Begin typing your search above and press return to search.

అవును.. ఒక బిట్ కాయిన్ అక్షరాల 1,11,000 డాలర్లు

తాజా పెరుగుదలతో బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెట్టిన వారి ఆనందానికి హద్దే లేకుండా పోయిన పరిస్థితి.

By:  Tupaki Desk   |   23 May 2025 9:22 AM IST
అవును.. ఒక బిట్ కాయిన్ అక్షరాల 1,11,000 డాలర్లు
X

క్రిప్టో కరెన్సీలో కింగ్ మేకర్ గా ఉన్న బిట్ కాయిన్ మరోసారి హిస్టరీ క్రియేట్ చేసింది. క్రిప్టో కరెన్సీలో ఎప్పటికప్పుడు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఈ డిజిటల్ కరెన్సీ తాజాగా గరిష్ఠ విలువకు చేరుకుంది. చరిత్రలో తొలిసారి ఒక బిట్ కాయిన్ విలువ ఏకంగా 1,11,000 డాలర్లకు చేరుకుంది. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.95,43,286గా చెప్పాలి. సింఫుల్ గా చెప్పాలంటే రూ.95.43 లక్షలుగా చెప్పొచ్చు (ఒక డాలర్ ను రూ.85.98 చొప్పున లెక్కేసినప్పుడు).

తాజా పెరుగుదలతో బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెట్టిన వారి ఆనందానికి హద్దే లేకుండా పోయిన పరిస్థితి. బిట్ కాయిన్ దూకుడుకు సంస్థాగత మదుపర్ల నుంచి గిరాకీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు కూడా కారణంగా చెబుతున్నారు. అయితే.. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. క్రిప్టో కరెన్సీని భారతదేశం గుర్తించటం లేదు. ఇందుకు భిన్నంగా ట్రంప్ మాత్రం వీటికి మద్దతు ఇచ్చేలా వ్యవహరిస్తుండటం గమనార్హం.

ఊహకు అందని రీతిలో బిట్ కాయిన్ దూసుకెళ్లటం తెలిసిందే. అయితే.. అప్పుడప్పుడు డౌన్ ఫాల్ అయినా.. అది స్వల్ప వ్యవధి మాత్రమే. ఆ తర్వాత మళ్లీ రికవరీ కావటం.. అంతకు మించిన దూకుడును ప్రదర్శించటం చూస్తున్నదే. ఈ ఏడాది ఆరంభంలో (జనవరి 20న) ఒక బిట్ కాయిన్ ధర 1,11,000 డాలర్ల దగ్గరకు ట్రేడ్ అయ్యింది. అయితే.. ఈ భారీ ధర వద్ద పెద్ద ఎత్తున అమ్మకాలు చోటు చేసుకున్నాయి. దీంతో.. బిట్ కాయిన్ ధర భారీగా పతనమైంది.

ఒక దశలో ఇది 75వేల డాలర్లకు తగ్గిపోయింది. అంటే.. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.64.48 లక్షలకు తగ్గింది. ఇది ఏప్రిల్ ఆరంభంలో ఇలాంటి పరిస్థితి ఉంది. గడిచిన రెండునెలల వ్యవధిలో బిట్ కాయిన్ ధర 35వేల డాలర్ల మేర రికవరీ అయ్యింది. తాజాగా దీని ధర 1,11,000 డాలర్లకు ట్రేడ్ కావటంతో గరిష్ఠ ధరను టచ్ చేసిన రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్ ఆరంభంలో ఒక్క బిట్ కాయిన్ ధర రూ.64.48 లక్షలు ఉంటే.. తాజాగా (మే 21) రూ.95.43 లక్షలకు చేరుకుంది. అంటే.. దగ్గర దగ్గర రెండు నెలల వ్యవధిలో రూ.64.4 లక్షలు పెట్టుబడి పెడితే రూ.95.4 లక్షలకు చేరుకున్నట్లైంది. అంటే.. సుమారు రూ.31 లక్షల లాభమన్న మాట.

ఈ లెక్కల్ని చూసి బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెట్టాలనుకోవటం పెద్ద తప్పే అవుతుంది. బిట్ కాయిన్ ట్రెండ్.. దాని ధర దూకుడు మరింత తేలిగ్గా అర్థమయ్యేందుకు మాత్రమే ఈ విశ్లేషణ. ఇందులో పెట్టుబడి పెట్టమని కానీ.. ఇలాంటి వాటిల్లో ఇన్వెస్టు చేస్తే లాభాలు వస్తాయని చెప్పటం మా ఉద్దేశం ఎంతమాత్రం కాదు. ఆ మాటకు వస్తే ఇదో భారీ రిస్కుగా చెప్పొచ్చు. కళ్ల ముందు కనిపిస్తున్న డబ్బులు.. క్షణాల్లో ఆవిరి అవుతాయన్నది మర్చిపోకూడదు.

తాజాగా బిట్ కాయిన్ దూకుడు నేపథ్యంలో ఇదే తరహాలో ఉండే ఎథిరియం.. సోలానా లాంటి క్రిప్టో కాయిన్స్ విలువ పెరుగుతున్నాయి. ఇందులో మదుపు చేసే వారికి భారీగా లాభాలు వచ్చేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఎథిరియం 2560 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంటే.. సోలానా 172 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇటీవల కాలంలో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అమెరికా. యూరోప్ లాంటి బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో వీటిపై పెరుగుతున్న అవగాహన.. చూపుతున్న ఆసక్తితో పాటు.. ప్రభుత్వాలు సైతం వీటి విషయంలో సానుకూలంగా ఉంటున్నాయన్న సంకేతాలు తాజా దూకుడుకు కారణంగా పేర్కొంటున్నారు.