బిహారులో చల్లారని సర్ చిచ్చు.. తాజాగా అగ్గి రాజేసిన జర్నలిస్టు
బిహార్ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్-సర్) ప్రక్రియపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By: Tupaki Desk | 8 Aug 2025 3:18 PM ISTబిహార్ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్-సర్) ప్రక్రియపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకే ఈ కార్యక్రమం చేపట్టారని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తోంది. ఇదే సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని విమర్శలు చేస్తోంది. ఇక తన ఓటు తొలగించారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ గతంలో ఆరోపించగా, ఆయనకు రెండు ఓట్లు ఉండటంతో ఒకదాన్ని తొలగించామని ఈసీ వెల్లడించింది. అంతేకాకుండా తేజస్వి చూపిన ఓటరు కార్డు ఈసీ జారీ చేసింది కాదని చెబుతూ, ఆ ఓటు ఐడీ ఎలా వచ్చిందో తెలియజేయాలని నోటీసు జారీ చేసింది. ఇలా చాలా వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో ఓ జర్నలిస్టు ఈసీ తీరుపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఒకే ఇంట్లో 250 ఓట్లు ఉండటాన్ని ప్రశ్నిస్తూ జర్నలిస్టు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
అది ఇల్లా.. గ్రామమా?
బిహారులోని ముజఫర్పూర్ లోని భగవానపూర్ గ్రామంలో ఒకే ఇంటి నంబరుపై 250 ఓటర్లు ఉన్నట్లు సర్ డ్రాఫ్ట్ లో కనిపిస్తుందని జర్నలిస్టు అజిత్ అంజుమ్ బయటపెట్టారు. ఇదెలా సాధ్యమో చెప్పాలని కోరుతూ ఎన్నికల కమిషనర్ ను ఆయన ఎక్స్ ద్వారా ప్రశ్నించారు. ఒకే ఇంటి నంబరులో నమోదైన ఓటర్లలో వివిధ కులాల వారు ఉన్నారని చెప్పిన జర్నలిస్టు అంజుమ్ ఓటర్ల జాబితాపై అనుమానాలు లేవనెత్తారు. ఓటర్ల జాబితా ప్రకారం ఒకే ఇంట్లో 250 మంది ఉంటే వారి పిల్లలతో కలిపి మొత్తం 300 మంది నివసిస్తున్నట్లు భావించాల్సివస్తోందని, అది ఇల్లా, ఒక గ్రామమా అనేది ఈసీ తెలియజేయాలని ఎక్స్ వేదికగా కోరారు.
నవంబరులో ఎన్నికలు!
బిహార్ లో ఈ ఏడాది నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ తోపాటు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు ఈసీ ఉపక్రమించింది. జూన్ 24న ప్రారంభమైన ఈ ప్రక్రియ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రతిపక్షాల ఓట్ల తొలగింపునకే ఈ కార్యక్రమం చేపట్టారని విపక్ష కూటమిలోని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈసీ చర్యల వల్ల పౌరులు తమ ఓటు హక్కు కోల్పోతున్నారని కాంగ్రెస్, ఆర్జేడీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సుమారు నెల రోజుల పాటు జరిగిన ఓటర్ల జాబితా సవరణలో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారు. గత శుక్రవారం ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురించగా, అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఆచూకీ లేని 35 లక్షల ఓటర్లు
ఓటర్ల జాబితా సవరణకు ముందు రాష్ట్రంలో 7.93 కోట్ల ఓటర్లు ఉండగా, జాబితా సవరణ అనంతరం 7.23 కోట్ల ఓటర్ల మాత్రమే తమ వివరాలను డిజిటలైజేషన్ చేయించుకున్నారు. రాష్ట్రంలో 35 లక్షల మంది ఓటర్లు శాశ్వతంగా వలస వెళ్లినట్లు గుర్తించారు. 22 లక్షల మంది మరణించగా, 7 లక్షల మంది ఓటర్ల పేరు డబుల్ ఎంట్రీగా గుర్తించారు. ఇక ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 1 వరకు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు స్వచ్ఛంద కార్యకర్తలు ముసాయిదా జాబితాపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
