Begin typing your search above and press return to search.

మోడీ టీంలో మాజీ ఐపీఎస్.. త‌మిళ‌నాడుపై పెద్ద స్ట్రాట‌జీ!

త‌మిళ‌నాడుపై పెద్ద వ్యూహంతోనే ముందుకు సాగుతున్న బీజేపీ పెద్ద‌లు.. ఈ క్ర‌మంలో మ‌రో నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   12 April 2025 11:15 AM IST
Annamalai BJP Central Minister
X

త‌మిళ‌నాడుపై పెద్ద వ్యూహంతోనే ముందుకు సాగుతున్న బీజేపీ పెద్ద‌లు.. ఈ క్ర‌మంలో మ‌రో నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. త‌మిళ‌నాడుకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి, ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న అన్నామ‌లైని త్వ‌ర‌లోనే కేంద్ర మంత్రి వ‌ర్గంలోకి తీసుకునే అవ‌కాశం ఉంద‌ని రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. అన్నామ‌లై ప్ర‌స్తుతం బీజేపీని ఓ రేంజ్‌లో ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే.. ఆయ‌న‌ను తాజాగా త‌ప్పించారు. ఈయ‌న స్థానంలో గ‌తంలో అన్నాడీఎంకే నుంచి వ‌చ్చిన న‌యినార్ నాగేంద్ర‌కు ప‌గ్గాలు అప్ప‌గించ‌నున్నారు.

ఈ నేప‌థ్యంలో అన్నామ‌లై సేవ‌ల‌ను బీజేపీ కొనియాడింది. త‌మిళ‌నాడులో బీజేపీని పుంజుకునేలా చేయ‌డంలోను, మోడీ సార థ్యాన్ని ఇక్క‌డ ప్ర‌చారం చేయ‌డంలోనూ.. అన్నామ‌లై కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని.. మంచి యువ నాయ‌కుడ‌ని.. కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా కొనియాడ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. అన్నామ‌లైకి మంచి భ‌విత‌వ్యం కూడా ఉంద‌న్నారు. త‌మిళ‌నాట ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన అన్నామ‌లై.. గ‌తంలో ఐపీఎస్‌. క‌ర్ణాట‌క‌లోని దావెన‌గ‌రి జిల్లా ఎస్పీగా ఉన్న స‌మ యంలో ఆయ‌న బీజేపీ లోకి వ‌చ్చారు. అప్ప‌ట్లోనే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌నుంద‌న్న ప్ర‌చారం ఉంది.

అయితే.. ఆయ‌న‌కు త‌మిళ‌నాడు ప‌గ్గాలు అప్ప‌గించారు. గ‌త ఏడాది జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో అన్నామ‌లై బీజేపీ త‌ర‌ఫున పోటీ చేసినా.. ప్ర‌జ‌లు ఆద‌రించ‌లేదు. ఇక‌, ఇప్పుడు త‌మిళ‌నాడులో బీజేపీని పుంజుకునేలా చేయ‌డంతోపాటు.. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని కుదిరితే అధికారం లేకుండా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా అయినా.. గుర్తింపు పొందాల‌న్న ప‌క్కా లెక్క‌ల‌తో బీజేపీ నాయ‌కులు ముందుకు సాగుతున్నారు.

ఈ క్ర‌మంలో బ‌ల‌మైన గ‌ళం, మేధావుల‌ను కూడా ఆక‌ర్షించ‌గల నైపుణ్యం ఉన్న అన్నామ‌లైని కేంద్ర మంత్రిగా చేయ‌డం ద్వారా.. త‌మిళుల‌ను ఆక‌ర్షించ‌వ‌చ్చ‌ని క‌మ‌ల‌నాథులు అంచ‌నా వేసు కుంటున్నారు. అంతేకాదు.. త‌మిళుల సెంటిమెంటు కూడా అన్నామ‌లై ద్వారా త‌మ‌కు ల‌భిస్తుంద‌ని లెక్క‌వేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఇదే రాష్ట్రానికి చెందిన‌ మురుగ‌న్‌.. కేంద్ర మంత్రిగా ఉన్న విష యం తెలిసిందే. ఇప్పుడు అన్నామ‌లైని తీసుకుని కేంద్ర మంత్రిగా చేయ‌నున్న‌ట్టు హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి తెలుస్తోంది. మ‌రి ఏమేర‌కు బీజేపీ వ్యూహం స‌క్సెస్ అవుతుందో చూడాలి.