155 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం.. పిల్లలకు మాత్రం చిల్లిగవ్వే! బిల్ గేట్స్ సంచలన నిర్ణయం!
తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, తన ముగ్గురు పిల్లలకు వారసత్వంగా ఎంత ఆస్తి ఇవ్వనున్నారో ఆయన స్పష్టం చేశారు.
By: Tupaki Desk | 8 April 2025 2:00 AM ISTతల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు సాధారణంగా వారి పిల్లలకు చెందడం సహజం. పేదవారు మొదలుకొని ప్రపంచ కుబేరుల వరకు తమ ఆస్తులను తమ పిల్లలకు సమానంగా పంచుతుంటారు. అయితే, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన బిల్ గేట్స్ మాత్రం దీనికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, తన ముగ్గురు పిల్లలకు వారసత్వంగా ఎంత ఆస్తి ఇవ్వనున్నారో ఆయన స్పష్టం చేశారు.
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం బిల్ గేట్స్ సంపద ప్రస్తుతం 155 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆయనకు మాజీ భార్య మెలిందాతో జెన్నిఫర్ గేట్స్ నస్సార్, రోరీ గేట్స్, ఫోబ్ గేట్స్ అనే ముగ్గురు సంతానం ఉన్నారు. సహజంగా అయితే బిల్ గేట్స్ తన భారీ ఆస్తిని ఈ ముగ్గురు పిల్లలకు సమానంగా పంచుతారు. కానీ, బిల్ గేట్స్ స్వయంగా చెప్పిన దాని ప్రకారం వారికి వారసత్వంగా వచ్చే ఆస్తి ఆయన మొత్తం సంపదలో 1 శాతం కంటే కూడా తక్కువేనట! అంటే, సుమారుగా 1.55 బిలియన్ డాలర్లు మాత్రమే ఆయన తన ముగ్గురు పిల్లలకు వారసత్వంగా ఇస్తారు.
ఈ విషయాన్ని బిల్ గేట్స్ పాడ్‌కాస్ట్‌లో చాలా స్పష్టంగా వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, "నా పిల్లలకు మంచి విద్యను అందించాను. వారికి సరైన విలువలను నేర్పించాను. తండ్రి సంపాదించిన ఆస్తిపై ఆధారపడకుండా వారు సొంతంగా సంపాదించుకోగలరనే నమ్మకం నాకు ఉంది. నేను సంపాదించిన మొత్తంలో 1 శాతం కంటే తక్కువ మాత్రమే వారికి ఇస్తాను. దీన్ని వారసత్వం అని కూడా అనను. మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాలు చేయమని వారిని నేను అడగడం లేదు. వారు సొంతంగా సంపాదించుకోవడానికి, జీవితంలో విజయం సాధించడానికి వారికి అవకాశం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అంతే తప్ప, మన ప్రేమతో వారిని గందరగోళంలోకి నెట్టకూడదని నేను భావిస్తున్నాను" అని గేట్స్ పేర్కొన్నారు.
బిల్ గేట్స్ మాత్రమే కాదు, తాను సంపాదించిన ఆస్తులు కేవలం తన పిల్లల కోసం కాదని భావించే బిలియనీర్లలో ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ వంటి అనేక మంది ఉన్నారు. వీరంతా తమ సంపదలో అధిక భాగాన్ని వారసత్వంగా ఇవ్వడానికి బదులుగా దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో వీరు తీసుకున్న ఈ నిర్ణయాలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాయి.
