Begin typing your search above and press return to search.

చంద్రబాబు.. మీరు సూపర్! ఏపీ సీఎంపై ప్రశంసలు వర్షం

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిభకు ఫిదా అవుతున్నట్లు లేఖ రాశారు గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. తమ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ సేవల్లో ఉత్పమ ఫలితాల సాధానకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.

By:  Tupaki Desk   |   20 May 2025 12:38 PM IST
చంద్రబాబు.. మీరు సూపర్! ఏపీ సీఎంపై ప్రశంసలు వర్షం
X

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిభకు ఫిదా అవుతున్నట్లు లేఖ రాశారు గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. తమ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ సేవల్లో ఉత్పమ ఫలితాల సాధానకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. చంద్రబాబు కష్టం ఊరకే పోదని, ఆంధ్రప్రదేశ్ తోపాటు భారతదేశానికి ఇతర అల్పాదాయ దేశాలకు ఎంతో ఉపయోగపడుతుందని అభినందించారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ఏపీ ప్రభుత్వం-బిల్ గేట్స్ ఫౌండేషన్ మధ్య జరిగిన ఒప్పందం నేపథ్యంలో చంద్రబాబు నాయకత్వాన్ని కొనియాడుతూ బిల్ గేట్స్ రాసిన లేఖ వైరల్ అవుతోంది.

నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నెరవేర్చుతున్న చంద్రబాబుకు బిల్ గేట్స్ తో దాదాపు మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. ఆయన ప్రపంచ కుబేరుడిగా ఉన్న సమయంలోనే హైదరాబాద్ కు ఆహ్వానించి ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి బాటలు వేశారు చంద్రబాబు. 1995లో చంద్రబాబు తొలిసారి సీఎం అయిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా పురోగమించడంతోపాటు నిరుద్యోగ సమస్య నివారణకు ఐటీని ప్రోత్సహించారు. ఇందుకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సహకారం కావాలని భావించి ప్రత్యేకంగా అమెరికా వెళ్లి, ఆయనతో భేటీ అయ్యారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు అప్పట్లో హైదరాబాద్ కు వచ్చిన బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ స్థాపించారని చెబుతారు. ఆ తర్వాత ప్రపంచంలో ఐటీలో మేటి నగరంగా హైదరాబాద్ గుర్తింపు తెచ్చుకుంది.

ఇక విభజన తర్వాత ఏపీలో ఐటీతోపాటు ఏఐ, క్వాంటమ్ కంప్యూటరింగ్, డీప్ టెక్ టెక్నాలజీలను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గత జనవరిలో జరిగిన దావోస్ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు. గేట్స్ ఫౌండేషన్ సేవలను ఏపీలో అందజేయాలని కోరారు. ఆ తర్వాత ఢిల్లీలో చంద్రబాబు-బిల్ గేట్స్ మధ్య భేటీ జరిగింది. ఏపీ ప్రభుత్వానికి విద్య, వైద్యం, వ్యవసాయ ఉత్పత్తుల సేవల విషయంలో సహకారం అందజేయడానికి బిల్ గేట్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అప్పట్లో ఇద్దరి మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని వివరిస్తూ బిల్ గేట్స్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను అరుదైన విషయంగా రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

‘‘మీరు ఆశించే ఏఐ డ్రివెన్ డెసిషన్ మేకింగ్, రియల్ టైమ్ సిస్టమ్, హ్యూమన్ కేపిటల్ డెవలప్‌మెంట్ వంటివి మీ నాయకత్వ ప్రతిభను ప్రస్ఫుటం చేస్తున్నాయని. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ సేవల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు మీరు చేస్తున్న కృషి ఆంధ్రప్రదేశ్ కే కాదు భారత్ సహా అల్పాదాయ దేశాలకు ఎంతో ఉపయోగపడుతుంది’’ అంటూ చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తూ లేఖ రాశారు బిల్ గేట్స్.

కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్ తో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు బిల్ గేట్స్. ఆరోగ్య రంగాన్ని పటిష్ఠపర్చడం, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్, ఏఐ అసిస్టెడ్ క్లినికల్ డెసిషన్ మేకింగ్, మెడ్ టెక్ మాన్యు ఫ్యాక్చరింగ్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దడంపై చంద్రబాబుతో జరిగిన చర్చలు ఫలవంతంగా ఉందని గేట్స్ తన లేఖలో ప్రస్తావించారు. పాలనలో టెక్నాలజీ, ఇన్నోవేషనును బలోపేతం చేయడం ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు మీరు చూపిన ఆసక్తి, మీ చిత్తశుద్ధి, మీ విజన్ కి నిదర్శనమని బిల్ గేట్స్ ప్రశంసించారు. ఈ సారి తాను ఏపీకి వచ్చేనాటికి చంద్రబాబు నాయకత్వంలో తమ భాగస్వామ్యం అద్భుతమైన పురోగతి సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. గేట్స్ ఫౌండేషన్-ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యం మున్ముందు కొనసాగాలని గేట్స్ తన లేఖలో పేర్కొన్నారు.