బిహార్‌లో నెట్టింట్లో వైరల్ అయిన ఈ వింత నిర్మాణం
సాధారణంగా మనం ఇల్లు అంటే కొన్ని గదులు, కొంత వెడల్పు, అందులో నివసించేందుకు తగిన స్థలం ఉండేలా ఉంటుంది.
By: Tupaki Desk | 5 July 2025 1:00 AM ISTసాధారణంగా మనం ఇల్లు అంటే కొన్ని గదులు, కొంత వెడల్పు, అందులో నివసించేందుకు తగిన స్థలం ఉండేలా ఉంటుంది. కానీ తాజాగా బిహార్ రాష్ట్రం ఖగాడియా జిల్లాలో ఓ వినూత్న నిర్మాణం నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. దూరం నుంచి చూసే వారికి అది ఎత్తుగా, సన్నగా ఉన్న ఓ గోడలా కనిపిస్తుంది. కానీ ఆ గోడను దగ్గరగా చూస్తే అబ్బా.. ఇది ఏకంగా ఓ నివాస భవనం అనే విషయం అర్థమవుతుంది!
వెడల్పు లేదు.. అంతస్తులుంటే చాలు!
ఈ భవనం నిర్మాణ విధానం సామాన్యులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వెడల్పుగా కనీస స్థలమూ లేకుండా కేవలం కొన్ని అడుగుల పరిమితిలో అనేక అంతస్తులు నిర్మించారు. సామాన్యంగా ఇలాంటివి ల్యాండ్ స్కేర్ప్ కారణంగా విదేశాల్లో చూస్తుంటాం గానీ, మన దేశంలో ప్రత్యేకంగా బిహార్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి నిర్మాణం వైరల్ కావడం విశేషం.
ఈ భవనం ఫొటోను చూసిన నెటిజన్లు మాత్రం కామెంట్లతో సర్వర్‌లు హీటెక్కిస్తున్నారు. "ఇందులో మనుషులు ఎలా నివసిస్తారు?" అని కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తే,
"ఇది బిహార్.. ఇక్కడ ఏదైనా సాధ్యమే!" అంటూ మరికొందరు సెటైర్లు పేల్చారు. "చైనా గోడలా దీన్ని కూడా టూరిస్ట్ స్పాట్ చేయాలి!" అంటూ మరో నెటిజన్ చమత్కరించారు.
ఇలాంటి భవనాలు బిహార్‌లో మామూలే..!
ఇది కొత్తేమీ కాదు. గతంలో బిహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పుర్‌లో ఒక వ్యక్తి కేవలం ఆరు అడుగుల స్థలంలో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. స్థలాభావం ఉన్నపుడు కూడా సృజనాత్మకత, ఆవిష్కరణకు లోటు ఉండదనే అద్భుత ఉదాహరణలే ఇవి.
స్థలం తక్కువగా ఉన్నా.. సరైన ప్రణాళిక, ఉత్సాహం, బలమైన నిర్మాణ పద్ధతులు ఉంటే ఏదైనా సాధ్యమేనని ఈ బిహార్ వాసులు నిరూపిస్తున్నారు. ఇది గోడ కాదు, నిజంగా ఓ ఆశ్చర్యకరమైన ఇల్లు!