Begin typing your search above and press return to search.

హైదరాబాద్ మార్కెట్ లోకి బయో లిక్కర్.. అసలేంటిది?

అమ్మాయి.. అబ్బాయి అన్న తేడా లేకుండా గడిచిన కొన్నేళ్లుగా ఇష్టారాజ్యంగా తాగేసే ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 April 2024 11:30 AM GMT
హైదరాబాద్ మార్కెట్ లోకి బయో లిక్కర్.. అసలేంటిది?
X

ఆరోగ్యానికి హానికరమని తెలిసినా.. మద్యాన్ని సేవించకుండా ఉండలేనోళ్లు ఎంతోమంది మన చుట్టూ కనిపిస్తారు. అమ్మాయి.. అబ్బాయి అన్న తేడా లేకుండా గడిచిన కొన్నేళ్లుగా ఇష్టారాజ్యంగా తాగేసే ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు మార్కెట్ లో లభించే మద్యం ఆరోగ్యానికి హాని చేస్తుందని.. అందుకు భిన్నంగా తాము ఉత్పత్తి చేస్తున్న బయో లిక్కర్ రోటీన్ కు భిన్నమని దీని తయారీదారులు చెబుతున్నారు.

బయో లిక్కర్స్ అండ్ డిస్టల్లరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తాజాగా బయో లిక్కర్ ను హైదరాబాద్ మహానగరంలో లాంఛ్ చేసింది. ఈ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ బి శ్రీనివాస అమర్నాథ్ పలు వేరియంట్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ బయో లిక్కర్ గురించి ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. అయితే.. ఇక్కడ పాఠకులకు ఒక అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. మామూలు మద్యమైనా.. బయో మద్యమైనా ఆరోగ్యానికి హాని చేయటం ఖాయం. కానీ.. దీని తయారీదారులు మాత్రం తాము తయారు చేసిన బయో లిక్కర్ తో నష్టం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

అలా అని దీనికి సంబంధించిన సైంటిఫిక్ అంశాల్ని తయారీ దారులు వివరంగా చెప్పింది లేదు. తాము తయారు చేసిన బయో లిక్కర్ మోడల్ ప్రపంచంలోనే మొదటిదిగా పేర్కొన్నారు. తులసి.. అల్లం.. పసుపు.. లవంగ.. యాలుకలు.. కలబంద లాంటి వాటితో మద్యాన్ని తయారు చేస్తామని చెబుతున్నారు. అంతేకాదు తమ ఉత్పత్తుల్లో ఎలాంటి సింథటిక్ రుచులు.. రంగుల్ని కూడా ఉపయోగించలేదని చెబుతున్నారు.

అత్యుత్తమ బొటానికల్స్.. హైక్వాలిటీ స్పిరిట్.. మాల్ట్.. బయో ఆల్కలాయిడ్స్ తో వీటిని రూపొందించినట్లుగా చెబుతున్నారు. మద్యపానం చేసే వారి ఆవయువాలపై చెడు ప్రభావం పడకూడదన్న లక్ష్యంతో తాము వీటిని తయారు చేశామని చెబుతున్నారు. తమ ఉత్పత్తులకు యూఎస్ ఎఫ్ డీఏ అనుమతి కూడా లభించినట్లుగా వెల్లడించారు. అయితే.. వీటి ధరలు ఎంతన్న విషయాన్ని మాత్రం వెల్లడించకపోవటం గమనార్హం.తెలంగాణ రాష్ట్రంలో బయో విస్కీ.. బయో బ్రాందీ.. వైల్డ్ పాక్స్ విస్కీ అందుబాటులోకి తెస్తున్నట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఇప్పుడు చెబుతున్నదంతా సమాచారం మాత్రమే అన్న విషయాన్ని మర్చిపోకూడదు.