Begin typing your search above and press return to search.

బిహార్ వెళ్తానన్న చంద్రబాబు.. ఎందుకు వెళ్లలేకపోయారు?

కేంద్రంలో మూడో విడత బీజేపీ సర్కార్ ఏర్పడేందుకు చంద్రబాబు, నితీశ్ కుమార్ మూలస్తంభాలుగా నిలబడ్డారు.

By:  Tupaki Political Desk   |   10 Nov 2025 5:26 PM IST
బిహార్ వెళ్తానన్న చంద్రబాబు.. ఎందుకు వెళ్లలేకపోయారు?
X

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు మంగళవారం తుది విడత పోలింగ్ జరగనుంది. రెండు విడతలుగా బిహార్ అసెంబ్లీకి పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఇప్పటికే తొలి విడత ముగియగా, మంగళవారం జరిగే రెండో విడతతో ఎన్నిక ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చినట్లే.. ఈ నెల 14న జరిగే ఓట్ల లెక్కింపుతో బిహార్ ఎన్నికల క్రతువు ముగుస్తుంది. దాదాపు నెల రోజులు సాగిన బిహార్ ఎన్నికల యుద్ధంలో ఎందరో నేతలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కొందరు నేతలు వెళ్లి ప్రచారం చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఏపీ నుంచి మంత్రి లోకేశ్ వెళ్లడం ఒక ఎత్తైతే.. ఆయన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు బిహార్ ప్రచారానికి తాను వెళతానని స్వయంగా ప్రకటించి, వెళ్లకపోవడమే చర్చనీయాంశంగా మారింది.

గత నెల 24న యూఏఈ పర్యటన ముగిసిన తర్వాత ఓ ప్రైవేటు వార్తా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను బిహార్ లో ప్రచారం చేస్తానని చంద్రబాబు స్వయంగా ప్రకటించినట్లు ప్రచారం జరిగింది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉండటం, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తో చిరకాలంగా స్నేహం ఉండటం వల్ల చంద్రబాబు బిహార్ పర్యటనపై అందరిలో అసక్తి కనిపించింది. స్వయంగా ముఖ్యమంత్రి నోటితోనే బిహార్ వెళతానని చెప్పడంతో దక్షిణాదిలో కూడా బిహార్ ఎన్నికపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

కేంద్రంలో మూడో విడత బీజేపీ సర్కార్ ఏర్పడేందుకు చంద్రబాబు, నితీశ్ కుమార్ మూలస్తంభాలుగా నిలబడ్డారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబుకు సంపూర్ణ సహకారం లభిస్తోంది. బిహార్ లో మరోసారి నితీశ్ కుమార్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, కేంద్ర ప్రభుత్వం మరింత బలపడుతుంది. ఈ ఆలోచనతో చంద్రబాబు బిహార్ లో మళ్లీ నితీశ్ గెలవాలని కోరుకుంటున్నారు. ఏపీలో ఒక్కచాన్స్ అని వైసీపీకి అవకాశం ఇస్తే రాష్ట్రం చాలా దెబ్బతిన్నాదని చెబుతున్న చంద్రబాబు.. అదే తప్పు బిహార్లో జరగకూడదని భావిస్తున్నారు. దీంతో స్వయంగా బిహార్ లో పర్యటించి తన వాయిస్ వినిపించాలని అనుకున్నారు.

అయితే చంద్రబాబు స్వయంగా బిహార్ వెళతానని చెప్పినా వెళ్లలేకపోవడమే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. చంద్రబాబు ఏ కారణంతో బిహార్ వెళ్లలేదు..? ఆయన వెళ్లినా? వెళ్లకపోయినా ఒకటే అని భావించారా? లేక ఎన్డీఏ నుంచి ప్రచారానికి ఆహ్వానం రాలేదా? అన్న చర్చ జరుగుతోంది. అయితే ఎన్డీఏ నుంచి ఆహ్వానం లేదన్న ప్రశ్నను టీడీపీ వర్గాలు ఖండిస్తున్నాయి. ఆహ్వానం ఉన్నా బిజీ షెడ్యూల్ వల్ల చంద్రబాబు వెళ్లలేకపోయారని, తన ప్రతినిధిగా మంత్రి లోకేశ్ ను పంపించారని టీడీపీ వర్గాలు వివరిస్తున్నాయి. నిజానికి ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తుండటం వల్ల చంద్రబాబు చాలా బిజీగా ఉన్నారని, ఇలాంటి సమయంలో ఆయన ఆ కార్యక్రమం తప్ప వేరే అంశాలపై ఫోకస్ చేసే పరిస్థితి లేదని అంటున్నారు.