Begin typing your search above and press return to search.

సీఎం పోస్ట్... ఉదయం రాజీనామా- సాయంత్రం మళ్లీ ప్రమాణం!

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ చకచకా పావులు కదుపుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి

By:  Tupaki Desk   |   28 Jan 2024 8:21 AM GMT
సీఎం పోస్ట్... ఉదయం రాజీనామా- సాయంత్రం మళ్లీ ప్రమాణం!
X

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ చకచకా పావులు కదుపుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా బీహార్ లో రాజకీయ పరిణామాలను మరింత వేగంగా మారుస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) అధినేత నితీశ్ కుమార్.. ఆ రాష్ట్ర గవర్న ర్‌ రాజేంద్ర అర్లేకర్‌ కు తన రాజీనామాను సమర్పించారు. తిరిగి సాయంత్రం మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అవును... బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలతో ఆదివారం ఉదయం సమావేశం అయిన ఆయన... అనంతరం పట్నాలోని రాజ్‌ భవన్‌ కు చేరుకున్నారు. ఈ క్రమంలో తాము మహాకూటమితో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు గవర్నర్‌ కు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పదవికి తన రాజీనామా లేఖను సమర్పించారు.

ఆ సంగతి అలా ఉంటే... మరోవైపు, బీజేపీతో కలిసి సాయంత్రం 4 గంటలకు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు నితీశ్ కుమార్! ఈ మేరకు పార్టీ వర్గాలు ఈ విషయాన్ని వెళ్లడించాయని తెలుసుంది. అయితే... ఉదయం ఆర్జేడీతో కలిసి ఉన్న ప్రభుత్వం కూలిపోగా.. సాయంత్రం బీజేపీతో కలిసి ఏర్పాటు చేయబోతున్న ప్రభుత్వం మొదలవ్వబోతుందన్నమాట. అదేజరిగితే... బిహార్ సీఎంగా నితీశ్ 9వసారి ప్రమాణ స్వీకారం చేసినట్లవుతుంది.

తన రాజీనామా సందర్భంగా రాజ్‌ భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడిన నీతీశ్‌... తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో మహా కూటమి ప్రభుత్వం ముగిసిందని.. అన్ని వర్గాల నుంచి వచ్చిన సూచనల మేరకు కొత్త బంధం కోసం ప్రస్తుత కూటమిని వీడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తమ పూర్వ భాగస్వామి అయిన బీజేపీతో కలిసే ముందుకు సాగుతాం అని వెల్లడించారు.

పాలిటిక్స్ లో "పొత్తులమారి"గా పేరు!:

ఈ స్థాయిలో ఉదయం ఒక పార్టీతో విడాకులు.. ఆ రోజు సాయంత్రమే మరో పార్టీతో కళ్యాణం అన్నట్లుగా నితీశ్ సాగిస్తున్న రాజకీయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే... ఈ టైపు రాజకీయాలు చేయడం నితీశ్ కెరీర్ లో ఇదే మొదటిసారి కాదు. ఈ విషయంలో అయాన సిద్ధహస్తుడు!! ఒకసారి ఆయన పొలిటికల్ కెరీర్ ని నిశితంగా పరిశీలిస్తే... ఈ విషయాలు స్పష్టంగా అర్ధమయ్యే అవకాశం ఉంది!!

1985లో జనతాదళ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నితీశ్ కుమార్... 1994లో సమతాపార్టీని స్థాపించి.. ఎన్.డీ.ఏ.లో చేరారు. ఈ క్రమంలో 2003లో తన పార్టీని జేడీయూలో విలీనం చేశారు. అనంతరం ఆ పార్టీని హస్తగతం చేసుకుని దానికి అధ్యక్షుడైపోయారు. ఈ క్రమంలో కూటమి బలంతో మూడుసార్లు ముఖ్యమంత్రి అయిపోయారు.

ఇదే క్రమంలో లో మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో తొలిసారి ఎన్.డీ.ఏ. కూటమినుంచి బయటకు వచ్చారు. అనంతరం 2015లో తన రాజకీయ శత్రువైన ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ తోనూ కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. కూటమి ఘనవిజయం సాధించడంతో సీఎం పదవి చేపట్టారు.

ఈ క్రమంలో రెండేళ్లకే ఆ మహాకూటమి ప్రభుత్వాన్ని కూల్చేసిన నిటీశ్ కుమార్... తిరిగి ఎన్.డీ.ఏ.తో కలిసి మళ్లీ గద్దెనెక్కారు. ఈ క్రమంలోనే 2020 ఎన్నికల్లో గెలిచి మరోసారి సీఎం అయ్యారు. మరో రెండేళ్లకు, అంటే... 2022లో ఎన్.డీ.ఏ.కూ బై బై చెప్పి మరోసారి ఆర్జేడీ కూటమితో కలిసి సీఎం పదవి చేపట్టారు. అక్కడితో ఆగని ఆయన ఇప్పుడు ఆర్జేడీ కూటమితో తెగతెంపులు చేసుకుని మరోసారి ఎన్.డీ.ఏ.తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నారు.

ఊసరవెల్లితో నీతీశ్‌ పోటీ!:

ఇలా ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి.. నేడు మహాకూటమి నుంచి ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి.. సాయంత్రం బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్న నితీశ్ పై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అయ్యింది. ఇందులో భాగంగా... తరచూ రాజకీయ భాగస్వాములను మార్చే జేడీయూ అధినేత నితీశ్ కుమార్.. రంగులు మార్చే విషయంలో ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని ఎద్దేవా చేసింది.

ఇదే సమయంలో... నితీశ్ రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ స్పందించారు. ఇందులో భాగంగా... బిహార్ ప్రజల అభీష్టాన్ని నితీశ్ కుమార్ విస్మరిస్తున్నారని, ఈ విషయాన్ని వారు ఎట్టిపరిస్థితుల్లో క్షమించబోరని అన్నారు.

ఇదే క్రమంలో... నీతీశ్‌ రాజీనామా చేయనున్నట్లు తమకు ముందే తెలుసని చెప్పిన కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే... నీతీశ్‌ లాంటి "ఆయా రామ్‌.. గయా రామ్‌" మనుషులు దేశంలో చాలా మంది ఉంటారని ఎద్దేవా చేశారు.