బిహార్ ఎన్నికల్లో మటన్ పాలిటిక్స్
బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ ఇటీవల ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
By: Tupaki Desk | 23 July 2025 6:00 PM ISTబిహార్ రాష్ట్రంలో ఎన్నికల వేడి అంతకంతకూ పెరుగుతోంది. ఈ రాజకీయ ఉష్ణోగ్రతల మధ్య ఇప్పుడు 'మటన్ పాలిటిక్స్' అనే సరికొత్త అంశం తెరపైకి వచ్చి హాట్ టాపిక్‌గా మారింది. ఆశ్చర్యకరంగా ఇప్పుడు ప్రధాన పార్టీల నాయకులను విమర్శించడానికి మటన్, చేపలు వంటి ఆహారపు అలవాట్లే ఆయుధాలుగా మారుతున్నాయి. అధికార ఎన్డీయే కూటమి (జేడీయూ-బీజేపీ)పై ప్రతిపక్ష ఆర్జేడీ తీవ్రస్థాయిలో ఘాటు విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఇది సాధారణ రాజకీయ ఆరోపణ కాదు, మాంసాహారపు అంశాన్ని కేంద్రంగా చేసుకొని రాజకీయ ప్రయోజనాల కోసం దాడులు ముమ్మరం చేస్తున్నారు.
-తేజస్వీ యాదవ్ ట్వీట్‌తో కొత్త వివాదం
బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ ఇటీవల ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది పట్నాలో జరిగిన ఎన్డీయే సమావేశానికి సంబంధించినదని పేర్కొంటూ మటన్ విందుకు సంబంధించిన లేబుల్ ఉన్న పాత్ర వీడియోలో కనిపించిందని ఆరోపించారు. ముఖ్యంగా ఇది శ్రావణ మాసం రెండో సోమవారం రోజున వడ్డించారని ఆరోపిస్తూ భాజపా నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా తేజస్వీ "ప్రధాని మోదీ ఆశీర్వాదంతోనే భాజపా నేతలు శ్రావణ సోమవారం రోజున మటన్ విందు చేసుకుంటున్నారు. మేం తిన్న మాంసాహారం జాతీయ సమస్యగా మారుతుందా?" అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఆ తర్వాత కూడా ఆయన వ్యాఖ్యలను కొనసాగిస్తూ ‘‘సనాతన ధర్మంపై పెద్ద పెద్ద ప్రసంగాలు చెబుతారు, కానీ రోజూ మటన్ తినడమేనట!’’ అని ఎద్దేవా చేశారు.
-గతంలోనూ 'ఫుడ్ పాలిటిక్స్'.. నవరాత్రి, చేపల వివాదం
ఇదే తేజస్వీ యాదవ్ గతంలోనూ మటన్, చేపల కారణంగా విమర్శల పాలయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు, నవరాత్రి సందర్భంగా తేజస్వీ చేపలు తిన్నారని బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. అప్పట్లోనూ ఇదే తరహా 'ఫుడ్ పాలిటిక్స్' నడిచింది. తాజాగా మళ్లీ అదే దృశ్యం తలెత్తుతోంది. ఈ సందర్భంగా తేజస్వీని "సీజనల్ సనాతనవాది"గా బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు.
-రాజకీయాల్లో ఆహారం కీలక ఆయుధమా?
ఇలా బిహార్‌లో మాంసాహారపు అలవాట్లపై దాడులు, విమర్శలు జోరుగా సాగుతున్నాయి. శ్రావణ మాసం, నవరాత్రుల వంటి పవిత్ర సందర్భాల్లో నేతల ఆహారపు అలవాట్లు రాజకీయ చర్చలకు కేంద్రబిందువు అవుతున్నాయి. ఇది పౌర సమాజానికి ఎంతవరకు అవసరం? ఒక నేత మాంసాహారం తీసుకుంటే అది నిజంగా ఆ పార్టీకి, పాలనకు ప్రతిబింబమా? అనేది ప్రస్తుతం ఆలోచించాల్సిన ప్రశ్న.
రైతుల సమస్యలు, నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం వంటి కీలక అంశాలపై రాజకీయ నాయకులు చర్చించాల్సిన సమయం ఇది. కానీ అవన్నీ పక్కనపెట్టి, మటన్ తిన్నారా? చేపలు తిన్నారా? అన్న అంశాలే ముందుకు వస్తుండటం అభ్యుదయవాద ప్రజలెందరికీ ఆమోదయోగ్యం కాదు.
బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ‘మటన్ పాలిటిక్స్’ వంటి వ్యవహారాలు మళ్లీ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇది ప్రజల చైతన్యానికి ఒక పరీక్షే. అసలు సమస్యలను విస్మరించి, ద్వేషానికి బీజం వేస్తున్న ఈ ఫుడ్ పాలిటిక్స్ కంటే, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రధానంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.
