Begin typing your search above and press return to search.

రూ.100 కోట్లతో రోడ్డు నిర్మించారు.. మధ్యలో చెట్లను వదిలేశారు!

అవును... చెట్ల మధ్య రోడ్డు వేశారో.. లేక, రోడ్డు పైనే చెట్లు నాటారో అన్నట్లుగా ఉన్న ఓ కొత్త రోడ్డు తాజాగా బీహార్ రాష్ట్రంలో దర్శనమిచ్చింది.

By:  Tupaki Desk   |   1 July 2025 4:00 AM IST
రూ.100 కోట్లతో రోడ్డు నిర్మించారు.. మధ్యలో  చెట్లను వదిలేశారు!
X

ప్రభుత్వం కొత్తగా రోడ్డు నిర్మించింది. ఇంకేముంది.. విశాలంగా, గుంతలు లేకుండా ఉన్న రోడ్డుపై.. ఇరువైపులా ఉన్న చెట్లు చల్ల నుంచి చల్లని గాలి వీస్తుండగా బైక్ పైనో, కారు పైనో వేగంగా వెళ్తుంటే.. ఆ ఆహ్లాదకరమైన డ్రైవింగ్ ని అనుభవించాలని చాలా మందికే ఉంటుంది. అదే రోడ్డు మధ్యలో చెట్లు కనిపిస్తే!? తాజాగా బీహార్ లో అదే జరిగింది.

అవును... చెట్ల మధ్య రోడ్డు వేశారో.. లేక, రోడ్డు పైనే చెట్లు నాటారో అన్నట్లుగా ఉన్న ఓ కొత్త రోడ్డు తాజాగా బీహార్ రాష్ట్రంలో దర్శనమిచ్చింది. దీంతో... రియల్ లైఫ్ లో బైకింగ్ గేమ్‌ గా పరిస్థితి ఉందనే కామెంట్లను సొంతం చేసుకుంది. బీహార్ రాజధాని పాట్నా నుంచి 50 కిలోమీటర్ల దూరంలో జెహానాబాద్ లో కొత్తగా వేసిన రోడ్డు కథ ఇది.

ఇటీవల మధ్యప్రదేశ్‌ లో నిర్మించిన ఓ రైల్వే వంతెన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన ఆ వంతెనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. ఏడుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ సమయంలో తాజాగా మధ్యలో చెట్లను అలాగే ఉంచి రోడ్డు వేసిన ఘటన తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... బీహార్ లోని జెహానాబాద్ లో సుమారు రూ.100 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. అయితే.. ఈ విస్తరణలో ఘోరమైన తప్పు జరిగింది. ఇందులో భాగంగా... జిల్లా యంత్రాంగం రోడ్డు విస్తరణ ప్రాజెక్టును చేపట్టినప్పుడు, అడ్డుగా ఉన్న చెట్లను తొలగించడానికి అనుమతి కోరుతూ అటవీ శాఖను సంప్రదించింది.

అయితే... వీరి రిక్వస్ట్ ని ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ తిరస్కరించింది. నిజంగా రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న చెట్లను నరకాల్సి వస్తే.. అందుకు ప్రతిగా 14 హెక్టార్ల అటవీ భూమికి పరిహారం డిమాండ్ చేసింది. అయితే, జిల్లా యంత్రాంగం ఈ డిమాండ్ ను నెరవేర్చలేకపోయింది. అనంతరం చెట్ల చుట్టూ రోడ్డు నిర్మాణం చేపట్టేసింది.

దీంతో... జెహానాబాద్‌ లో పాట్నా - గయా ప్రధాన రహదారిపై సుమారు 7.48 కి.మీ. పొడవైన రహదారి మధ్యలో చెట్లు ఎత్తుగా నిలబడి ఉన్నాయి. ఆ ప్రాంతంలో రోడ్డు ఇరుకుగా, చిన్న చిన్న చీలికలుగా మారిపోయింది. దీంతో... రూ.100 కోట్లతో ప్రమాదానికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఈ ప్రాజెక్ట్ ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.