Begin typing your search above and press return to search.

రాత్రయితే చాలు ఆ ఊళ్లో దహనాలే.. సిసీటీవీ చూసి పోలీసుల షాక్

రాత్రియిందంటే ఆ ఊళ్లో భయపడతారు. ఎవరి బైకు కాలుతుందో తెలియదు. ఎందుకు కాలిపోతుందో అంతకన్నా తెలియని వైనం.

By:  Tupaki Desk   |   15 March 2024 10:30 AM GMT
రాత్రయితే చాలు ఆ ఊళ్లో దహనాలే.. సిసీటీవీ చూసి పోలీసుల షాక్
X

రాత్రియిందంటే ఆ ఊళ్లో భయపడతారు. ఎవరి బైకు కాలుతుందో తెలియదు. ఎందుకు కాలిపోతుందో అంతకన్నా తెలియని వైనం. దీంతో గ్రామస్తుల్లో ఒకటే ఆందోళన. ద్విచక్ర వాహనాలు ఎందుకు కాలిపోతున్నాయి? దీనికి కారణం ఎవరు? ఎవరి నిర్వాకం? అనే కోణంలో ఎంత బుర్ర పీక్కున్నా సమాధానం మాత్రం దొరకలేదు. చివరకు వారు పన్నిన వలలో నిందితుడు ఇరుక్కున్నాడు. ఎలా జరిగిందంటే..

ఆ ఊళ్లో రాత్రయితే చాలు భయం. ఎవరి ద్విచక్ర వాహనం తగలబడుతుందో తెలియని పరిస్థితి. దీంతో గ్రామస్తులు కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ కాపలా కాసిన పరిస్థితిలో మార్పు లేదు. రోజుకో బైకు చొప్పున దహనం అయిపోతూనే ఉంది. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకు ఇలా బైకులు కాలిపోతున్నాయనే దాని మీద చర్యలు తీసుకోవాలని భావించారు.

ఇంటికో సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. ప్రతి రోజు అర్థరాత్రి దాటిన తరువాత ఓ యువకుడు ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ కు నిప్పు పెట్టి పరారవుతున్నాడు. విషయం తెలియక గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. కానీ అతడు మాత్రం తన పనిని నిర్విఘ్నంగా కొనసాగించాడు. రోజు బైకులు మంటల్లో కాలిపోవడం చూస్తుంటే సంబంధిత యజమానులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం రాజాపూర్ గ్రామంలో ఓ యువకుడు అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తరువాత వీధిలో తిరుగుతూ కనిపించిన బైకుకు నిప్పు పెడుతున్నాడు. నిత్యం ఇదే పని చేస్తుండటంతో వారికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. సీసీ కెమెరాల ఏర్పాటుతో అతడి రంగు బయట పడింది. అతడు ఎందుకు బైకులు దహనం చేస్తున్నాడు. అతడి ఉద్దేశం ఏమిటనే దాని గురించి వివరాలు తెలియరాలేదు.

అతడి నిర్వాకం సీసీ కెమెరాలో నిక్షిప్తం కావడంతో గుట్టు రట్టయింది. నిందితుడు గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడే కావడం గమనార్హం. ఇంటి ముందు నిలిపిన బైకులను టార్గెట్ చేసుకుని నిప్పంటించడం అతడి నైజంగా మారింది. ఈ కుట్ర వెనుక ఏ కోణం దాగి ఉందో అన్నట్లు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజానిజాలు విచారణలో తెలిసే అవకాశం ఉందని చెబుతున్నారు.