బిహార్ ఓటర్ల జాబితాలో విదేశీయులు.. రాజకీయాల్లో కొత్త చర్చ
బిహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు వేడెక్కుతున్న వేళ ఓటర్ల జాబితా చుట్టూ పెద్ద ఎత్తున వివాదం రేగింది.
By: Tupaki Desk | 30 Aug 2025 9:20 AM ISTబిహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు వేడెక్కుతున్న వేళ ఓటర్ల జాబితా చుట్టూ పెద్ద ఎత్తున వివాదం రేగింది. కాంగ్రెస్ సహా విపక్షాలు అనర్హులు, విదేశీయులు కూడా ఓటర్ల జాబితాలో చేరారని ఆరోపిస్తుంటే, ఆధారాలు లేని ఆరోపణలు చేయవద్దని ఎన్నికల సంఘం హెచ్చరిస్తోంది. అయితే తాజాగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, అఫ్గాన్ దేశాలకు చెందిన అనేక మంది బిహార్ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేయించుకున్నట్టు వెలుగులోకి రావడం కొత్త మలుపు తీసుకొచ్చింది.
వారంతా ఆధార్, రేషన్‌కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు వంటి పత్రాలను అక్రమ మార్గాల్లో పొందారని అధికారులు గుర్తించారు. ఇప్పటికే మూడు లక్షల మందికి నోటీసులు జారీ చేసిన ఈసీ, సెప్టెంబరు 1 నుంచి విచారణ ప్రారంభించి, అనర్హులను తొలగించే దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు, ఇప్పటివరకు దాదాపు రెండు లక్షల దరఖాస్తులు ఓటర్ల జాబితాలో మార్పుల కోసం వచ్చినట్లు, వాటిలో ఇరవై ఐదు వేలకుపైగా సమస్యలు పరిష్కరించినట్లు కూడా వెల్లడించింది.
అఫ్గాన్ పౌరులైన ఇద్దరు మహిళలకు బిహార్‌లో ఓటరు కార్డులు జారీ కావడం ఈ అంశాన్ని మరింత తీవ్రంగా మార్చింది. కేంద్ర హోంశాఖ కూడా దీనిపై ప్రత్యేక విచారణ ఆదేశించటం, కేసు ప్రాధాన్యతను చూపిస్తుంది. ఎన్నికల సంఘం మాటల్లో, అనర్హులు, నకిలీ ఓటర్లను జాబితా నుంచి తొలగించడం ఈ సర్వే లక్ష్యం. ఇలాంటి విస్తృత సవరణను ఇరువై ఏళ్ల తర్వాత చేయడం విశేషం.
అయితే, ప్రతిపక్షాల వాదన వేరు. వారి అభిప్రాయం ప్రకారం, ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఈ ప్రక్రియ చేపట్టడం వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని, ముఖ్యంగా ముస్లింలు, వలస కార్మికులు, దళితులు జాబితా నుంచి తప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది.
అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ధర్మాసనం ఈసీ చర్యను రాజ్యాంగబద్ధమైనదిగానే పేర్కొన్నా, సమయాన్ని మాత్రం ప్రశ్నించింది. మొత్తానికి, ఓటర్ల జాబితా సమస్య బిహార్ రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తతకు గురిచేస్తోంది.
