బీజేపీ ఆశ బారెడు.. ఫలితం మూరెడు ..!
గెలిచి.. అధికారంలోకి వచ్చాక.. ఇంకేముంది.. అసలు మా వల్లే ప్రభుత్వం ఏర్పడిందని ప్రచారం చేస్తు న్నారు.
By: Tupaki Desk | 4 July 2025 12:05 PM ISTఆశ ఉండొచ్చు.. కానీ, దానికి కూడా కొన్నిపరిమితులు ఉంటాయి. అయితే.. ఆశే కదా.. ఎంతైనా ఉండొచ్చు అన్న ధోరణిలో కమలం పార్టీ నాయకులు ఉన్నారు. పైపై మెరుగులు చూస్తూ.. కూటమి సర్కారుపై విమ ర్శలు గుప్పిస్తున్నారు. కూటమిగా ఉంటామని చెబుతూనే.. మంత్రి పదవులు, ఇతర నామినేటెడ్ పదవుల విషయంపై ఒకరకంగా యాగీ చేస్తున్నారన్నది పరిశీలకులు చెబుతున్న మాట. 2014-19 మధ్య కూడా ఇలానే తాము బలంగా ఉన్నామన్న భ్రమంలోనే కమల నాథులు కాలం వెళ్లబుచ్చారు.
అందుకే.. ఎడా పెడా.. అప్పట్లోనూ వ్యవహరించారు. కానీ, వాస్తవం ఏంటి? అసలు ప్రజల్లో బలం ఎంత? అనే విషయాలను పరిశీలిస్తే.. బీజేపీకి ఉన్న ప్రజా బలం చాలా చాలా తక్కువ. టీడీపీతో జత కట్టినప్పుడు మాత్రమే ఆ పార్టీ అన్నో ఇన్నో స్థానాల్లో విజయం దక్కించుకుంటోంది. ఇది జగమెరిగిన సత్యం. కానీ, గెలవక ముందు ఒక మాట.. గెలిచిన తర్వాత మరో మాట అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు. గెలిచే వరకు.. టీడీపీతో ఉంటామని అంటారు.
గెలిచి.. అధికారంలోకి వచ్చాక.. ఇంకేముంది.. అసలు మా వల్లే ప్రభుత్వం ఏర్పడిందని ప్రచారం చేస్తున్నారు. పదవుల విషయంలో డిమాండ్లు చేస్తున్నారు. కానీ.. టీడీపీ నాయకులు లేకుండా.. టీడీపీ మద్దతు లేకుండా.. పట్టుమని పది స్థానాల్లో గెలిచింది లేదు. ఈ విషయాన్ని మరిచిపోతున్న వారిలో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. విష్ణుకుమార్ రాజు వంటి వారు అనేక పర్యాయాలు విజయం దక్కించుకున్నారు. కూటమి రాజకీయాలు ఆయనకు కొత్తకాదు.
కానీ, ఎప్పుడు కూటమి విజయం దక్కించుకున్నా..కలివిడి లేకపోగా... వివాదాలకు కారణం అవుతున్నారు. ఇది ప్రభావవంతంగా ప్రజల మధ్యకు చేరడంతో బీజేపీపై ఒకవిధమైన ఆలోచన వ్యక్తమవుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ, దీనిని మరిచిపోతున్నారు. మంత్రిపదవులు, నామినేటెడ్ పదవుల విషయంలో పట్టు బట్టడం.. బహిరంగ విమర్శలు చేయడం ద్వారా.. బీజేపీకి ప్రయోజనం లేదు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుని అసెంబ్లీలో కనీసం 20-40 సీట్లు దక్కించుకునే స్థాయికి ఎదగడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
