ఎలక్షన్ ఎఫెక్ట్ : ఆగస్టు నుంచి కరెంటు ఫ్రీ
బిహార్ లో ఎన్నికల హడావుడి క్రమంగా ఊపందుకుంటోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచిత పథకాలను ప్రకటిస్తూ ప్రభుత్వం ఎరవేస్తోంది.
By: Tupaki Desk | 17 July 2025 1:14 PM ISTబిహార్ లో ఎన్నికల హడావుడి క్రమంగా ఊపందుకుంటోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచిత పథకాలను ప్రకటిస్తూ ప్రభుత్వం ఎరవేస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల హామీలను గుప్పిస్తున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్.. తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. బిహార్ లో గృహ విద్యుత్ వినియోగదారులు అందరికీ ఉచిత విద్యుత్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. బిహార్ లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రభుత్వం ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తోంది. ఇప్పటికే మహిళలకు రిజర్వేషన్లు, ఉద్యోగాలపై హామీలిచ్చిన సీఎం నితీశ్ కుమార్ ఈ రోజు గృహ విద్యుత్ వాడకం దారులు 125 యూనిట్ల వరకు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఈ నెల నుంచే ఈ పథకం అమలులోకి వస్తుందని, ఆగస్టు నెల బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని ఎక్స్ లో సీఎం నితీష్ పోస్టు చేశారు.
బిహార్ లో తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన నుంచి అందుబాటు ధరల్లో విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంటున్నామని ఎక్స్ లో పోస్టు చేశారు నితీశ్ కుమార్. గృహ వినియోగదారులు 125 యూనిట్ల వరకు విద్యుత్ చార్జీలు లేకుండా వాడుకోవచ్చన్నారు. దీనివల్ల రాష్ట్రంలో 1.67 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం లభించనుందని సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు.
అంతేకాకుండా వచ్చే మూడేళ్లలో గృహ వినియోగదారులకు సోలార్ పవర్ అందజేస్తామని వివరించారు. కుటీర్ జ్యోతి పథకం కింద అత్యంత పేద కుటుంబాలకు ప్రభుత్వ వ్యయంతో సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన కుటుంబాలకు అందుబాటు ధరల్లో సోలార్ ప్యానెల్స్ బిగిస్తామని చెపపారు. రాష్ట్రంలో పది వేల మెగా వాట్ల సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం నితీశ్ కుమార్ చెప్పారు. ఇక వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలను భర్తీ చేస్తామని కూడా సీఎం ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా ప్రతి విభాగంలోని అన్ని పోస్టులకు ప్రత్యేక రిజర్వేషన్ వర్తిస్తుందని తెలిపారు.
