కాషాయం స్థానిక వ్యూహం...టార్గెట్ అక్కడే !
భారతీయ జనతా పార్టీ వయసు ఎంత అంటే 46 ఏళ్ళు అని మాత్రమ చెబుతారు. అయితే కాషాయం పార్టీ అసలైన ఏజ్ మాత్రం ఏడున్నర పదులు.
By: Satya P | 23 March 2026 11:05 PM ISTభారతీయ జనతా పార్టీ వయసు ఎంత అంటే 46 ఏళ్ళు అని మాత్రమ చెబుతారు. అయితే కాషాయం పార్టీ అసలైన ఏజ్ మాత్రం ఏడున్నర పదులు. ఎందుకంటే 1951లో పశ్చిమ బెంగాల్ కి చెందిన డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ బీజేపీని స్థాపించారు. ఆయన కొన్నాళ్ళ పాటు నెహ్రూ మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో సంఘ్ నేతగా ఉన్న శ్యాం ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కేంద్రం ఇవ్వడం 370 ఆర్టికల్ ని వర్తింపచేయడంతో దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. అలా నెహ్రూ మంత్రి వర్గం నుంచి బయటకు వచ్చారు.
సంఘ్ అజెండాతోనే :
కొత్త పార్టీ పెట్టారు. జన సంఘ్ పూర్తిగా హిందూత్వ భావజాలంతో నిర్మాణం అయిన పార్టీ. పైగా ఆర్ఎస్ఎస్ అజెండాలోని అంశాలు మేనిఫేస్ట్లో ఉంచుకుని ముందుకు సాగిన పార్టీ. ఇక ఆ పార్టీ నుంచి మొదట శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఎంపీగా గెలిస్తే జనసంఘ్ రెండవ ఎంపీ అటల్ బిహరీ వాజ్ పేయి. ఇక తరువాత కాలంలో జన సంఘ్ విస్తరించింది. 1960 దశకం మధ్య నాటికి దేశంలో కొన్ని ఉత్తరాది రాష్ట్రంలో బలంగా మారి అధికారం పంచుకుంది కూడా. ఇక 1977లో జనతా పార్టీ ఏర్పాటుతో జన సంఘ్ అందులో విలీనం అయింది. అయితే మూడేళ్ళకే ఆ పార్టీ ప్రభుత్వం కుప్ప కూలడంతో 1980లో ఏప్రిల్ 6న బీజేపీని వాజ్ పేయి స్థాపించారు. అయితే జన సంఘ్ అయినా బీజేపీ అయినా భావజాలం ఒక్కటే. పేర్లు, గుర్తులు మాత్రమే వేరు. జన సంఘ్ కి దీపం గుర్తు ఉంటే బీజేపీకి కమలం పువ్వు గుర్తు ఉంది.
క్యాడర్ కోసం :
ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయిన తరువాత పీవీఎన్ మాధవ్ మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహాలను రాష్ట్రలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేయించారు. వాజ్ పేయి టూ మోడీ అంటూ కొన్నాళ్ళ పాటు ఆ కార్యక్రమం సాగింది. కేంద్ర మంత్రులను కూడా తీసుకుని వచ్చి ర్యాలీలు సభలు నిర్వహించారు. సరిగ్గా ఇపుడు అలాంటి కార్యక్రమంతోనే మాధవ్ వజ్రోత్సవాల వేడుకలను ఏపీ అంతటా నిర్వహించాలని చూస్తునారు. దానికి యాక్షన్ ప్లాన్ ని ప్రకటించారు. ఏప్రిల్ 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ మన ఊరు - మన జెండా కార్యక్రమం చేపడుతున్నట్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రకటించారు.
కేంద్ర పధకల ప్రచారం :
ఇక ఈ కార్యక్రమం ద్వారా పార్టీ ప్రస్థానాన్ని జనాలకు తెలియచేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను గడపగడపకూ చేరవేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా మాధవ్ తెలిపారు. జనసంఘ్ నుంచి నేటి బీజేపీ వరకు జాతీయవాద రాజకీయ స్రవంతి ఏర్పడి 75 ఏళ్లు పూర్తయ్యాయని మాధవ్ చెప్పారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 6న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో నిర్వహిస్తామని అన్నారు. మన ఊరు - మన జెండా కార్యక్రమం మొదటి విడతలో భాగంగా సెప్టెంబర్ వరకు ఆరు నెలల పాటు ఈ ప్రచారం కొనసాగుతుందని చెప్పారు.
కేంద్ర నిధులతో అభివృద్ధి :
ప్రతీ పల్లెలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతోనే అభివృద్ధి సాగుతోందని జనాలకు తెలియచేస్తామని మాధవ్ చెప్పారు. గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అందించే భారీ నిధుల గురించి పల్లె ప్రజలకు వివరిస్తామని ఆయన అన్నారు. గ్రామాలలో సిసి రోడ్ల నిర్మాణం, డ్రైనేజీలు, ఎల్‌ఇడి లైట్లు, గ్రామ సచివాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలు స్మశాన వాటికల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని అన్నారు.
మోడీ మార్క్ సంక్షేమం :
ఇకే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై ప్రజలలో అవగాహన కల్పిస్తామని చెప్పారు. గృహనిర్మాణం మౌలిక సదుపాయాలని కల్పించడంలో కేంద్ర పాత్ర తెలియచేస్తామని వెల్లడించారు. గ్రామీణ ఆవాజ్ యోజన ఇళ్లు, జల జీవన్ మిషన్ ద్వారా కొళాయి కనెక్షన్లు, ఉజ్వల యోజన గ్యాస్ పంపిణీ ఇవన్నీ కేంద్ర పధకాలుగా ఉన్నాయని అవగాహన కల్పిస్తామని అన్నారు. అలాగే ఆరోగ్యం ఆహారానికి సంబంధించి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్రం అందచేసే ఉచిత పంపిణీ, ఆరోగ్య కార్డులు, రైతు సేవా కేంద్రాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు. మొత్తం మీద చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్యాడర్ ని చైతన్యం చేయడం జనంలోకి పార్టీని తీసుకుని వెళ్ళడం కాషాయ దళం లక్ష్యాలుగా ఉందని అంటున్నారు.
