ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ తో చిన్నారి మృతి... పచ్చి చికెన్ తిన్నారా?
బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా పల్నాడు జిల్లాలో రెండేళ్ల చిన్నారి మరణించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By: Tupaki Desk | 2 April 2025 10:42 AM ISTఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా ఓ చిన్నారి చనిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ కారణంగా రాష్ట్రంలో మనుషులకు సంభవించిన తొలి మరణంగా దీన్ని చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగానే చిన్నారి మరణించినట్లు భారత వైద్య పరిశోధన మండలి నిర్ధారించింది. ఈ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించింది.
అవును... బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా పల్నాడు జిల్లాలో రెండేళ్ల చిన్నారి మరణించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ చిన్నారి మరణానికి బర్డ్ ఫ్లూ వైరసే కారణమని భారత వైద్య పరిశోధన మండలి కూడా నిర్ధారించింది.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. మార్చి 16నే బాలిక చనిపోగా.. పలు పరీక్షల అనంతరం తాజాగా అధికారికంగా ధృవీకరించారు.
వాస్తవానికి మార్చి 4న చిన్నారిని మంగళగిరిలోని ఎయిమ్స్ కు తీసుకొచ్చారు. అప్పటికే ఆమె జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, మూర్చ, విరేచనాలు, ఆహారం తినలేన్ని పరిస్థితిలో ఉంది. దీంతో.. అక్కడి వైద్యులు మార్చి 7న పాప గొంతు, ముక్కు నుంచి తీసిన స్వాబ్ నమూనాలను సేకరించారు.
వీటిలో ఒక శాంపుల్ ఎయిమ్స్ లోని వీ.ఆర్.డీ.ఎల్.కు.. మరొకటి పూణెలోని ఎన్.ఐ.వీ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి) పంపించారు. మరోపక్క ఆమెకు మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు ఆక్సిజన్ సాయంతో చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.. ఆ చిన్నారి మార్చి 16న మృతిచెందింది.
ఇక ఆమె ముక్కు, గొంతు నుంచి తీసిన స్వాబ్ నమూనాలను పరిశీలించిన ఎయిమ్స్ లోని వీ.ఆర్.డీ.ఎల్. లో ఇన్ ఫ్లుయెంజా ఏ పాజిటివ్ గా తేలింది. మార్చి 24న స్వాబ్ నమూనాలను పూణెలోని ఎన్.ఐ.వీకి పంపించగా.. అక్కడ బర్డ్ ఫ్లూ (హెచ్5ఎన్1) వైరస్ గా నిర్ధారించారు. ఈ విషయాన్ని అధికారులు తాజాగా ప్రకటించారు!
పచ్చి కోడి మాంసం తిన్న చిన్నారి!:
ఈ సమయంలో... వైద్యారోగ్య శాఖ అధికారులు తాజాగా చిన్నారి కుటుంబ సభ్యులను విచారించారు. పెంపుడు, వీధి కుక్కలతో బాలిక తరచూ ఆడుకునేదని వారు చెప్పారని అంటున్నారు. ఇదే సమయంలో.. చిన్నారిలో ఫిబ్రవరి 28న జ్వరం లక్షణాలు కనిపించగా... అంతకు రెండు రోజుల ముందు పచ్చి కోడి మాంసం తిన్నట్లు తెలిపారు!
ఈ సందర్భంగా స్పందించిన చిన్నారి తల్లి... కోడి కూరా కోసే సమయంలో పాప అడిగితే ఒక ముక్క ఇస్తే, ఆమె దాన్ని తిన్నదని.. తర్వాతే జబ్బు పడిందని తెలిపారు. గతంలోనూ ఓసారి ఇలాగే ఇచ్చామని వెల్లడించారు!
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!:
రాష్ట్రంలో తొలిసారిగా బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల చిన్నారి చనిపోయిన తొలి కేసు నమోదవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది! ఇదే సమయంలో.. ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇందులో భాగంగా... కోడిమాంస, గుడ్లను 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి మాత్రమే తినాలని వెల్లడించారు!
ఇదే సమయంలో.. జబ్బు పడిన పక్షులు, పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని.. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, పిల్లలను బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉంచాలని.. జ్వరంతోపాటు జలుబు, డబ్బు మొదలైన లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు!
