కాకులు కనిపిస్తే మాస్కులు పెట్టుకోండి.. ప్రభుత్వం హెచ్చరికలు!
అవును... చెన్నై నగరంలో కాకులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. ఇందులో భాగంగా... ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ సుమారు 1,500 కంటే ఎక్కువ కాకులు చనిపోయిన పరిస్థితి.
By: Raja Ch | 6 Feb 2026 11:20 AM ISTఒకప్పుడు ఊర్లలో కాకులు అరుస్తుంటే.. ఆ ఇంటికి బంధువులు వస్తున్నారని సంకేతం అని చాలా మంది నమ్మేవారు. ఇప్పటికీ చాలా మంది దాన్ని నమ్ముతారు. అయితే ఇప్పుడు కాకులు ఎక్కువగా ఉండే పార్కులు, బహిరంగ ప్రదేశాలకు వెళ్తే మాస్కులు ధరించండి అని ప్రభుత్వం సూచనలు చేస్తుంది. అందుకు కారణం కేవలం నెల రోజుల వ్యవధిలో సుమారు 1,500కు పైగా కాకులు మరణించడమే. ఆ మరణాలకు కారణం... బర్డ్ ఫ్లూ! తాజాగా ఈ విషయం నిర్ధారణ కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
అవును... చెన్నై నగరంలో కాకులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. ఇందులో భాగంగా... ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ సుమారు 1,500 కంటే ఎక్కువ కాకులు చనిపోయిన పరిస్థితి. ప్రధానంగా అడయార్ నుంచి ఆవడి, వేలచ్చేరి నుంచి ఈసీఆర్ వరకూ కాకులు రాలిపోతున్నాయి. దీంతో వాటి నమూనాలను భోపాల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కు పంపగా.. వాటిలో హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ ఫ్లుయేంజా (హెచ్5ఎన్1) ఉన్నట్లు తేలింది.
దీంతో... చెన్నై మహానగర పాలక సంస్థ (జీసీసీ), పశుసంవర్ధక శాఖ రంగంలోకి దిగాయి. ఈ సమయంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి బ్లీచింగ్ పౌడర్, బలమైన క్రిమిసంహారక మందులు చల్లుతున్నారు. వైరస్ ఇతర జంతువులకు సోకకుండా.. మరణించిన కాకులను సుమారు 10 అడుగుల లోతులో సున్నం వేసి పూడిచిపెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో పలు కీలక మార్గదర్శకాలు ప్రకటించిన ప్రభుత్వం.. కోళ్లఫారాలపై నిరంతర పర్యవేక్షణ పెంచింది.
ఈ సమయంలో... పక్షులు ఎక్కువగా ఉండే పార్కులు, బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని.. ఇంటి పరిసరాల్లో పక్షులు చనిపోయి కనిపిస్తే వాటిని చేతులతో ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదని.. ప్రధానంగా పిల్లలను ఆ దరిదాపుల్లోకి వెళ్లనివ్వకూడదని తెలిపారు. పచ్చి మాంసం శుభంచేసేటప్పుడు చేతులకు గ్లౌజులు వాడటం శ్రేయస్కరమని సూచించారు. పక్షులు మరణిస్తే.. 1962 హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయాలని తెలిపారు.
