వింతల్లో కెల్లా వింత.. బిహార్ ప్రభుత్వ అధికారుల ఘనత!!
ఎక్కడా లేని చిత్ర విచిత్రాలు చేయడంలో మన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ట్రాక్ ఉంటుందని విమర్శలు వినిపిస్తుంటాయి.
By: Tupaki Desk | 12 Aug 2025 4:00 AM ISTఎక్కడా లేని చిత్ర విచిత్రాలు చేయడంలో మన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ట్రాక్ ఉంటుందని విమర్శలు వినిపిస్తుంటాయి. ఈ విమర్శలను నిజం చేసేలా కొందరు వ్యవహరిస్తూ చెడ్డ పేరు మూటగట్టుకుంటున్నారు. తాజాగా బిహార్ రాష్ట్రంలోని రెవెన్యూ అధికారులు చేసిన పనితో నెట్టింట నవ్వుల పాలవుతున్నారు. వారి పనితీరును విమర్శిస్తూ నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
బిహార్ లోని రోహ్తాస్ జిల్లాలో ‘క్యాట్ కుమార్’ అనే పేరుతో ఒక నివాస ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. ఇందులో తప్పేముందుని ఎవరికైనా డౌట్ రావచ్చు. అయితే అధికారులు ఆ నివాస ధ్రువీకరణ పత్రం జారీ చేసింది ఓ పిల్లికి. పిల్లిని ఇంగ్లీషులో క్యాట్ అంటారు కదా.. ఓ ఆకతాయి క్యాట్ కుమార్ అనే పేరుతో అధికారులకు దరఖాస్తు పంపితే ముందు వెనక ఆలోచించకుండా రెవెన్యూ అధికారులు నివాస ధ్రువీకరణ పత్రం ఇచ్చేశారు.
అంతేకాకుండా ‘క్యాట్ కుమార్’ తల్లిదండ్రుల పేర్లు కూడా విచిత్రంగా ఉన్నా, అధికారులు పట్టించుకోలేదు. సర్టిఫికెట్ల జారీ సమయంలో తల్లి లేదా తండ్రి పేరు తప్పనిసరిగా రాయాల్సివుంటుంది. ఈ క్రమంలోనే క్యాట్ కుమార్ తల్లిపేరు కటియా దేవి అని, తండ్రి పేరు క్యాట్ బాస్ అంటూ పేర్కొన్నారు. జులై 29న రోహ్తాస్ జిల్లా నస్రిగంజ్ బ్లాక్ అటిమిగంజ్ గ్రామానికి చెందిన వ్యక్తి రైట్ టు పబ్లిక్ సర్వీస్ డొమైన్ లో తన పిల్లికి నివాస ధ్రువీకరణ పత్రం కావాలని దరఖాస్తు చేశాడు. దరఖాస్తులో పిల్లి ఫొటో, ఈమెయిల్, ఫోన్ నంబర్ సైతం నమోదు చేశాడు.
దరఖాస్తులో వివరాలు అన్నీ సరిగా ఉండటంతో అధికారులు ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. అయితే ఈ విషయం ఆన్ లైన్ లో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ ఉదితా సింగ్ సీరియస్ అయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నస్రిగంజ్ రెవెన్యూ అధికారి ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. దీంతో పిల్లికి నివాస ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రభుత్వాన్ని నవ్వుల పాలు చేయడానికే ఈ దరఖాస్తు చేసినట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
ఇక బిహార్ లో ఈ తరహా సంఘటనలు ఇటీవల ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. మరో మూడు నెలల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనగా, ఆ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం తీవ్ర వివాదాస్పదమైంది. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో పిల్లి, కుక్క పేర్లతో నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నాయి. దీంతో రాష్ర్టంలో మరింత గందరగోళం నెలకుంటుంది. తాజాగా పిల్లి పేరుతో నివాస ధ్రువీకరణ పత్రం జారీ అయితే కొద్దిరోజుల ముందు ‘డాగ్ బాబు’ డాగేష్ బాబు అన్న పేర్లతోనూ నివాస ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
