బీహార్ బరిలో కేజ్రీవాల్ : బీజేపీ నెత్తిన పాలు పోస్తారా ?
బీహార్ లో మరి కొద్ది నెలలలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్ళీ గెలవాలని అక్కడ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి భావిస్తోంది.
By: Tupaki Desk | 5 July 2025 9:29 AM ISTబీహార్ లో మరి కొద్ది నెలలలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్ళీ గెలవాలని అక్కడ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి భావిస్తోంది. ఈసారి గెలుపు బీజేపీకి చాలా ముఖ్యం. బీహార్ లో అధిక సంఖ్యలో ఎంపీ సీట్లు ఉన్నాయి. అలాగే ఉత్తరాదిన బీహార్ చాలా కీలకమైన రాష్ట్రం. అక్కడ కనుక ప్రతిపక్షం పాగా వేస్తే 2029 లోక్ సభ ఎన్నికల నాటికి వారి రాజకీయ విస్తరణకు బాటలు పడతాయని బీజేపీ ఆలోచిస్తోంది.
అందుకే ఎట్టి పరిస్థితుల్లో అవకాశమే ఇవ్వకూడదని పట్టుదలతో పనిచేస్తోంది. బీజేపీ జేడీయూ ఘట బంధన్ బీహార్ లో బలంగా ఉందని నమ్ముతోంది. మరో వైపు చూస్తే జన సూరజ్ పార్టీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే బరిలో ఉంటున్నారు. ఆయన పార్టీ పోటీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని కూడా లెక్క వేసుకుంటోంది.
అయితే ప్రతీ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో మజ్లిస్ పోటీ చేస్తోంది. ఆ విధంగా ఆ పార్టీ ఇండియా కూటమి ఓట్లను లాగేసుకుంటోంది. దాంతో కూటమికి అది ఇబ్బందిగా మారి ఎన్డీయే భారీగా రాజకీయ లాభం పొందుతోంది. బీహార్ లో చూస్తే ఎక్కువ ముస్లిం డామినేషన్ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మరి ఈసారి కూడా మజ్లిస్ సొంతంగా పోటీకి దిగుతుందా అంటే అలా కాదు అని ఆ పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెబుతున్నారు.
బీజేపీని ఓడించడమే తమ అంతిమ లక్ష్యమని ఆయన చెబుతున్నారు. అందువల్ల తాము కూటమితో పొత్తులకు వెళ్తామని అంటున్నారు. తమకు బలం ఉన్న సీట్లను ఇండియా కూటమి ఇస్తే కనుక కలసి పోటీ చేసి బీహార్ లో ఎన్ డీయే ప్రభుత్వం రానీయకుండా చేస్తామని శపధమే చేస్తున్నారు. మహారాష్ట్రతో పాటు చాలా చోట్ల మజ్లిస్ ఒంటరి పోరు బీజేపీకి కలసి వచ్చింది. ఈసారి మాత్రం అసదుద్దీన్ కొత్త వ్యూహం అనుసరిస్తామని చెప్పడంతో బీహార్ లో బీజేపీకి ఇబ్బందే అని అంతా అనుకుంటున్నారు.
అయితే అదే సమయంలో ఆప్ బీజేపీకి అనుకోని వరాన్ని ఇస్తున్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. బీహార్ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ అధినేత కేజ్రీవాల్ తాజాగా ప్రకటించారు. బీహార్ లో కాంగ్రెస్ తో కానీ ఇండియా కూటమితో కానీ తమకు ఎటువంటి పొత్తులు ఉండవని ఆయన తెగేసి చెబుతున్నారు.
దాంతో బీజేపీ నెత్తిన పాలు పోయడానికేనా ఆప్ అధినేత ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు అన్నది చర్చకు వస్తోంది. నిజానికి ఆప్ చాలా కాలం నుంచే ఒంటరిగా పోటీ చేస్తోంది. ఆ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో కూడా పొత్తులు లేకుండా పోటీకి దిగి కోరి ఓటమిని తెచ్చుకుంది. అయినా సరే తమది అదే రూట్ అంటోంది. గుజరాత్ లో కూడా తాము ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతోంది.
ఆప్ కి కోపం ఏమిటి అంటే ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేసి కాంగ్రెస్ తమ విజయావకాశాలను దెబ్బ తీసింది అని. అందుకే కాంగ్రెస్ శిబిరంలో తాము చేరేది లేదని చెబుతోంది. ఈ విధంగా ఆప్ తీసుకున్న నిర్ణయంతో బీహార్ లో రాజకీయ పరిణామాలు మారుతాయా అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. ఒక వైపు పీకే మరో వైపు ఆప్ ఇలా రెండు పార్టీలు వీలైనంత దాకా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలిస్తే కనుక మరోసారి బీహార్ లో అధికారం తమకు దక్కుతుందని బీజేపీ లెక్క వేస్తోంది.
మరో వైపు మజ్లీస్ తో ఇండియా కూటమి పొత్తు కూడా అంత సులువు కాదని భావిస్తోంది. ఆ పార్టీ అడిగే సీట్లను కనుక కేటాయించకపోతే ఒంటరి పోరుకే మజ్లిస్ కూడా దిగుతుందని భావిస్తోంది. ఇలా విపక్షంలో చీలికలు బలహీనతలే బీహార్ కుర్చీని పదిలంగా తమకు అప్పగిస్తాయని బీజేపీ భావిస్తోందిట. బీజేపీయేతర రాజకీయ పార్టీలలో ఐక్యత ఇపుడు అంతటా కనిపించడం లేదు. కాంగ్రెస్ అందరినీ కలుపుకుని పోయే విషయంలో భేషజాలకు పోతోంది. అది కూడా బీజేపీకి అంది వచ్చిన అవకాశంగా మారుతోంది అని అంటున్నారు. ఈసారి కూడా బీహార్ లో ఓటమి చెందితే లాలూ పార్టీతో పాటు కాంగ్రెస్ కూడా రాజకీయంగా మరిన్ని ఇబ్బందులు చూడాల్సి వస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
