పేరు మార్చాకే బీజేపీ దశ తిరిగింది !
అలా ఏర్పాటు అయిన బీజేపీ 1984లో జరిగిన ఎన్నికల్లో కేవలం రెండే రెండు సీట్లు సాధిచింది వాజ్ పేయ్ సైతం ఓటమి పాలు అయ్యారు అటే పార్టీ పెట్టిన తరువాత వచ్చిన తొలి ఎన్నికలే బీజేపీకి గట్టి షాక్ ఇచ్చాయి.
By: Tupaki Desk | 6 April 2025 7:00 PM ISTభారతీయ జనతా పార్టీ 45వ వార్షికోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటోంది. 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని అనాటి ప్రముఖ నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయ్, మరో వరిష్ట నేత లాల్ క్రిష్ణ అద్వానీ కలసి స్థాపించారు. దీని వెనక ఒక చారిత్రాత్మక సందర్భం ఉంది. బీజేపీకి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆనాడే ఊహించిన వాజ్ పేయ్ అద్వానీ ఒక కఠోర తపస్సుగా భావించి పార్టీని ఏర్పాటు చేశారు.
నిజానికి బీజేపీ కొత్త పేరు పెట్టబడిన పాత పార్టీ. బీజేపీ పుట్టింది జనసంఘ్ నుంచి. ఇక జనసంఘ్ అని పిలువబడే భారతీయ జనసంఘ్ పార్టీ 1951లో శ్యాంప్రసాద్ ముఖర్జీ చే ఢిల్లీలో స్థాపించబడింది. ఆనాడు ఆయన కాశ్మీర్ మీద పోరాటం చేస్తూ స్వయం ప్రతిపత్తి తొలగించాలని డిమాండ్ తో నాటి నెహ్రూ ప్రభుత్వం నుంచి మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు.
ఇక ఆయన పార్టీని స్థాపించిన తరువాత 1952లో జనసంఘ్ తరఫున నెగ్గి ఎంపీగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఇక 1957లో రెండవ ఎంపీగా జనసంఘ్ నుంచి గెలిచిన వారు అటల్ బిహారీ వాజ్ పేయ్. జనసంఘ్ కి ఆ తరువాత బీజేపీకి వాజ్ పేయ్ ఆరాధ్య నాయకుడు అయ్య్యారు.
జన సంఘ్ కాలంలో పూర్తి మెజారిటీ కాకపోయినా ఇతర పార్టీలను కలుపుకుని దేశంలో కొన్ని రాష్ట్రాలలో అధికారంలోకి అరవై దశకం చివరిలో వచ్చింది. అలా జనసంఘ్ ఎదుగుతూ ఎమర్జెన్సీ సమయంలో కీలకమైన పాత్ర పోషించింది. జనసంఘ్ కి రెండు కళ్ళుగా వాజ్ పేయ్ అద్వానీ ఉండేవారు.
కాంగ్రెస్ ని ఓడించడానికి అన్ని పార్టీలూ కలసి ఒకే పార్టీగా విలీనం కావాలన్న నాటి కాంగ్రెస్ ప్రత్యర్ధుల సూచనల మేరకు జనసంఘ్ జనతా పార్టీలో విలీనం అయింది ఇక కేంద్రంలో 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో భారతీయ జనసంఘ్ పార్టీకి చెందిన ప్రముఖులైన అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అద్వానీ లాంటి నాయకులు ప్రముఖ పదవులు నిర్వహించారు. ఎంతో కీలకమైన విదేశాంగ శాఖను వాజ్ పేయ్ నిర్వహిస్త సమాచార ప్రసార శాఖలను ఎల్కే అద్వానీ నిర్వహించారు.
జనతా పార్టీలో అనేక పార్టీలు దిగ్గజ నేతలు ఉన్నారు దాంతో ఆ పార్టీలో లుకలుకలు చివరికి 1979లో జనతా పార్టీ పతనానికి దారి తీశాయి. ప్రభుత్వం కూలిపోయి జనతా పార్టీ చీలికలు పేలికలు అయింది అలా జనతా నుంచి వేరు పడిన తరువాత వాజ్ పేయ్ అద్వానీ ఎంతో ఆలోచించి మొత్తం దేశ ప్రజలను కలుపుకునే విధంగా అందరికీ ఆమోదయోగ్యమైన పేరుగా భారతీయ జనతా పార్టీ పేరుతో స్థాపించారు.
అలా ఏర్పాటు అయిన బీజేపీ 1984లో జరిగిన ఎన్నికల్లో కేవలం రెండే రెండు సీట్లు సాధిచింది వాజ్ పేయ్ సైతం ఓటమి పాలు అయ్యారు అటే పార్టీ పెట్టిన తరువాత వచ్చిన తొలి ఎన్నికలే బీజేపీకి గట్టి షాక్ ఇచ్చాయి. అయినా సరే నిరాశ పడకుండా బీజేపీ పెద్దలు మరింతగా పట్టుదల చూపించి పార్టీని తీర్చిదిద్దారు. అలా 1989 నాటికి నేషనల్ ఫ్రంట్ లో చేరిన బీజేపీ గణనీయమైన సీట్లు సాధించి కేంద్రంలో వీపీ సింగ్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చింది.
1991కి వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ తన బలనాని వందకు దగ్గరగా చేసుకుంది. ఇక 1996లో వచ్చిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 160 ఎంపీలను గెలుచుకుంది. అలా తొలిసారి వాజ్ పేయ్ కేంద్రంలో ప్రధానిగా పదమూడు రోజుల పాటు పనిచేశారు. 1998లో రెండవసారి వాజ్ పేయ్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే 13 నెలలు ఉంది. 1999లో ఎన్డీయేగా ఏర్పాటు చేసి వాజ్ పేయ్ రాజకీయ స్పూర్తిని చూపించారు. అలా భారీ మెజారిటీతో గెలిచి అయిదేళ్ళ పాటు వాజ్ పేయ్ ప్రధానిగా పనిచేసారు.
ఇక తిరిగి 2014 నుంచి ఈ రోజుదాకా మూడు సార్లు గెలిచి నరేంద్ర మోడీ దేశానికి ప్రధానిగా గత పదకొండేళ్ళుగా కొనసాగుతున సంగతి తెలిసిందే. బీజేపీలో ఎంతో మంది ఉద్ధండులు అధ్యక్షులుగా చేశారు. తొలి అధ్యక్షుడు
వాజ్ పేయ్ అయితే ఆయన తరువాత అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి వారు బీజేపీకి దిశా నిర్దేశం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి బంగారు లక్ష్మణ్ వెంకయ్యనాయుడు వంటి వారు సారధ్యం వహించారు.
భారత దేశంలో ఒక వైపు మధ్యే వాద పార్టీలు ఉన్నాయి. లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ లాంటి శతాధిక వృద్ధ పార్టీలు ఉన్నాయి. అయితే బీజేపీ మాత్రం హిందూత్వ నినాదంతో తేడా కలిగిన పార్టీ అని రుజువు చేసుకుంది. భారతీయ మూలాలు సంస్కృతి, ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఒక పార్టీ అని వాటినే తన సిద్ధాంతాలుగా చేసుకుని దేశ ప్రజల మన్ననలు అందుకుని అధికారంలోకి వస్తోంది.
ఈ దేశంలో మెజారిటీ వర్గాలకు అండగా ఒక పార్టీ ఉండాలన్న ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి పుట్టిన పార్టీ బీజేపీ. 1947కి కూడా కేంద్రంలో అధికారంలో ఉండాలని భారీ లక్ష్యాలను పెట్టుకుని ముందుకు సాగుతున్న బీజేపీలో వ్యూహాలకు కొదవ లేదు, నాయకులకు అంతకంటే లేదు, ఈ రోజున బలమైన స్థానంలో దేశంలో ఉన్న బీజేపీ ఏదో నాటికి ఈ దేశాన్ని తాను అనుకున్న తీరున నూరు శాతం మార్చాలని బృహత్తర లక్ష్యంతో ముందుకు సాగుతోంది. దానిని సాధిచేందుకు తగిన వనరులు అన్నీ బీజేపీకి ఉండడమే ఆ పార్టీ విజయ రహస్యం.
