బీహార్ రిజల్ట్...ఏపీకి ఎఫెక్ట్ ?
బీహార్ లో ఒక శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో విశేషం ఏమీ లేదు. షెడ్యూల్ ప్రకారం అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.
By: Tupaki Desk | 27 Oct 2025 3:00 PM ISTబీహార్ లో ఒక శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో విశేషం ఏమీ లేదు. షెడ్యూల్ ప్రకారం అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే గత కొంతకాలంగా చూస్తే ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా దానిని జాతీయ రాజకీయాలకు ముడిపెడుతున్నారు. పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈసారి పూర్తి మెజారిటీ సాధించలేక రెండు ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడింది అన్నది తెలిసిందే. అందులో ఒకటి ఏపీలో టీడీపీ అయితే రెండవది బీహార్ లో జేడీయూ. ఇక ఈ ఎన్నికల్లో ఏమి జరుగుతుంది అన్నది తలపండిన రాజకీయ నిపుణుల నుంచి మహా విశ్లేషకులు అంతా తీవ్రంగానే చర్చిస్తున్నారు.
ఘట్ బంధన్ జోరు :
బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది. ఈసారి గెలుస్తుందా అన్నది ఒక చర్చ. ఎందుకంటే అయిదేళ్ళ పాటు అధికారంలో ఈ ప్రభుత్వం ఉంది. దాంతో పాటుగా రెండు దశాబ్దాలుగా నితీష్ కుమార్ అక్కడ సీఎం గా కొనసాగుతున్నారు. దాంతో మార్పుని కనుక ప్రజలు కోరుకుంటే కచ్చితంగా బీహార్ లో భారీ పరిణామాలకు దారితీసేలా ఎన్నికల ఫలితం వెలువడుతుంది అని అంటున్నారు. బీహార్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూంటే కనుక మహా ఘట్ బంధన్ దూసుకుని పోతోంది. ప్రచారంలో ఒక విధంగా ముందంజలో ఉంది అని చెప్పాలంటున్నారు.
రాహుల్ యాత్రతో స్టార్ట్ :
ఒక వైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దానిని పక్కన పెట్టి బీహార్ లో ఓటర్ అధికార యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయన ఏకంగా పదిహేను రోజుల పాటు బీహార్ మొత్తం కలియతిరిగారు. ఆ విధంగా బీహార్ లో ఎన్నికల ప్రచారాన్ని ఆయన చాలా కాలం ముందే స్టార్ట్ చేశారు. ఓటర్లలో మహా ఘట్ బంధన్ మీద ఒక విధమైన అభిప్రాయానికి ఆయన అవకాశం కలిగించారు అని అంటున్నారు. ఇపుడు యువ నేత తేజస్వి యాదవ్ మరింత దూకుడు చేస్తున్నారు ఆయన యువతను ఆకట్టుకునే విధంగా తన ప్రచారాన్ని మార్చుకున్నారు. ఈ రెండు ఫ్యాక్టర్లు మహా ఘట్ బంధన్ విజయాల మీద ఏ మేరకు ప్రభావం చూపిస్తాయన్నది చర్చగా ఉంది.
అనుకోనిది జరిగి :
ఇక బీహార్ లో మరో సారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని బీజేపీ జేడీయూ నేతలు అంటున్నారు. అయితే ఒకవేళ అనుకోనిది జరిగి మహా ఘట్ బంధన్ కనుక అధికారం అందుకుంటే అపుడు బీహార్ వెలుపల జాతీయ రాజకీయాలు అలాగే ఏపీ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయన్నది బిగ్ డిస్కషన్ గా ఉంది. బీహార్ లో ఎన్డీయే ఓడితే మాత్రం కాంగ్రెస్ కి జాతీయ స్థాయిలో బ్రహ్మాండమైన బలం వస్తుంది. అది జాతీయ రాజకీయాల మీద పెను ప్రభావం చూపిస్తుంది. అంతే కాదు ఏపీ మీద కూడా పడుతుంది. ఏపీలో కూడా కాంగ్రెస్ మళ్ళీ గట్టిగా కూడతీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది వైసీపీకి బాగా ఇబ్బంది పెట్టే అంశం అవుతుంది అని అంటున్నారు.
ఆలోచనలు మారుతాయా :
ఇక ఎన్డీయేకు అత్యంత నమ్మకమైన భాగస్వామిగా ఉన్న టీడీపీ తన బంధాన్ని 2029 ఎన్నికల దాకా కొనసాగించేందుకు వీలు అవుతుందా అన్నది కూడా బీహార్ ఫలితాలు చెప్పనున్నాయా అన్నది మరో చర్చ. బీహార్ లో కాంగ్రెస్ గెలిచి ఆ గాలి కనుక దేశవ్యాప్తంగా బలంగా మారితే మాత్రం కచ్చితంగా ఏపీలోని రాజకీయం కూడా మారుతుందని అంటున్నారు. కాంగ్రెస్ విజయం వైసీపీకి పరోక్ష ప్రత్యక్ష దెబ్బగా ఉంటుంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ ని ప్రత్యర్ధిగా ఉన్న తెలుగుదేశం కూడా వాడుకునేందుకు గట్టిగానే చూస్తుంది అని అంటున్నారు. అలాంటపుడు 2026 లో జరిగే మరిన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా బేరీజు వేసుకుంటూ ఎన్డీయే మిత్రులు తమదైన వ్యూహాలను సిద్ధం చేసుకునే వీలు ఉంటుందని అంటున్నారు. ఇక వైసీపీ వరకూ తీసుకుంటే బీహార్ లో ఎన్డీయే ఓడితే బీజేపీ మరింతగా వైసీపీ మీద తెర చాటుగానైనా సాఫ్ట్ కార్నర్ చూపించే చాన్స్ ఉండొచ్చు అని అంటున్నారు. అదే సమయంలో ఏపీలో కాంగ్రెస్ ప్రభావాన్ని అడ్డుకోవడం వైసీపీకి బిగ్ చాలెంజ్ అవుతుందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా బీహార్ ఫలితాలు నవంబర్ 14న వస్తాయి. వాటి ఎఫెక్ట్ ఏపీ మీద ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తిని కలిగించే అంశంగానే అంతా చూస్తున్నారు.
