బీజేపీ-వైసీపీ బంధం.. కూటమికి పారాహుషార్.. !
వైసీపీ అధినేత జగన్‌కు.. బిజెపి అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిందా? అంటే బిజెపి నాయకులు స్వయంగా ఆయనకు ఫోన్ చేశారా? అంటే..
By: Tupaki Desk | 27 Jun 2025 1:00 AM ISTవైసీపీ అధినేత జగన్‌కు.. బిజెపి అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిందా? అంటే బిజెపి నాయకులు స్వయంగా ఆయనకు ఫోన్ చేశారా? అంటే.. ఇలా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. దీనికి ప్రధాన కారణం బిజెపి నుంచి కీలక నాయకుడు ఒకాయన ఫోన్ చేసినట్టు ప్రచారం లోకి రావటమే. దీనికి సంబంధించి ఒక కీలక విశ్లేషకుడు కూడా ఒక వ్యాఖ్య చేశారు. జగన్ పై రెంటపాళ్ల ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడం పట్ల బిజెపిలో కొంత వ్యతిరేకత అయితే వచ్చిందనేది ఆయన చెప్పిన మాట.
ఈ క్రమంలోనే కేంద్రంలో బిజెపి వ్యవహారాలు చూసే ఒక ఉత్తరాది నాయకుడు జగన్ కు ఫోన్ చేశారని చెప్పుకొచ్చారు. అంతేకాదు జగన్ పై కేసు నమోదు చేయడాన్ని కూడా ఖండించారు అనేది విశ్లేషకుడు చేసినటువంటి వ్యాఖ్య. ఈ క్రమంలో అసలు ఏం జరిగిందనేది తెలియకపోయినా బీజేపీ నాయకులు మాత్రం జగన్‌తో టచ్ లో ఉన్నారనేది స్పష్టమైనది. వాస్తవానికి 2024 ఎన్నికల్లో బిజెపితో జగన్ కలివిడిగా ఉంటారని ఆయనతో కలిసి పోటీ చేయాలని బిజెపి నాయకులు భావించినట్టు తెరమీదకు వచ్చింది.
ఈ విషయాన్ని వైసిపి నాయకులు ఒకరిద్దరు కూడా చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత పరిణామాలను గమనిస్తే బిజెపి -టిడిపి-జనసేన తో కలిసి ఎన్నికలకు వెళ్ళింది. విజయం దక్కించుకొని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇన్నాళ్ల తర్వాత అంటే దాదాపు ఒక సంవత్సరం తర్వాత పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ లో కలివిడిగా ఉన్న సమయంలో అనూహ్యంగా జగన్ కు ఫోన్ రావడం ఆయనను పరామర్శించడం లేదా చర్చించడం వంటివి బిజెపి కేంద్ర నాయకత్వం నుంచే జరగడం నిజమైతే రాష్ట్రంలో కూటమి వ్యవహారం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.
ఎందుకంటే వ్యక్తిగతంగా నాయకులను అభిమానించటం లేదా నాయకులను పరామర్శించడం తప్పుకాదు. కానీ బిజెపి ఆఫీసులో కూర్చుని, బిజెపి జండా పట్టుకుని ఇలా తమ ప్రత్యర్థి పట్ల సానుకూలంగా స్పందించడం అంటే పైగా జాతీయస్థాయిలో జరిగిన వ్యవహారం కావడంతో ఇది కచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. పైగా బిజెపి తన అవసరానికి తగిన విధంగా మారుతుంది అన్న చరిత్ర ఉన్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూటమిని పలువురు హెచ్చరిస్తున్నారు.
