Begin typing your search above and press return to search.

వైసీపీ నుంచే ఎంపీకి భారీ షాకులు

అయితే ఆమె ఎంపీతో కలసి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు కానీ టికెట్ రాదన్న అసంతృప్తి ఆమెలో ఉంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   16 Oct 2023 9:40 AM GMT
వైసీపీ నుంచే ఎంపీకి భారీ షాకులు
X

ప్రత్యర్ధి పార్టీని ఎటూ జయించాలి. వారి ఎత్తుగడలను వ్యూహాలను తట్టుకోవాలి. కానీ సొంత పార్టీ నేతలు సైలెంట్ గా పెడుతున్న మంటను తట్టుకోవడం ఎంతటి నేతకు అయినా అసలు కుదిరే పని కాదు. సొంత వారే ప్రత్యర్ధులుగా మారితే ఇక కష్టాలు కట్టకట్టుకుని వచ్చేసినట్లే అంటున్నారు.

ప్రస్తుతం చూస్తే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పరిస్థితి అచ్చం అలాగే ఉంది అని అంటున్నారు. ఎంవీవీ జగన్ కి అత్యంత సన్నిహితుడు. ఆయనకు అధినాయకత్వం తో బాగా చనువు ఉంది. దాంతో తాను ఈసారికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని చెప్పి మరీ విశాఖ తూర్పు సీటుని సాధించుకున్నారు. ఆయన ఇంచార్జిగా నియమితులయ్యారు.

రెండు నెలల క్రితం ఎంవీవీ నియామకం జరిగింది. కానీ వైసీపీలో ఉన్న మూడు వర్గాలు తూర్పులో ఎంపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అంటున్నారు. విశాఖ తూర్పు సీటు మీద ముగ్గురు నేతలు కన్నేశారు. వారిలో మొదటి వారు ఎంవీవీ ముందటి వరకూ తూర్పు ఇంచార్జిగా ఉన్న వీమ్మార్డీయే చైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మల. ఆమె నాలుగున్నరేళ్ల పాటు తూర్పులో పార్టీని నడిపించారు.

అంతే కాదు 2019 ఎన్నికల్లో ఆమె వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.46 వేల ఓట్ల మెజారిటీతో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి మెజారిటీని సగానికి సగం తగ్గించిన ఘనత తనదే అని ఆమె చెప్పుకుంటున్నారు. తాను లాస్ట్ మినిట్ లో టికెట్ తీసుకుని పోటీ చేస్తేనే అలా జరిగిందని, పైగా పార్టీలో ముఖ్య నాయకులు సహకరించకపోయినా తాను వైసీపీని అలా ముందుకు తెచ్చామని ఆమె అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తాను అని గట్టిగా భావించిన ఆమెకు ఎంవీవీ రూపంలో ఝలక్ తగిలింది. దాంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక 2014లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన మరో కీలక నేత వంశీ క్రిష్ణ శ్రీనివాస్ కి 2019లో టికెట్ దక్కలేదు.ఆయనకు జగన్ అన్యాయం చేయకుండా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు. తూర్పులో ఎవరు అభ్యర్ధి అయినా సహకరించమని చెప్పారు. అయితే 2024 లో తాను పోటీ చేస్తాననే ఇప్పటిదాకా వంశీ తన అనుచరులకు చెబుతూ వచ్చారు. ఇపుడు ఎంవీవీయే అభ్యర్ధి అని తేలడంతో ఆయన కూడా గుస్సా అవుతున్నారు.

ఈ ఇద్దరు నేతలూ తూర్పులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తే డుమ్మా కొట్టారు. అంతే కాదు ఎంవీవీ గడప గడప కార్యక్రమం నిర్వహిస్తున్నా ఎక్కడా కనిపించడంలేదు. విశాఖ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఈ మీటింగుకు హాజరు అయినా ఈ కీలక నేతలు రాకపోవడంతో తూర్పులో పరిస్థితి ఏంటి అన్నది పార్టీ పెద్దలకు అర్ధం అయింది అని అంటున్నారు.

ఇక విశాఖ మేయర్ హరి వెంకట కుమారి కూడా తూర్పు సీటు మీద కన్నేశారు. అయితే ఆమె ఎంపీతో కలసి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు కానీ టికెట్ రాదన్న అసంతృప్తి ఆమెలో ఉంది అని అంటున్నారు. విశాఖ తూర్పులో యాదవ సామాజికవర్గం ఎక్కువ. మొత్తం ఉత్తరాంధ్రాలోని 34 అసెంబ్లీ సీట్లలోనూ తూర్పులోనే ఎక్కువగా యాదవులు ఉన్నారు.

వారికి టికెట్ కేటాయించాలన్న డిమాండ్ ఉంది. బీసీలకు సమ న్యాయం అని చెప్పిన వైసీపీ బీసీ సీటుని ఓసీలకు ఎలా ఇస్తుంది అని ఆ వర్గం నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అయితే వైసీపీ లెక్క వేరేగా ఉంది అని అంటున్నారు. ఓసీ అయిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి మూడు సార్లు అక్కడ నుంచి గెలిచారు అంటే అక్కడ బీసీలే ఓసీని సపోర్టు చేస్తున్నారు అని అంటున్నారు.

అంగబలం అర్ధబలంతో వెలగపూడి గెలుస్తున్నారని, అందుకే ధీటైన అభ్యర్ధిగా వెలగపూడి సామాజికవర్గానికి చెందిన ఎంవీవీని బరిలోకి దించుతున్నామని వైసీపీ అంటోంది. తాము బీసీ నేతలకు ఎలాంటి అన్యాయం చేయలేదని, వారికి కీలక పదవులు ఇచ్చామని గుర్తు చేస్తున్నారు. అయితే ఎంవీవీ తో జత కలిసేందుకు తూర్పులోని ప్రధాన నాయకులు మాత్రం ఆసక్తిని చూపించడంలేదు.

దీంతో ఎంవీవీ గెలుపు ఆశల మీద అపుడే నీలి నీడలు కమ్ముకుంటున్నాయా అన్న చర్చ సాగుతోంది. ఇక జగన్ విశాఖ టూర్ లో ఎమ్మెల్సీ వంశీ క్రిష్ణ కనిపించారు. అలాగే జగన్ తో టచ్ లో ఉంటున్నారు. కానీ వీమ్మార్డీయే చైర్ పర్సన్ మాత్రం చాలా కాలంగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించడంలేదు అంటున్నారు. చూడాలి మరి తూర్పు లో వైసీపీ మంటలను జగన్ ఎలా చల్లారుస్తారో.