధంగా ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా మోడీ వర్సెస్ అదర్స్ అన్నట్లుగా రాజకీయం సాగుతుంది. బీజేపీని గెలిపించడానికి ప్రధాని స్థాయిలో ఉన్న మోడీ రాష్ట్రాలకు ప్రచారానికి రావడం ఆయన జాతీయ రాజకీయాల్లోకి వచ్చాక వచ్చిన కొత్త ఒరవడి అని అంటున్నారు.

వారికి ప్రోత్సాహం :

అంతకు ముందు కూడా ప్రధానులు ప్రచారం చేసినా ఒకటి రెండు సభలతో సరిపెట్టేవారు, రాష్ట్రాలలో బలమైన నాయకులకు ప్రోత్సాహం లభించేది. దాంతో వారే ఎన్నికల వ్య్హూహాలను చూసుకునే వారు, ప్రత్యర్థులతో సరి జోడుగా నిలిచి గట్టిగా ఫైట్ చేసేవారు. జాతీయ నాయకత్వం మద్దతు ని పాక్షికంగా మాత్రమే తీసుకునే వారు అయితే ఇపుడు సీన్ మారడంతో రాష్ట్రాలలో బీజేపీకి బలమైన నాయకత్వం కనిపించడం లేదని అంటున్నారు ఒకవేళ బలంగా నాయకులు ఉన్న వారిని తగ్గించి కొత్త వారిని చాన్స్ ఇస్తూ పోతున్నారు. ఈ రోజున చూస్తే బీజేపీకి రాష్ట్రాలలో బలమైన నేతలు వేళ్ళ మీదనే కనిపిస్తారు అని అంటున్నారు. యూపీలో సీఎం యోగీ ఆదిత్యా నాధ్, మహారాష్ట్రలో దేవందర్ ఫడ్నవీస్ లాంటి వారు మాత్రమే ఉన్నారు. చాలా చోట్ల మాత్రం కొత్త వారే ఉన్నారు. ఇమేజ్ ని బిల్డప్ చేసుకునే లోగానే వారి ప్లేస్ మరొకరికి దక్కుతోంది అన్న చర్చ ఉంది.

సంస్థాగతంగా ఫోకస్ :

బీజేపీని తేడా గల పార్టీ అని గతంలో చెప్పుకునే వారు. ఆ పార్టీలో నాయకులు ముఖ్యం కాదు సంస్థ మాత్రమే ముఖ్యం. ఆ విధంగా చూస్తే కనుక పార్టీ కోసం అంతా కలసి పనిచేస్తారు. ఇక బలమైన నాయకులకు ప్రోత్సాహం కూడా లభిస్తూ ఉంటుంది. అయితే ఇపుడు ఆ స్థితి ఉందా అన్నదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈ ఏడాదిలోనే అనేక చోట్ల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ తరఫున మోడీ అమిత్ షా పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. మరి ఆయా రాష్ట్రాలలో సీఎం అభ్యర్ధి కానీ బలమైన నేతలు కానీ ఉన్నారా అన్నదే కమలం పార్టీలో కలవరం రేపుతున్న అంశం. మోడీ ఉన్నంతవరకూ బీజేపీకి ఢోకా లేకపోవచ్చు. కానీ ఆయన రాజకీయ విరామం తీసుకుంటే బీజేపీ మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాలా అన్నదే పెద్ద ప్రశ్న మరి.