Begin typing your search above and press return to search.

వీళ్లు మనుషులేనా? అదనపు కట్నంగా కిడ్నీ అడిగేశారు

దీంతో.. అత్తమామల చూపు కోడలి మీద పడింది. అదనపు కట్నం కింద కిడ్నీ ఇవ్వాలంటూ వేధింపులు మొదలు పెట్టారు.

By:  Tupaki Desk   |   11 Jun 2025 12:00 PM IST
వీళ్లు మనుషులేనా? అదనపు కట్నంగా కిడ్నీ అడిగేశారు
X

డిజిటల్ యుగంలోనూ కట్నం వేధింపులు భారతావనిలో కొనసాగుతున్నాయి. ఈ తరహా వేధింపులు కొత్తేం కాదు. డబ్బులు కావాలని.. వాహనాలు కావాలని.. ఆస్తులు కావాలని కోరటం ఇప్పటివరకు చూసి ఉంటాం. కానీ.. ఈ అత్తమామల రూటు కాస్త సపరేటు. పెళ్లి వేళ తీసుకున్న కట్నకానుకల దాహం తీరలేదు. అదనపు కట్నం కోసం వేధింపులు షురూ చేశారు. ఇలాంటి వేళలో ఆమె భర్త కిడ్నీలు పాడయ్యాయి.

దీంతో.. అత్తమామల చూపు కోడలి మీద పడింది. అదనపు కట్నం కింద కిడ్నీ ఇవ్వాలంటూ వేధింపులు మొదలు పెట్టారు. ఇందుకోసం శారీరకంగా..మానసికంగా వేధింపులకు గురి చేసిన దారుణం బిహార్ లో చోటు చేసుకుంది. ఈ షాకింగ్ ఉదంతంలోకి వెళితే..

ముజఫర్ జిల్లాలోని మిఠన్ పురాకు చెందిన దీప్తికి బోచహాన్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడితో 2021లో వివాహమైంది. మొదట్లో కొంతకాలం అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాత నుంచి అత్తమామల తీరు మారింది. అదనపు కట్నం కోసం వేధింపులు షురూ చేశారు. పుట్టింటికి వెళ్లి అదనపు కట్నం కింద క్యాష్.. బైక్ తీసుకురావాలని వేధించటం మొదలుపెట్టారు. ఇది ఒక కొలిక్కి రాకముందే.. ఆమె భర్త కిడ్నీల్లో ఒకటి పాడైంది.

దీంతో అత్తమామల వేధింపులు కొత్త రూపుకు సంతరించుకున్నాయి. అదనపు కట్నంగా కనీసం ఒక కిడ్నీఅయినా భర్తకు ఇవ్వాల్సిందేనంటూ వేధించటం మొదలు పెట్టారు. కిడ్నీ ఇచ్చేందుకు నిరాకరిస్తుందని పేర్కొంటూ ఆమెను చితకబాదిన అత్తమామలు పుట్టింటికి తరిమేశారు. దీంతో బాధితురాలు దిక్కు తోచని స్థితిలో తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది. అసల విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు మహిళా పోలీసుల్ని ఆశ్రయించారు. రాజీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో అత్తమామలతో సహా మొత్తం నలుగురిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు కట్టారు.