Begin typing your search above and press return to search.

హిందూత్వ నుంచి కులం కార్డు వైపుగా బీజేపీ !

భారతీయ జనతా పార్టీ తేడా పార్టీగా తనను తాను ప్రచారం చేసుకుంటూ వచ్చింది.

By:  Tupaki Desk   |   3 May 2025 9:25 PM IST
Caste Census BJP Strategic Shift
X

భారతీయ జనతా పార్టీ తేడా పార్టీగా తనను తాను ప్రచారం చేసుకుంటూ వచ్చింది. అయితే ఒకసారి అధికారం రుచి మరిగాక తేడాలు అన్నీ పోతాయి. అన్నీ ఆ తానులో ముక్కలవుతాయి. బీజేపీ వరిష్ట నేత అటల్ బిహారీ వాజ్ పేయ్ దీని మీద ఒక మాట అన్నారు. అవతల వారు ఏ ఆట అయితే ఏ పద్ధతిలో ఆడతారో తాము కూడా అదే తీరున ఆడాలని ఆయన అంటూ వచ్చేవారు. రాజకీయాల్లో అలా చేయకపోతే ఇబ్బందులు తప్పవని ఆయన చెబుతూ ఉండేవారు.

అందుకే రాజకీయం అంటే కులం మతం ప్రాంతం వర్ణం వర్గం ఇలా చాలా లెక్కలు ఉన్నాయి. వాటినే కాంగ్రెస్ చేస్తే తప్పు అన్న బీజేపీ తాను మాత్రం అదే పని చేస్తూ ఒప్పు అనిపించుకోవాలని చూస్తోంది. తాజాగా కుల గణన విషయంలో బీజేపీ ఆలోచనలు మార్చుకుంది.

ఈ డిమాండ్ ని మొదట కాంగ్రెస్ చేసింది. ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అయితే తరచూ ఇదే విషయం మీద మాట్లాడేవారు. కులాల కుంపట్లు పెట్టి ఒక్కటిగా ఉన్న దేశాన్ని ముక్కలు చేస్తారా అని బీజేపీ తీవ్ర విమర్శలు చేసేది కుల గణన అన్నది అర్థం లేని డిమాండ్ గా కొట్టిపారేసింది కానీ ఇపుడు ఆశ్చర్యకరంగా బీజేపీ అదే తోవను నడుస్తోంది.

దానికి కారణం కాంగ్రెస్ కుల గణన పేరుతో బీసీలను మచ్చిక చేసుకుంటోంది బలమైన కులాలకు దగ్గర అవుతోంది. ఫలితంగా ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ కోసం ప్రయత్నం చేస్తోంది. మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని అంతా చెబుతారు. హిందూత్వ అన్నది బీజేపీ రాజకీయ వ్యూహం అని ప్రత్యర్ధులు విమర్శిస్తారు.

మరి ఆ వ్యూహాన్ని దెబ్బ తీయాలీ అంటే కులం కార్డుని తేవడమే అన్నది ఇప్పటికి మూడున్నర దశాబ్దాల క్రితం మాజీ ప్రధాని వీపీ సింగ్ ఆచరించి చూపించారు ఆయన బీజేపీ రామ మందిర్ నినాదానికి మండల్ నినాదంతో చెక్ పెట్టారు. ఫలితంగా 1991లో జరిగిన ఎన్నికల్లో హిందూత్వతో అధికారంలోకి వద్దామనుకున్న బీజేపీ చాలా దూరంలో ఉండిపోయింది.

ఇక ఇపుడు చూస్తే బీజేపీ మూడు సార్లు వరసగా కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ పార్టీ దగ్గర అస్త్రాలు అన్నీ ఒక వైపు అయిపోయాయి. మరో వైపు చూస్తే 2024 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా కూడా బీజేపీ రాలేకపోయింది. ఇంకో వైపు కుల గణన డిమాండ్ తో కాంగ్రెస్ బీసీలకు చేరువ అవుతోంది. ఇటీవల జరిగిన గుజరాత్ లోని ఏఐసీసీ సభలలో సైతం కాంగ్రెస్ కుల గణన మీదనే తీర్మానం చేసింది.

దాంతో కాంగ్రెస్ వ్యూహాలను పసిగట్టిన బీజేపీ కుల గణనకు జై కొట్టేసింది. ఎటూ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అడ్వాంటేజ్ ని తీసుకుంది. కుల గణన చేపట్టడం ద్వారా దేశంలో అత్యధికంగా ఉన్న బీసీలు ఓబీసీలను మచ్చిక చేసుకునేందుకే బీజెపీ ఈ ట్రంప్ కార్డుని బయటకు తీస్తోంది అని అంటున్నారు.

రానున్న రోజులలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ కుల గణన అన్నది బీజేపీకి ఆ విధంగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఆ వచ్చే ఏడాది గుజరాత్ సహా ఇతర రాష్ట్రలా ఎన్నికలు వీటికి మించి 2029లో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. అందుకే తన ఓటు బ్యాంక్ ని విస్తరించుకుని స్ట్రాంగ్ చేసుకోవడానికే బీజేపీ కుల గణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని అంటున్నారు.

కేవలం హిందూత్వతోనే ఉంటే వర్కౌట్ కాదని కులం కార్డుని తీస్తోంది బీజేపీ. ఒక విధంగా చెప్పాలీ అంటే ఫక్తు రాజకీయ పార్టీ విధానాలనే బీజేపీ అనుసరిస్తోంది. మరి బీజేపీ కుల గణన విషయంలో పై చేయి సాధించే ప్రయత్నాలను కాంగ్రెస్ అడ్డుకోవాలని చూస్తోది. బీసీలు యాభై శాతం కంటే ఎక్కువ ఉంటారని అందువల్ల రిజర్వేషన్లు కూడా 50 శాతం కంటే ఎక్కువ చేయాలని కొత్త డిమాండ్ బీజేపీ ముందు పెడుతోంది. మరి బీజేపీ దీని మీద ఏమంటుందో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా బీజేపీ తన పదునైన వ్యూహాలలో భాగంగానే కుల గణనను హఠాత్తుగా తెర మీదకు తెచ్చింది అని అంటున్నారు.