అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ వైఫల్యాలు.. బిలావల్ భుట్టో ఆవేదన!
అంతేకాకుండా, ఇతర వేదికలపై కూడా మాకు ఎదురుదెబ్బలు తగిలాయి" అని బిలావల్ భుట్టో వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 5 Jun 2025 2:00 AM ISTపాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై ఎదుర్కొన్న ఎదురుదెబ్బల గురించి ఆ దేశ అగ్రనేత బిలావల్ భుట్టో జర్దారీ బయటపెట్టారు. ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడానికి తాను చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను ఆయన అంగీకరించడం గమనార్హం. బిలావల్ భుట్టో, తన దేశానికి చెందిన పార్లమెంటు సభ్యుల ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించి అమెరికాను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
"కాశ్మీర్ అంశం విషయానికి వస్తే, మేము ఇప్పటికీ అడ్డంకులను ఎదుర్కొంటున్నాము. అంతేకాకుండా, ఇతర వేదికలపై కూడా మాకు ఎదురుదెబ్బలు తగిలాయి" అని బిలావల్ భుట్టో వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ నిరంతరం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశం అని ప్రపంచానికి తెలిసినా, బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఉగ్రవాదంపై పోరుకు భారతదేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 'రా' (RAW, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 'ఐఎస్‌ఐ' (ISI) కలిసి పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాలు నిరంతం ఘర్షలు చేసుకుంటే తిరుగుబాటు శక్తులు బలోపేతం అవుతాయని ఆయన పేర్కొనడం విశేషం.
బిలావల్ భుట్టో గతంలో కూడా తన దేశానికి సంబంధించిన వాస్తవాలను వెల్లడించారు. పాకిస్తాన్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్నది నిజమేనని ఆయన ఇటీవల అంగీకరించారు. బిలావల్ భుట్టో వంటి పాకిస్తాన్ అగ్రనేత బహిరంగంగా తమ దేశ వైఫల్యాలను, ఉగ్రవాద సంబంధాలను అంగీకరించడం అంతర్జాతీయ సమాజంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది పాకిస్తాన్ తన విధానాలలో నిజంగా మార్పు కోరుకుంటుందా లేదా ఇది కేవలం అంతర్జాతీయ ఒత్తిడిలో భాగంగా చేసిన వ్యాఖ్యలా అన్నది చూడాలి.
