Begin typing your search above and press return to search.

ఆకలి ఉండదు, నొప్పి పుట్టదు, నిద్ర రాదు.. ఏమిటీ అరుదైన వ్యాధి!

అసలు ఆకలనేదే లేకపోతే ఈ ఆరాటం, పోరాటం ఉండవు కదా?.. చేతిలో చిల్లిగవ్వ కూడా లేనప్పుడు చాలా మందికి ఉండే అభిప్రాయం ఇది!

By:  Tupaki Desk   |   17 Jun 2025 9:15 AM IST
ఆకలి ఉండదు, నొప్పి పుట్టదు, నిద్ర రాదు.. ఏమిటీ అరుదైన వ్యాధి!
X

అసలు ఆకలనేదే లేకపోతే ఈ ఆరాటం, పోరాటం ఉండవు కదా?.. చేతిలో చిల్లిగవ్వ కూడా లేనప్పుడు చాలా మందికి ఉండే అభిప్రాయం ఇది! కానీ.. నిజంగానే ఆకలే ఉండని ఓ అమ్మాయి ఈ లోకంలో ఉంది. ఆమెకు ఆకలి ఉండకపోవడమే కాదు.. నొప్పి కూడా తెలియదు. ఇక నిద్ర అంటారా.. కేవలం రోజుకి రెండు గంటలు మాత్రమే. అందుకే ఈమెను 'బయోనిక్ గర్ల్' అని కూడా అంటారు.

అవును... యూకే లోని హడర్స్‌ ఫీల్డ్‌ కు చెందిన ఒలివియా ఫార్న్స్‌ వర్త్ అనే 13 ఏళ్ల అమ్మాయికి అరుదైన జన్యుపరమైన వ్యాధి ఉంది. ఈ వ్యాధి వల్ల ఆమెకు నొప్పి అంటే ఏమిటో తెలియదు.. ఆకలి కూడా అవ్వదు.. రోజుకి రెండు గంటల నిద్ర మాత్రం సరిపోతుంది. దీనికి కారణం ఆమెకు అరుదైన క్రోమోజోమ్ 6పీ డిలీషన్ అనే అరుదైన పరిస్థితి ఉంది. దీంతో.. ఆమె పరిస్థితి వైద్యులను ఆశ్చర్యపరిచింది.

ఒలివియాకు క్రోమోజోమ్ 6పీ డిలిషన్ అనే అరుదైన పరిస్థితి ఉంది. ఇది క్రోమోజోమ్ 6 లోని ఒక జన్యుపరమైన సమస్య. నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిజార్డర్స్ ప్రకారం... ఈ పరిస్థితి ఉన్న వ్యక్తులు మానసిక వైకల్యం, ప్రత్యేకమైన ముఖ లక్షణాలను కలిగి ఉంటారు. అయితే... ఈ ప్రపంచంలో ఇలాంటి సమస్య ఉన్న ఏకైక వ్యక్తి ఒలివియా. దీంతో ఈమె కేసును ప్రపంచంలోని ప్రత్యేకమైన వైద్య రహస్యంగా చెబుతారు!

ప్రపంచాన్ని ఆశ్చర్యపరచిన కారు ప్రమాదం!:

ఒలివియా జీవితంలో అత్యంత షాకింగ్ క్షణాల్లో ఒకటి ఆమెకు ఏడేళ్ల వయసులో జరిగింది. ఆ సమయంలో ఆమెను ఓ కారు ఢీకొట్టి సుమారు 10 మీటర్లు రోడ్డుపై లాక్కెళ్లిపోయింది. ఈ సమయంలో మరో బిడ్డ అయితే తీవ్రంగా గాయపడి, గట్టిగా ఏడ్చేసేవారు! కానీ.. ఒలివియా మాత్రం లేచి నిలబడి.. అంతా ఎందుకు టెన్షన్ పడుతున్నారో తెలియక వెళ్లిపోయింది.

ఇటీవల ఆమె తల్లి ఆ భయానక క్షణాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆమె ఛాతిపై టైర్లు గుర్తులు కూడా ఉన్నాయని.. ఆమె కాలి బొటనవేలు, తుంటిపైన చర్మ లేదని.. అయినప్పటికీ ఆమె ఏడవలేదని.. ఆమెకు అంత తీవ్రమైన గాయమైందని కూడా గ్రహించలేదని తెలిపారు. ఆమె పరిస్థితి ఎంత అసాధారణమైనదో నిజంగా ధృవీకరించే క్షణం అది అని ఆమె అన్నారు.

ఇదే సమయంలో.. ఒలివియా తల్లి ఆమె చిన్నతనంలోనే మరో అసాధారణమైన విషయాన్ని గమనించింది. ఇందులో భాగంగా.. ఆమె చాలా చిన్నప్పటి నుంచీ ఆహారాన్ని తిరస్కరించేది. ఎప్పుడూ ఆకలి అనే మాట అనేది కాదు! ఇప్పుడు కూడా స్కూల్లో పిల్లలతో కలిసి భోజనం చేయడానికి కూర్చుంటుంది.. ఇంట్లో మాత్రం నెలల తరబడి ఆహారాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపదు!

ఇక నిద్ర కూడా బాల్యం నుంచి రాత్రి కేవలం రెండు గంటలు మాత్రమే. ఆమె శరీరానికి ఇలా సహజంగా నిద్ర అవసరం అనిపించకపోవడంతో. ఆమె తల్లి చివరికి వైద్య సహాయం తీసుకోవాల్సి వచ్చింది.

ఈ సందర్భంగా స్పందించిన వైద్యులు... ఒలివియా అనారోగ్యానికి చికిత్స లేదు.. తాము తీసుకోవాల్సిన ఉత్తమ చర్య ఏదైన ఉంటే.. అది ఆమె సాధ్యమైనంత సాధారణ జీవితాన్ని గడపడానికి సహాయం చేయడం అని అన్నారు.