Begin typing your search above and press return to search.

24 గంటల్లో ఒక బిట్ కాయిన్ రూ.4.55 లక్షలు తగ్గిపోయింది

తాజాగా గరిష్ఠ స్థాయికి చేరుకున్న బిట్ కాయిన్.. 24 గంటల్లో భారీ పతనాన్ని చోటు చేసుకోవటం ఆసక్తికరమైంది.

By:  Tupaki Desk   |   16 March 2024 4:33 AM GMT
24 గంటల్లో ఒక బిట్ కాయిన్ రూ.4.55 లక్షలు తగ్గిపోయింది
X

కంటికి కనిపించని.. డిజిటల్ ఫార్మాట్ లో మాత్రమే ఉండే బిట్ కాయిన్ మీద బోలెడన్ని కథనాల్ని చదివి ఉంటారు. అర్థమైనట్లే ఉంటూ అర్థం కానట్లుగా ఉండే ఈ బిట్ కాయిన్ ఆధునిక మాయాజాలంగా అభివర్ణిస్తారు కొందరు. అందుకు తగ్గట్లే దీని వ్యవహారాలు ఉంటాయి. ఒకప్పుడు నామమాత్రం విలువతో ఉండే బిట్ కాయిన్ చూస్తుండగానే భారీ విలువను సొంతం చేసుకోవటమే కాదు.. ఒక్క బిట్ కాయిన్ విలువ గరిష్ఠ స్థాయికి చేరుకోవటం వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా గరిష్ఠ స్థాయికి చేరుకున్న బిట్ కాయిన్.. 24 గంటల్లో భారీ పతనాన్ని చోటు చేసుకోవటం ఆసక్తికరమైంది. తాజాగా బిట్ కాయిన్ విలువ 73వేల డాలర్లకు చేరుకుంది. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.60,59,000 (ఒక్కో డాలర్ ను రూ.83 లెక్కన లెక్కిస్తే) విలువకు చేరుకుంది. గురువారం నాటికి మరింత దూకుడుగా 73,177 డాలర్లకు చేరుకుంది. అంటే.. మన రూపాయిల్లో రూ.60,73,691కు చేరుకుంది.

ఇంతవరకు బాగానే ఉన్నా శుక్రవారం మధ్యాహ్నానానికి మాత్రం 67,899 డాలర్లకు తగ్గిపోయింది. అంటే.. మన రూపాయిల్లో రూ.56,35,617కు తగ్గింది. అంటే.. ఒక్కో బిట్ కాయిన్ మీద నికర నష్టం రూ.4,55,504గా చెప్పాలి. ఆ తర్వాత కాస్తంత కోలుకుంది. శుక్రవారం అర్థరాత్రి పదకొండున్నర గంటల వేళకు 68,340 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్న పరిస్థితి. ఇంత భారీ హెచ్చుతగ్గులు బిట్ కాయిన్ ప్రత్యేకగా చెప్పాలి.

ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. గడిచిన నెల రోజుల్లో బిట్ కాయిన్ 40 శాతం లాభాల్ని నమోదు చేసింది. కాయిన్ గ్లాస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బిట్ కాయిన్ ధర భారీగా తగ్గిన వేళ.. 24 గంటల వ్యవధిలో 526 మిలియన్ డాలర్ల విక్రయాలు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే వెయ్యి బిట్ కాయిన్లు ఉన్న వారి సంఖ్య జనవరి 13 నాటికి 1486గా ఉండగా.. మార్చి 5 నాటికి 1592కు పెరిగింది. కానీ.. మార్చి 13 నాటికి మాత్రం 1579కు తగ్గింది. విపరీతమైన హెచ్చుతగ్గులతో నమోదయ్యే బిట్ కాయిన్ కు సంబంధించిన ఆర్థిక అంశాల్ని చదివే వారికే విపరీతమైన టెన్షన్ పుట్టించేలా ఉంటాయి. అలాంటిది.. వీటిని కలిగి ఉండే వారి బ్లడ్ ఫ్రెషర్ లెవల్స్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయని మాత్రం చెప్పక తప్పదు.