Begin typing your search above and press return to search.

మమత మాజీ సీఎం!

తాజాగా పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే మమతా బెనర్జీ మాజీ ముఖ్యమంత్రి అయ్యేది ఎపుడో చెప్పేశారు.

By:  Tupaki Desk   |   2 Jun 2025 9:27 AM IST
మమత మాజీ సీఎం!
X

మమతా బెనర్జీని నిర్మమతా అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అంటే ఆమెలో ఏ కోశానా మమత అన్నది లేదని చెబుతూ ఘాటైన విమర్శ చేశారు అన్న మాట. మోడీ బెంగాల్ టూర్ లో ఈ విధంగా వ్యాఖ్యానిస్తే తాజాగా పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే మమతా బెనర్జీ మాజీ ముఖ్యమంత్రి అయ్యేది ఎపుడో చెప్పేశారు.

వచ్చే ఏడాది ఈ పాటికి ఆమె మాజీ సీఎం అవుతారని ఆయన జోస్యం చెప్పారు. 2026లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి తప్పదని అమిత్ షా పదునైన జోతీష్యమే చెప్పారన్న మాట. 2011లో తొలిసారి సీఎం అయిన మమతా అది లగాయతు ముచ్చటగా మూడు సార్లు గెలిచారు. హ్యాట్రిక్ సీఎం అనిపించుకున్నారు.

ఇక 2011 నాటికి బెంగాల్ లో బీజేపీ ఏమీ పెద్దగా లేదు. 2016 నాటి ఎన్నికల్లో అయితే కేవలం మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. ఆ తరువాత ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగింది. అలా 2019 లోక్ సభ ఎన్నికల నాటికి ఏకంగా 22 దాకా అసెంబ్లీ సీట్లను గెలుచుకుని సంచలనం సృష్టించింది.

ఇక దాంతో బెంగాల్ మీద పూర్తి స్థాయిలో గురి పెట్టిన బీజేపీ 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా అధికారంలోకి వచ్చేస్తున్నామన్నతగా హడావుడి చేసింది. అయితే ఓటమి చెందినా 78 దాకా అసెంబ్లీ సీట్లు సాధించింది. ఇది కూడా భారీ విజయం కిందనే లెక్క.

గత అయిదేళ్ళుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ మమత ప్రభుత్వం మీద ధీటైన పోరాటం చేస్తున్న బీజేపీ 2026లో ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగాల్ పీఠం కైవశం చేసుకోవడానికి సిద్ధపడుతోంది. అందుకే వరస పర్యటనలు మొదలయ్యాయి. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో జరిగిన పరిణామాలతో కూడా బీజేపీకి బెంగాల్ లో రాజకీయ అవకాశాలు పెరుగుతున్నాయి.

ఇక వక్ఫ్ బిల్లు ఆమోదం తరువాత బెంగాల్ లో నిరసనతో ఒక వర్గం వారిని మరో వర్గం వారు బెదిరించడం కొన్ని చోట్ల హింస జరగడం తో అక్కడ వాతావరణం సున్నితంగా మారింది. ఇది బీజేపీకి అనుకూలిస్తుంది అని అంటున్నారు. అదే విధంగా పహిల్గాం లో జరిగిన ఉగ్ర దాడితో దేశమంతా ఒక రకమైన ఎమోషనల్ మూడ్ లో ఉంది. అది కూడా బీజేపీకి బెంగాల్ లో పాజిటివ్ వేవ్స్ ని క్రియేట్ చేస్తుందని అంటున్నారు.

దీంతోనే ఎన్నికల సన్నాహాలలో బీజేపీ రెడీ అయిపోయింది. వరసగా ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా వంటి వారు పర్యటనలు చేస్తున్నారు తాజా పర్యటనలో అమిత్ షా అయితే మమతా బెనర్జీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని మమతా బెనర్జీ చెబుతున్నారని అయితే ఆమె గట్టిగా అధికారంలో ఉండేది కొద్ది నెలలు మాత్రమే అని ఆయన అంటున్నారు.

ఆ తరువాత వచ్చేది బీజేపీ ప్రభుత్వమని అందువల్ల వక్ఫ్ చట్టం కచ్చితంగా అమలు చేస్తామని చెబుతున్నారు. అలాగే ఆపరేషన్ సిందూర్ మీద విమర్శలు చేసిన వారికి బెంగాల్ మహిళలు సిందూర్ పవర్ ఏమిటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తారని కూడా అమిత్ షా వ్యాఖ్యానించారు.

ఇక మూడు సార్లు నెగ్గిన మమతకు ఇపుడు అంతటా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అంటున్నారు. పైగా సొంత పార్టీలో కూడా అసంతృపులు ఉన్నాయని అలాగే ఏడాది క్రితం జరిగిన మెడికో హత్యోదంతం వంటివి కూడా కొంత నెగిటివిటీని పెంచాయని చెబుతున్నారు. వీటికి తోడు సున్నితమైన అంశాలతో రాజకీయాన్ని కీలక మలుపు తిప్పే సత్తా ఉన్న బీజేపీ ఈసారి బెంగాల్ పీఠాన్ని కొడుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.