మగాళ్లకు బిహార్ లో కొత్త రిస్కు.. కిడ్నాప్ చేసి పెళ్లి
పకడ్వా వివాహ్ గురించి తెలిసిన తర్వాత మనసుకు అనిపించేది ఒక్కటే.. హమ్మయ్య, బతికిపోయాం.
By: Garuda Media | 14 Feb 2026 11:30 AM ISTపకడ్వా వివాహ్ గురించి తెలిసిన తర్వాత మనసుకు అనిపించేది ఒక్కటే.. హమ్మయ్య, బతికిపోయాం. బిహార్ లో పుట్టలేదని. ఎంతటి మగాడైనా సరే.. బాగా చదువుకొని.. మంచి జాబ్ చేస్తున్నా.. చక్కటి జాబ్ కు అవకాశం ఉన్నా సరే.. ఆ పెళ్లి కాని మగాడు ఏ క్షణంలో అయినా కిడ్నాప్ కావొచ్చు. లేదంటే మత్తులో ముంచేసి.. మత్తు దిగే లోపు ఒక ఇంటివాడిని చేసేయటం.. ఆపై చచ్చినట్లు జీవితాంతం కాపురం చేయాల్సిందే. సింఫుల్ గా సింగిల్ లైన్ లో చెప్పాల్సి వస్తే.. ఇష్టం లేకుండా కిడ్నాప్ చేసి చంపేస్తామని బెదిరించి పెళ్లి చేసుడే.. పకడ్వా వివాహ్ అంటే. బిహార్ లో మాత్రమే కనిపించే ఈ తీరు.. ఇటీవల కాలంలో అంతకంతకూ పెరుగుతుందట.
పకడ్వా వివాహ్ ను అచ్చ తెలుగులో బలవంతపు పెళ్లిగా చెప్పొచ్చు. రీసెంట్ గా (ఫిబ్రవరి 7న) ఈ తరహా పెళ్లి ఒకటి జరగటంతో ఈ వ్యవహారం వైరల్ గా మారి.. మరోసారి పకడ్వా వివాహ్ ఏమిటన్న దానిపై కొత్త చర్చకు తెర తీసింది.పోలీస్ జాబ్ కోసం సీరియస్ గా ట్రై చేస్తున్న నితీశ్ కుమార్ అనే కుర్రాడ్ని కిడ్నాప్ చేసి.. అతడికి మత్తు ఇచ్చి పెళ్లి పీటల మీదకు షిఫ్ట్ చేసి పెళ్లి చేశారు.
పెళ్లి వేళ వరమాల వేయాల్సిన నితీశ్ కనీసం తన చేతిని ఎత్తలేనంత మత్తులో ఉంటే.. పక్కనున్న వ్యక్తి అతడి చేతుల్ని వధువు మెళ్లో దండ వేయించాడు. పెళ్లి అయ్యాక.. మత్తు దిగాక అసలేం జరిగిందీ నితీశ్ వివరంగా ఒక వీడియో చేయటంతో ఈ వ్యవహారం వెలుగు చూసి.. వైరల్ గా మారింది. ఆ రోజు తాను లైబ్రరీకి వెళుతున్నప్పుడు కొందరు తనను బలవంతంగా తీసుకెళ్లి.. కొట్టి.. మత్తుమందు ఇచ్చి మోర్వాలోని ఒక ఆలయానికి తీసుకెళ్లారని చెప్పారు. అక్కడే శంకర్ రాయ్ అనే ఆయన తన కుమార్తె లక్ష్మీ కుమారిని ఇచ్చి పెళ్లి చేశారన్నారు. పెళ్లి తర్వాత తనను వారి ఇంట్లోని ఒక గదిలో తాళం వేసి ఉంచారు. అతను చేసిన వీడియో వైరల్ కావటంతో పోలీసులు స్పందించి.. అతడ్ని సురక్షితంగా వారి చెర నుంచి విడిపించారు.
బిహార్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2020 జనవరి -నవంబరు మధ్య ఈ తరహా బలవంతపు పెళ్లిళ్లు 7194 నమోదు కాగా.. నమోదు కాని కేసులు చాలానే ఉంటాయని చెబుతున్నారు. 2021 నుంచి పకడ్వా వివాహ్ కేసుల సంఖ్య అధికారికంగా లభ్యం కావట్లేదు. ఇంతకూ దేశంలో మరెక్కడా లేని రీతిలో ఈ బలవంతపు పెళ్లిళ్లు ఎందుకు బిహార్ లో మాత్రమే జరుగుతున్నాయన్నది చూస్తే.. వరకట్న సమస్య. ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన కుర్రాళ్లు ఎక్కువ కట్నాలు ఆశించేవారు. వారికి అంత కట్నాలు ఇచ్చుకోని ఆడపిల్లల తండ్రులు.. ఏదో ఒక శుభకార్యంలోనో.. మీటింగ్ కో రప్పించి బలవంతంగా తమ కూతుర్ని ఇచ్చి పెళ్లిళ్లు చేయటం షురూ చేశారు. విషయాన్ని గమనించిన కుర్రాళ్లు జాగ్రత్తలు తీసుకుంటున్నవేళ.. ఆకు రౌడీలను రంగంలోకి దింపి బలవంతపు పెళ్లిళ్లను కంటిన్యూ చేస్తున్నారు. అదీ పకడ్వా వివాహ్ బ్యాక్ గ్రౌండ్. భలే సిత్రంగా ఉంది కదా?
