రూ.200 మోసం.. సీఎం అభ్యర్థిపై చిత్రమైన కేసు! అరెస్టు కూడా చేస్తారేమో..
రాజకీయాల్లో చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. ఎన్నికలు వస్తున్నాయంటే ఈ చిత్రాలకు కొదవే ఉండదని అంటారు.
By: Tupaki Desk | 18 Sept 2025 2:00 AM ISTరాజకీయాల్లో చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. ఎన్నికలు వస్తున్నాయంటే ఈ చిత్రాలకు కొదవే ఉండదని అంటారు. ప్రధానంగా ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని అధికార పక్షం అనేక పాచికలు వేస్తుంటుంది. అందులో కేసులు బనాయించడం కూడా ఒకటి అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. రాజకీయ ప్రత్యర్థులను అవినీతి కేసుల్లో ఇరికించి వారి ప్రతిష్టను దెబ్బతీసి రాజకీయంగా పైచేయి సాధించాలని చాలా మంది నాయకులు ఆలోచిస్తుంటారు. అధికారంలో ఉంటే ఈ వ్యూహాన్ని చాలా వేగంగా అమలు చేస్తుంటారు. త్వరలో ఎన్నికలు జరగబోయే బిహార్ లో ఇలాంటి కేసులు నమోదు అవుతుండగా, ప్రతిపక్షాల సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ పై చిత్రమైన అవినీతి కేసు నమోదైంది.
బిహార్ ఎన్నికల్లో ప్రతిపక్ష మహాఘట్ బంధన్ తరఫున సీఎం అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న తేజస్వి యాదవ్ పై తాజాగా ఓ అవినీతి కేసు నమోదు చేశారు పోలీసులు. తేజస్వి కుటుంబంపై అవినీతి ఆరోపణలు కొత్త కాక పోయినప్పటికీ ప్రస్తుతం నమోదైన కేసు తీవ్ర చర్చకు దారితీస్తోంది. కేవలం రూ.200 రూపాయలు తీసుకున్నారని తేజస్విపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వివాదంగా మారింది. ఈ కేసులో ప్రతిపక్షనేత, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తోపాటు రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్, ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే రిషి మిశ్రా, కాంగ్రెస్ నేత మస్కూర్ అహ్మద్ నిందితులుగా చేర్చడం చర్చనీయాంశం అవుతోంది.
ప్రభుత్వ పథకం పేరిట తనను మోసం చేశారని గుడియా దేవి అనే మహిళ తేజస్వి సహా మిగిలిన నేతలపై ఫిర్యాదు చేశారు. మాయి-బెహన్ పథకంలో రూ.2,500 వస్తాయని చెప్పి దరఖాస్తు రుసుం కింద తన వద్ద రూ.200 వసూలు చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్భంగా జిల్లాలోని సింగ్వారా పోలీసుస్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బిహార్ ఎన్నికలకు కొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదల అవుతుంది అనగా, ఈ కేసు నమోదు చేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. కాగా, తమ ఎన్నికల హామీతో నితీశ్ కుమార్ ప్రభుత్వం వణికిపోతోందని, అందుకే ఇలాంటి కేసులు పెడుతోందని ఆర్జేడీ ఆరోపణలు గుప్పతిస్తోంది.
కొద్దిరోజుల్లో జరగబోయే బిహార్ ఎన్నికల్లో మహిళల ఓట్లు ఆకట్టుకునేందుకు ‘మాయి-బెహన్ మాన్ యోజన’ అమలు చేస్తామని ఆర్జేడీ-కాంగ్రెస్ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల్లో తాము గెలిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. మహిళల బ్యాంకు అకౌంట్లలో నేరుగా ఈ డబ్బు జత చేస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో జనాకర్షక పథకం కింద మాయి-బెహన్ మాన్ యోజనపై పెద్ద్ చర్చే జరుగుతోంది. కర్ణాటక ఎన్నికల సమయంలో మహిళలకు ప్రతినెల రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. తెలంగాణలోనూ ఇదేరకమైన హామీ ఇచ్చినా, ఇప్పటివరకు అమలు చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో బిహార్ లో అధికారం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్ ఈ హామీతో మహిళల ఓట్లపై గురి పెట్టారని అంటున్నారు.
